Pawan Kalyan Bharat:: ఇండియాను భారత్ గా మార్చబోతున్నారన్న వార్త హల్చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. జి 20 సమ్మిట్ ఆహ్వాన పత్రికలో భారత్ అని పేర్కొనడం ఇప్పుడు అందరిలోనూ చర్చనీయాంశం అవుతుంది. జి 20 సమ్మిట్ ఆహ్వాన పత్రికలో రాష్ట్రపతి ద్రౌపది ముర్మను ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని సంబోధించాల్సి ఉండగా ది ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని రాయడం వివాదాస్పదంగా మారింది. త్వరలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి ఇండియా పేరును మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఓ తీర్మానాన్ని తీసుకురాబోతుందని జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలో సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుండగా… గతంలో ఓ కార్యక్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇండియా, భారత్ గురించి మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
ఆ మధ్యన వచ్చిన మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నర్సింహారెడ్డి సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ మాట్లాడారు. ఇండియా అనేది బ్రిటిష్ వాళ్ళు పెట్టిన పేరు అని.. భారతదేశం అనేది మనదని అప్పట్లో పవన్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియోను జనసేన వీరాభిమానులు, శ్రేణులు పెద్ద ఎత్తున వైరల్ చేస్తున్నాయి. దీనిపై పలువురు మద్దతుగా నిలుస్తుండగా.. మరికొందరు మాత్రం పవన్ వ్యాఖ్యలను తప్పుపడుతున్నారు. బ్రిటిష్ వాళ్ళు పేరు పెట్టారు అని అంటున్నారు సరే.. వారు కట్టిన ఆసుపత్రులు,స్కూల్స్, రైల్వే బ్రిడ్జిలు ఇప్పటికీ ఉన్నాయి కదా.. వాటిని కూల్చేస్తారా? అని సెటైరికల్ గా ప్రశ్నిస్తున్నారు. మరికొందరు కాంగ్రెస్తో కూడిన కూటమికి ఇండియా అని పేరు పెట్టారని.. అందుకే ఆ పేరును మార్చేయడానికి ప్రయత్నిస్తున్నారు అని మరికొందరు ఆరోపిస్తున్నారు.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఎన్డీఏ కూటమిలో ఉన్నారు. ఏపీలో మిగతా పార్టీల కంటే.. పవన్ లో జాతీయ భావం ఎక్కువ. దేశానికి సంబంధించి ఎటువంటి విషయమైనా పవన్ గొప్పగా ఫీలవుతారు. ప్రధాని మోదీ తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాలతోనే పవన్ ఆయన అభిమానిగా మారిన సంగతి తెలిసిందే. ఇది చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే నాలుగేళ్ల కిందట పవన్ ఇండియాను భారతదేశంగా మార్చాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా అదే ప్రతిపాదనతో ముందుకు సాగుతుండడం విశేషం. పవన్ ముందుచూపునకు ఇదో మచ్చుతునకగా జనసైనికులు అభిప్రాయపడుతున్నారు. గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారు.