pawan kalyan koulu rythu bharosa yatra : జనసేనాని పవన్ కళ్యాణ్ కౌలు రైతుల కుటుంబాలను అక్కున చేర్చుకున్నాయి. పెద్ద దిక్కు కోల్పోయిన వారి కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సాయం చేశారు. ఏపీ సీఎం జగన్ సొంత జిల్లా వైఎస్ఆర్ కడపలోని సిద్దవటంలో ఏర్పాటు చేసిన సభలో 173మంది రైతులకు రూ.1.73 కోట్లు పంపిణీ చేశారు.

కౌలు రైతు భరోసా యాత్రలో భాగంగా కడప జిల్లాలో కౌలు రైతుల కుటుంబాల దీనగాథ చూసి పవన్ ఎమోషనల్ అయ్యారు. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో కౌలు రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని వాపోయారు. కౌలు రైతులకు కనీసం గుర్తింపు కార్డులు ఇవ్వడం లేదని.. అడిగిన వారిని వైసీపీ నేతలు బెదిరిస్తున్నారని మండిపడ్డారు. చదువుల నేల అయిన రాయలసీమ.. పద్యం పుట్టిన నేలపై ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం మద్యం పారిస్తోందని నిప్పులు చెరిగారు.

ఇక ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయకుండా ఉండి ఉంటే ఈరోజు ఏపీకి ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదని అన్నయ్య పార్టీపై మమకారాన్ని చాటిచెప్పారు. ప్రస్తుతం వైసీపీలో మంత్రులుగా ఉన్నవారు.. మంత్రులుగా పనిచేసిన వారే ప్రజారాజ్యంను దగ్గరుండి విలీనం చేయించారని పవన్ ఆక్రోషించారు.
తనకు అధికారంపై యావ లేదని.. పాతికేళ్ల ప్రస్థానంలో పోరాడుతానని.. 9 నెలల్లోనే అధికారంలోకి రావాలన్న ఆశ లేదని పవన్ అన్నారు. రాజకీయాల వెనుక ఉన్న కష్టనష్టాలు నాకు తెలుసు అని పవన్ కళ్యాణ్ అన్నారు.
కుల మతాల గురించి ఆలోచించనని.. కులమతాలపై రాజకీయాలు చేస్తే దేశం విచ్ఛిన్నం అవుతుందని పవన్ కళ్యాణ్ పరోక్షంగా బీజేపీ తీరుపై విమర్శలు గుప్పించినట్టు తెలుస్తోంది. వారసత్వ రాజకీయాలకు అడ్డుకట్ట వేయాలని పిలుపునిచ్చారు. అన్న పట్టించుకోలేదని చెల్లెలు మరో పార్టీ పెట్టిందని జగన్ ను పరోక్షంగా ఆడిపోసుకున్నారు.
సొంత బాబాయ్ ను చంపిన వారిని జగన్ ఎందుకు పట్టుకోలేదని.. కోడికత్తితో జగన్ పై దాడి చేస్తే ఏపీ పోలీసులపై నమ్మకం లేదన్న జగన్… ఇప్పుడు ఎలా వారిని నమ్ముతున్నారని పవన్ ప్రశ్నించారు.
ఇక చివరగా తన ప్రాధాన్యతను పవన్ వివరించారు. అధికారంలోకి వస్తే వ్యవస్థలను బలోపేతం చేసి వెనుకబడిన రాయలసీమను తలెత్తుకునేలా చేస్తామన్నారు. మార్పు కోసమే జనసేన మీ ముందు నిలబడిందన్నారు. ఒక్కసారి జనసేనను నమ్మి ఆదరించాలని పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు.