Pawan Kalyan: పవన్ కళ్యాణ్ రాయలసీమ నుంచి పోటీ చేయనున్నారా? ఓ కీలక స్థానం నుంచి పోటీ చేస్తే కూటమికి లాభిస్తుందని భావిస్తున్నారా? వైసీపీకి దారుణంగా దెబ్బతీయాలని చూస్తున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. పవన్ పోటీ చేయబోయే నియోజకవర్గం పై బలమైన విశ్లేషణ జరుగుతోంది. పవన్ పోటీ చేయబోయే నియోజకవర్గాల సంఖ్య దాదాపు 10 వరకు ఉన్నాయి. కానీ తాజాగా ఆయన రాయలసీమ నుంచి మాత్రమే బరిలో దిగుతారని జోరుగా ప్రచారం సాగుతోంది.
గత ఎన్నికల్లో పవన్ గాజువాక తో పాటు భీమవరం నుంచి పోటీ చేశారు. రెండు చోట్ల ఓటమి చవిచూశారు. దీంతో ఈసారి ఎలాగైనా శాసనసభలో అడుగు పెట్టాలని భావిస్తున్నారు. కానీ ఏ నియోజకవర్గంలో నుంచి పోటీ చేస్తారన్నదానిపై క్లారిటీ లేదు. గాజువాక, భీమవరం, విశాఖ ఉత్తర, కాకినాడ, కాకినాడ రూరల్, పిఠాపురం, తిరుపతి తదితర నియోజకవర్గాల పేర్లు వినిపించాయి.కానీ పవన్ మదిలో ఏముందనేది ఎవరికీ తెలియడం లేదు. ఎన్నికల ముంగిటే తాను పోటీ చేయబోయే నియోజకవర్గాన్ని డిసైడ్ చేస్తానని పవన్ చెబుతున్నారు.
అయితే తాజాగా పవన్ పోటీ చేయబోయే నియోజకవర్గంపై కీలక అప్డేట్ వచ్చింది. రాయలసీమలోని అనంతపురం నియోజకవర్గం నుంచి పవన్ పోటీ చేస్తారని బలమైన ప్రచారం జరుగుతోంది. ఒకవేళ పవన్ పోటీ చేస్తానంటే తాను తప్పుకుంటానని టిడిపి నియోజకవర్గ ఇన్చార్జ్ ప్రభాకర్ చౌదరి ఇదివరకే ప్రకటించారు. అనంతపురంలో బలిజ సామాజిక వర్గం అధికం. దాదాపు 70 వేల వరకు ఓటర్లు ఆ సామాజిక వర్గానికి చెందిన వారే. వారంతా తెలుగుదేశం పార్టీకి బలమైన మద్దతు దారులుగా ఉన్నారు. ప్రజారాజ్యంతో పాటు గత ఎన్నికల్లో జనసేనకు సైతం మద్దతు తెలిపారు. పొత్తులో భాగంగా పవన్ అనంతపురం నుంచి బరిలో దిగితే విజయం సునాయాసం అవుతుందని.. రాయలసీమలో సైతం ప్రభావం చూపగలరని వార్తలు వస్తున్నాయి. అయితే ఇంతవరకు జనసేన నుంచి అధికారికంగా పవన్ పోటీచేయబోయే నియోజకవర్గం పై ప్రకటన రాలేదు. అయితే పవన్ రాయలసీమ నుంచి పోటీ చేయడం ఖాయమని విశ్లేషణలు వస్తుండడంతో జనసైనికుల్లో జోష్ నెలకొంది.
పవన్ పోటీ చేయబోయే నియోజకవర్గంపై స్పష్టమైన ప్రకటన చేయాలని జనసైనికులు కోరుతున్నారు. వైసీపీ అధినేత జగన్ కు పులివెందుల, చంద్రబాబుకు కుప్పం నియోజకవర్గాల మాదిరిగా.. పవన్ సైతం శాశ్వతమైన నియోజకవర్గాన్ని ఎంచుకోవాలని జనసేన పార్టీ శ్రేణులు కోరుతున్నాయి. తరచూ నియోజకవర్గాలను మార్చే కంటే.. పర్మినెంట్ గా ఒకే ఒక నియోజకవర్గంపై ఫోకస్ పెడితే బాగుంటుందన్న అభిప్రాయం పార్టీలో వ్యక్తం అవుతోంది. రాయలసీమకు సంబంధించి పవన్ కళ్యాణ్ పోటీ చేయదలచుకుంటే అనంతపురం తో పాటు తిరుపతి నియోజకవర్గం సైతం ఉంది. అక్కడ బలమైన కాపు,బలిజ సామాజిక వర్గాలు అండగా నిలుస్తాయి. గతంలో తిరుపతి నుంచి చిరంజీవి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇప్పుడు అదే నియోజకవర్గాన్ని పవన్ కొనసాగిస్తే బాగుంటుందన్న అభిప్రాయం ఉంది. ప్రస్తుతం కీలక జిల్లాల అధ్యక్షులతోపాటు నియోజకవర్గ ఇన్చార్జిలను పవన్ ప్రకటిస్తున్నారు. పనిలో పనిగా తాను పోటీ చేసే నియోజకవర్గం విషయంలో సైతం క్లారిటీ ఇవ్వాలని జనసైనికులు విజ్ఞప్తి చేస్తున్నారు.