Pawan Kalyan : పవన్ ఢిల్లీలో బిజీబిజీగా ఉన్నారు. నాలుగురోజుల పర్యటనకు సోమవారం బయలుదేరి ఢిల్లీ వెళ్లారు. మంగళవారం ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల సమావేశానికి హాజరయ్యారు. బుధవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఏపీ వ్యవహారాల ఇన్ఛార్జి మురళీధరన్ ను కలిశారు. గురువారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిశారు. అయితే ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో పవన్ ఎన్డీఏలో కీలకంగా మారడం విశేషం. దేశ వ్యాప్తంగా ఎన్డీఏను బలోపేతం చేయాలన్న లక్ష్యంలో భాగంగా ఉన్న బీజేపీ పెద్దలు తెలుగు రాష్ట్రాల నుంచి పవన్ ను మాత్రమే పిలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఏపీలో పొత్తుల అంశాలపై చర్చిస్తామని పవన్ సమావేశానికి ముందు చెప్పుకొచ్చారు. అయితే ఎన్డీఏ భాగస్వామ్య పక్ష సమావేశంలో కేవలం జాతీయస్థాయిలో అనుసరించాల్సిన విధానాలపై మాత్రమే చర్చించారు. దీంతో ఏపీ గురించి చర్చించే అవకాశం రాలేదు. అందుకే సమావేశ అనంతరం నిన్న ఉదయం ఏపీ వ్యవహారాల ఇన్ చార్జి మురళీధరన్ తో పవన్ అల్పాహార విందు భేటీ అయ్యారు. ఏపీ గురించి కులంకుషంగా చర్చించుకున్నారు. అనంతరం పవన్ అమిత్ షాను కలిశారు. దాదాపు 25 నిమిషాల పాటు వీరి మధ్య భేటీ నడిచింది. ఆ సమయంలో వారి వెంట నాదేండ్ల మనోహర్ ఉన్నారు. ఏపీ ప్రయోజనాలకు ఈ భేటీ ఎంతగానో దోహదపడుతుందని అటు అమిత్ షా, ఇటు పవన్ లు ట్విట్ చేశారు.
ఈ రోజు పవన్ తిరిగి విజయవాడ పయనం కానున్నారు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిశారు. ఇరువురి నేతల మధ్య దాదాపు గంట పాటు భేటీ సాగింది. పలు కీలకాంశాలపై ఇరువురు నేతలు చర్చించుకున్నారు. ప్రధానంగా ఏపీ రాజకీయాల్లో ఎలా ముందుకెళ్లాలి? కొత్త అధ్యక్షురాలి నియామకం, తదితర వాటి గురించి చర్చించుకున్నారు. ఏపీలో శాంతిభద్రతల గురించి నడ్డాకు పవన్ వివరించినట్టు సమాచారం. మొత్తానికి పవన్ నాలుగు రోజుల ఢిల్లీ పర్యటన విజయవంతంగా ముగిసింది.