FEFSI New Rules: ఎవరికైనా వారి భాష అంటే వారికి అభిమానం ఉంటుంది. అయితే ఆ అభిమానం మరొకరికి ఇబ్బంది కలిగే అంతలా లేకపోవడం వరకు మంచిదే. తమిళవారికి వారి భాష అంటే విపరీతమైన ప్రీతి. అది గర్వించదగ్గ విషయమే అయినా, ప్రస్తుతం తమిళ సినిమా ఇండస్ట్రీ వారి భాష మీద చూపుతున్న ప్రేమ మాత్రం మరొకరి పొట్ట కొట్టే లాగా ఉంది.
అసలు విషయానికి వస్తే ఈ మధ్య తమిళ పరిశ్రమ తీసుకున్న నిర్ణయాలు అందరినీ చాలా ఆశ్చర్యపరిచాయి. ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా (FEFSI) కొత్త నిబంధనలను తమ ఇండస్ట్రీ లోకి తీసుకొచ్చాయి. అవి ఏవి అన్నది ఒకసారి చూస్తే..
తమిళ సినిమాల్లో తమిళ నటీనటులు మాత్రమే పనిచేయాలి.
సినిమా చిత్రీకరణ సకాలంలో పూర్తికాకపోయినా, అనుకున్న దాని కన్నా బడ్జెట్ పెరిగినా, రాతపూర్వకంగా నిర్మాతలు తమకు తెలియజేయాలి.
సినిమా షూటింగులు కేవలం తమిళనాడులోనే జరగాలి.
ఎలాంటి అవసరం లేకుండా తమిళనాడు దాటి కానీ, ఈ దేశం దాటి కానీ షూటింగ్‌లు చేయకూడదు.
ఒకవేళ దర్శకుడే సినిమాకు కథా రచయిత అయితే స్టోరీ ఓనర్‌షిప్ సమస్యలు వస్తే వాటి బాధ్యత మొత్తం దర్శకుడిదే. ఈ కాపీరైట్ సమస్య వల్ల నిర్మాతకు కానీ, సినిమాకు కానీ ఎలాంటి ఇబ్బందులు రాకూడదు.
అయితే వీటిల్లో ఒకటి రెండు పాయింట్లు బాగున్నా, తమిళ సినిమాల్లో తమిళ నటీనటులు మాత్రమే పనిచేయాలి అలానే తమిళ సినిమా షూటింగులు కేవలం తమిళనాడులోనే జరగాలి అనే రెండు పాయింట్లు మాత్రం చాలామందికి ఆశ్చర్యానికి గురి చేయక మానవు. అసలు వీటి వల్ల తమిళ ఇండస్ట్రీకి లాభం ఏమిటి అనేది అందరికీ ఉన్న ప్రశ్న. ఒక సినిమా అంటే ఎంతోమంది ఎన్నో భాషల వారు పనిచేస్తారు. అప్పుడే ఆ సినిమా కి మంచి రిజల్ట్ అనేది వస్తుంది. అలా కాకుండా అన్నిట్లో మా భాష వారిని మాత్రమే పెట్టుకుంటాము అనేది ఎంతవరకు కరెక్ట్. అలానే తమిళనాటి లోనే చిత్రీకరించడం మంచి ఆలోచన అయినా.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా దూసుకుపోతున్న మన సౌత్ సినిమాలకి ఇది ఎంతవరకు ఉపయోగపడుతుంది. ఒక రకంగా చెప్పాలి అంటే ఎవరైనా కింద మెట్టు నుంచి పై మెట్టుకు ఎక్కాలి అనుకుంటారు. కానీ తమిళ ఇండస్ట్రీ మాత్రం పైనుంచి కిందకు దిగుదాం అనుకుంటోంది.
తమిళ్ సినీ పరిశ్రమను ఏలిన రజినీకాంత్, అజిత్, ఐశ్వర్యారాయ్ కూడా తమిళవారు కాదు. మరి ఈ కండిషన్ లు ముందుగానే ఉంది ఉంటే, తమిళ ఇండస్ట్రీ వారిని బహిష్కరించుంటే అలాంటి వారిని మిస్ అయి ఉంటారు కదా. అది ఎందుకు తమిళవారికి అర్థం కావడం లేదు.
కెమెరామెన్ గంగతో రాంబాబులో ప్రకాష్ రాజ్ ఒక ఉద్యమం తీసుకొస్తారు. అదేమిటి అంటే తెలుగు రాష్ట్రాల్లో తెలుగువారికి పని కలిగించాలని. ఆ ఉద్యమం తరువాత పవన్ కళ్యాణ్ ఆయనని అడిగే మాటలకు థియేటర్స్ లో అప్పట్లో చప్పట్లు పడ్డాయి. ఇప్పుడు ఆ సినిమాలో ప్రకాష్ రాజ్ లానే తమిళ ఇండస్ట్రీ కూడా మారిపోయింది. అందుకే పవన్ కళ్యాణ్ ఈ మధ్య జరిగిన బ్రో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో వీరిని కూడా ప్రశ్నించారు.
తమిళ ఇండస్ట్రీ తీసుకున్న నిర్ణయాల గురించి మాట్లాడుతూ..’తెలుగు చిత్ర పరిశ్రమ ఈరోజు ఎదుగుతుంది అంటే అన్ని భాషల వాళ్లను తీసుకుంటాం. కేరళ నుంచి వచ్చిన సుజీత్ వాసుదేవన్‌ను తీసుకుంటాం. నార్త్ నుంచి ఊర్వశి రౌతెలాను తీసుకుంటాం. విభజన సమయంలో పాకిస్థాన్ నుంచి ఇండియాకు వలస వచ్చిన ఒక నీతా లుల్లాను తెలుగు చిత్ర పరిశ్రమ పరిచయం చేస్తుంది. ఇలా అన్ని భాషలు, అన్ని కలయికలు ఉంటేనే సినిమా అవుతుంది తప్ప.. కేవలం మన భాషా, మనవాళ్లే ఉండాలంటే కుచించుకుపోతాం. తమిళ చిత్ర పరిశ్రమలో కేవలం తమిళవాళ్లే ఉండాలనే భావన ఆ చిత్ర పరిశ్రమ పెద్దలకు ఉందని నేను బయట విన్నాను. ఈరోజు నేను సముద్రఖని సమక్షంలో చెప్తున్నాను.. అలాంటి చిన్న స్వభావం నుంచి బయటికి వచ్చి, విస్తృత పరిధిలో మీరు కూడా RRR లాంటి సినిమాలు, ప్రపంచ ప్రఖ్యాత సినిమాలు తమిళ చిత్ర పరిశ్రమ నుంచి రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను’ అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.
మరి పవన్ చెప్పింది నిజమే కదా.. ఈ విషయం గురించి తమిళ ఇండస్ట్రీ ఒకసారి ఆలోచిస్తే మరింత బాగుందేమో.