Pawan kalyan : ఆ గట్టునుండాలా? ఈ గట్టునుండాలా? ఇప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ ముందరి కాళ్లకు బంధం వేస్తోంది. ప్రధాని మోడీ భేటి తర్వాత వచ్చిన కన్ఫ్యూజన్ కారణంగానే జనసేనాని డిఫెన్స్ లో పడిపోయాడు. అందుకే ఆ విలేకరుల సమావేశంలో ఏం మాట్లాడలేదు. జనసేన నుంచి వస్తున్న లీకులు.. బీజేపీ సోము వీర్రాజు మాటలను బట్టి ఏపీ రాజకీయాలు మొత్తం ఇప్పుడు పవన్ కళ్యాణ్ నిర్ణయంపైనే ఆధారపడి ఉన్నాయి. పవన్ ఎవరితో వెళతారన్న దానిపైనే ఏపీ రాజకీయాలు ఆధారపడి ఉన్నాయి. బీజేపీతో కలిసి సాగడం.. లేదంటే టీడీపీని కలుపుకుపోవడం.. ఇవే పవన్ ముందున్న ఆప్షన్లు. వీటిని తేల్చుకోలేకపోతున్న పవన్ కు ఇప్పుడు కొండంత అండగా చిరంజీవి వస్తున్నారు. ఏపీలో అధికారమే లక్ష్యంగా సాగుతున్న ఈ ఆటలో పవన్ కింగ్ మేకర్ గా ఉన్నారు. ఆయన ఏం చేస్తారు? అసలు బీజేపీ ప్లాన్ ఏంటి? అన్న దానిపై స్పెషల్ ఫోకస్..

-మోడీతో భేటి తర్వాత డిఫెన్స్ లో పవన్ కళ్యాణ్..
విశాఖలో ప్రధాని మోడీతో భేటి తర్వాత పవన్ కళ్యాణ్ డిఫెన్స్ లో పడిపోయారు. పొత్తుల అంశంలో ప్రధాని మోడీ చేసిన సూచనలు పాటించాలా? కలిసి వస్తున్న చంద్రబాబును కాలదన్నాలా? అన్న సంశయం పవన్ ను వెంటాడుతోంది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా సరే వైసీపీని ఓడించాలన్నది పవన్ కళ్యాణ్ ధ్యేయం. అందుకే బీజేపీ, టీడీపీతో కలిసి పోటీచేయాలని పవన్ భావిస్తున్నారు. చంద్రబాబు కూడా కదిలి రావడంతో ఇది సాధ్యమనుకున్నారు. కానీ విశాఖలో మోడీని కలిసిన తర్వాత పవన్ లో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. టీడీపీతో కలిస్తే పవన్ కు రాజకీయంగా భవిష్యత్ ఉండదని.. బాబు వాడుకొని వదిలేస్తాడని.. గెలిస్తే చంద్రబాబే సీఎం అవుతాడని.. పవన్ కు ఆ ఛాన్స్ ఇవ్వడని మోడీ స్వయంగా పవన్ తో చెప్పినట్టు సమాచారం. చంద్రబాబు క్యారెక్టర్ బాగా తెలిసిన మోడీ ఆయన చేసిన మోసాలను ఏకరువు పెట్టినట్టు సమాచారం. పవన్ ఒకవేళ టీడీపీతో కలిసినా.. బీజేపీ మాత్రం తెలుగుదేశంతో కలిసేది లేదంటే మోడీ స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. దీంతో మోడీతో భేటి తర్వాత బీజేపీతో కలిసి సాగాలా? చంద్రబాబు వైపు మొగ్గాలా? అన్న సంశయం పవన్ ను వెంటాడుతోంది..
-2024 మిస్ కావద్దంటే టీడీపీ, బీజేపీ అవసరమంటున్న పవన్
2024 ఎన్నికల్లో బలమైన వైసీపీని ఓడించాలంటే ఒంటరిగా పోటీచేస్తే సాధ్యం కాదని పవన్ కు తెలుసు. అందుకే బీజేపీ, టీడీపీతో కలిసి పోటీచేయాలని పవన్ భావిస్తున్నారు. కానీ టీడీపీతో కలిసి సాగేందుకు బీజేపీ ఒప్పుకోవడం లేదు. చంద్రబాబు కుట్రలకు పవన్ బలికాకూడదని హెచ్చరిస్తోంది. టీడీపీతో పవన్ వెళితే.. ప్రధాని మోడీతోపాటు బీజేపీతో సంబంధాలు దెబ్బతింటాయి. వెళ్లకపోతే వైసీపీ అధికారానికి బాటలు పరిచినట్టు ఉంటుంది. దీంతోనే పవన్ తుది నిర్ణయానికి రాలేకపోతున్నారు. బీజేపీతో వెళితే 2024 ఎన్నికల్లో సీఎం క్యాండిడేట్ గా పవన్ ను ప్రకటిస్తారని ఆఫర్ ఇచ్చారు. 2024 మిస్ అయినా 2029లోనైనా పవన్ ను సీఎం చేస్తామని బీజేపీ చెబుతోంది. కానీ బీజేపీతో సాగితే ఎన్నికల్లో ప్రభావం చూపించలేమని పవన్ భావన. దీంతో ఈ ఊగిసలాటల మధ్య పవన్ తేల్చుకోలేకపోతున్నారు. 2024 ఎన్నికల్లో వైసీపీని ఓడించడానికి బీజేపీ, టీడీపీ, జనసేన కలవాలని బలంగా కోరుకుంటున్నారు.

-చంద్రబాబు రాజకీయ చాణక్యం
బీజేపీ, జనసేన కలిసి వచ్చే అవకాశాలు సన్నగిల్లుతుండడంతో చంద్రబాబు రాజకీయ చాణక్యం ప్రదర్శిస్తున్నారు. 2024 ఎన్నికలే తనకు చివరి ఎన్నికలు అని.. లాస్ట్ ఛాన్స్ ఇవ్వాలని కోరుతున్నారు. దీంతో ప్రజలు కూడా ఈ 40 ఇయర్స్ పాలిటిక్స్ బాబు మాటలకు కరిగిపోయే ఛాన్స్ ఉంది. పవన్ కళ్యాన్ రాకుండా బీజేపీ అడ్డుపడుతుండడంతో ఇక జనంలోకే వెళ్లి సెంటిమెంట్ రాజేసి అధికారం పొందాలని బాబు స్కెచ్ గీస్తున్నాడు. పవన్ తో వెళితే తనకే సీఎం సీటు దక్కుతుందని బాబు భావించాడు. కానీ బీజేపీ అడ్డుపుల్లలు వేస్తుండడంతో ఇప్పుడు బాబు ప్లాన్ బి అమలు చేస్తున్నారు.
-పవన్ నిర్ణయంపైనే ఏపీ భవిష్యత్
పవన్ కళ్యాణ్ ముందు రెండే ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి బీజేపీతో కలిసి వెళ్లడం.. రెండోది చంద్రబాబు టీడీపీతో సాగడం.. ఈ రెండింటిని కలపడానికి మోడీ-బీజేపీ ఒప్పుకోవడం లేదు. సో ఏదో ఒక గట్టున ఉండాలి. బీజేపీతో వెళితే ఏపీలో వైసీపీని ఓడించడం సాధ్యంకాదని పవన్ భావిస్తున్నారు. టీడీపీతో వెళితే ఓడించవచ్చు కానీ సీఎంగా చంద్రబాబే అయ్యే ఛాన్స్ ఉంటుంది. పవన్ కు రాజ్యాధికారం కష్టమే. అందుకే ఈ సంకుల సమరంలో పవన్ నిర్ణయంపైనే ఏపీ భవిష్యత్ ఆధారపడి ఉంది. టీడీపీ, జనసేన, బీజేపీ కలవడం కష్టమేనన్న అంచనాల నడుమ పవన్ ఏం చేస్తారు? ఏ పార్టీతో కలిసి సాగుతారన్న దానిపైనే ఏపీ భవిష్యత్ ఆధారపడి ఉంది.