Pawan Kalyan On Ram Mandir: అయోధ్యలో రామ మందిర నిర్మాణం పూర్తయింది. రెండు రోజుల్లో ఆలయంలో బలరాముడి విగ్రహ ప్రతిష్ట జరగనుంది. ఇందుకు సంబంధించి భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రధాని మోదీ ఈ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖులకు ఇప్పటికే ఆహ్వానాలు అందాయి. దేశం యావత్ ఇప్పుడు అయోధ్య ఫీవర్ పట్టుకుంది. ఎప్పుడెప్పుడు రాములోరిని దర్శించుకుందామా అని వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు.
అయోధ్య రామ మందిరానికి పెద్ద ఎత్తున విరాళాలు వస్తున్నాయి. దేశవ్యాప్తంగా అన్ని సినీ పరిశ్రమల నుంచి నటులు ముందుకు వచ్చి సాయం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ స్పందించారు. రామ మందిరానికి 30 లక్షల రూపాయల విరాళం ప్రకటించారు. ఇందుకు సంబంధించి చెక్కును ఆర్ఎస్ఎస్ ముఖ్యులు భరత్ జి కి అందించారు. అటు పవన్ వ్యక్తిగత సిబ్బంది సైతం రూ.11 వేలు అందించడం విశేషం.
మరోవైపు అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవ వేడుకలకు పవన్ కు ప్రత్యేక ఆహ్వానం అందింది. ఆయన అయోధ్య వెళ్ళనున్నారు. పవన్ కళ్యాణ్ ఇప్పటికే సమాజ హిత కార్యక్రమాలకు భారీగా విరాళాలు అందించారు. విపత్తులు ఎదురైనప్పుడు ప్రభుత్వ నిధికి సైతం పెద్ద ఎత్తున నగదు అందించిన దాఖలాలు ఉన్నాయి. కొద్దిరోజుల కిందట రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలకు రూ.లక్ష వంతున సాయం కూడా అందించారు. వివిధ కారణాలతో చనిపోయిన జనసేన కార్యకర్తల కుటుంబాలకు సైతం ఇతోధికంగా సాయపడుతున్నారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకు భారీగా విరాళాలు ప్రకటించడం ఇటీవల కాలంలో ఎక్కువగా కనిపిస్తోంది. తాజాగా అయోధ్య రామ మందిరానికి తెలుగు సినీ పరిశ్రమ నుంచి పవన్ ఎక్కువ మొత్తం సాయం ప్రకటించడం విశేషం.