TDP Janasena Alliance: ఆంధ్రాల్లో పొత్తుల లెక్కలు తేలుతున్నాయి. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీని గద్దె దించడమే లక్ష్యంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్(పీకే) ఇప్పటికే చేతులు కలిపారు. ప్యాకేజీ కోసమే జనసేన టీడీపీకి మద్దతు ఇస్తుందని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ పొత్తులోకి బీజేపీని కూడా చేర్చుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. జనసేన, బీజేపీ ఓ టీడీపీ అన్నట్లుగా ఎన్నికలకు సన్నద్ధమవుతున్న వేళ.. మధ్యలో ఎన్నికల వ్యూహకర్త పీకే(పశాంత్‌కిశోర్) ఎంటర్ అయ్యాడు. టీడీపీని జాకీలు పెట్టి లేపేందుకు ఇద్దరు పీకేలు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నారు.
చంద్రబాబే సీఎం అని ప్రచారం..
జనసేన పార్టీ ఎనిమిదేళ్ల ప్రస్తానంలో ఎప్పుడూ ఒక పార్టీకి మద్దతుగా నిలవడమే జరుగుతోంది. సొంతగా బలం చాటే ప్రయత్నం ఎన్నడూ చేయడం లేదు. 2014లో టీడీపీకి మద్దతు ఇచ్చిన జనసేన, 2019లో బీజేపీకి మద్దతు ఇచ్చింది. తాజాగా మళ్లీ టీడీపీకి మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకుంది. అయితే జనసేనలో మొదటి నుంచి పనిచేస్తున్న నాయకులు, కార్యకర్తలకు మాత్రం ఈ పొత్తు నచ్చడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదిలా ఉంటే పొత్తుతో జనసేనకు ఒనగూరే ప్రయోజనం పెద్దగా కనిపించడం లేదు. వైసీపీ గద్దె దిగి, టీడీపీ గెలిచినా జనసేనాని ముఖ్యమంత్రి అవుతాడన్న గ్యారెంటీ లేదు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తనయుడు లోకేశే 2024లో సీఎం చంద్రబాబే అని ప్రచారం చేస్తున్నారు. కానీ, జన సైనికులకు మాత్రం ఇది మింగుడు పడడం లేదు. సీఎం పీఠం పంచుకుంటే అయినా జనసేనకు న్యాయం జరుగుతుందని క్యాడర్ భావిస్తోంది. ఈ క్రమంలో లోకేశ్ బాబే సీఎం అని ప్రచారం చేయడం చర్చనీయాంశమైంది.
సీట్ల సర్దుబాటు ప్రహసనమే..
ఇక టీడీపీ, జనసేన మధ్య సీట్ల సర్దుబాటు కూడా అంత ఈజీ కాదంటున్నారు. అయితే టీడీపీ గెలవడమే జనసేన లక్ష్యం అయినందున జనసేన కేవలం 30 నుంచి 50 సీట్లకు పరిమితం కావచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ సీట్లలో ఎన్నికగెలుస్తారన్నది చెప్పడం కష్టమే. ఇలాంటి తరుణంలో సీఎం సీటు ఆశించడం అత్యాశే అవుతుంది. ఇక టీడీపీ 150 నుంచి 160 స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. జనసేన మద్దతుతో ఏపీలో గెలవడంపైనే టీడీపీ దృష్టిసారించింది.
రంగంలోకి మరో పీకే..
పొత్తుల ద్వారా ఒకవైపు టీడీపీని గెలిపించేందుకు పీకే(పవన్ కళ్యాణ్) ప్రయత్నాలు చేస్తుంగా, వీరి మధ్యకు మరో పీకే(ప్రశాంత్ కిశోర్) ఎంటర్ అయ్యాడు. టీడీపీకి ఇప్పటికే రాబిన్‌సింగ్ ఎన్నికల వ్యూహకర్తగా పనిచేస్తున్నారు. తాజాగా పీకే రావడం చర్చనీయాంశమైంది. రాబిన్‌సింగ్ టీంపై నమ్మకం లేకపోవడంతోనే లోకేశ్ ప్రశాంత్ కిశోర్‌ను ఆశ్రయించాడని ప్రచారం జరుగుతోంది. గతంలో వైసీపీ విజయం కోసం పనిచేసిన ప్రశాంత్ కిశోర్ ఇప్పుడు తమవైపున పనిచేస్తున్నాడని మైండ్ గేమ్ ఆడేందుకే ఈ భేటీని ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. ఎన్నికల వ్యూహకర్తగా పనిచేయడం మావేశానని ప్రకాంత్ కిశోర్ గతంలోనే చెప్పారు. కానీ పేరు వాడుకుని మైండ్ గేమ్ ఆడాలను కోవడం ఎన్నికల వ్యూహంలో భాగమే అని తెలుస్తోంది.
ఇద్దరు పీకేల ‘పొత్తు’ ‘వ్యూహాలు’ గట్టెకిస్తాయా?
ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీని గట్టెక్కించేందుకు ఒకవైపు పీకే(పవన్ కళ్యాణ్) మరో పీకే (ప్రశాంత్ కిశోర్) 2024 ఎన్నికల్లో సర్వశక్తులు ఒడ్డడం ఖాయం. పొత్తు మంత్రంతో పవన్ కళ్యాణ్ ముందుకు సాగుతున్నారు. ఇక ప్రశాంత్ కిశోర్ మాత్రం ఎన్నికల్లో గెలుపు కోసం వైసీపీ మైనెస్‌లు, జగన్ బలహీనతలను టీడీపీ అధినేతకు తెలిపే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అయితే ఇద్దరు పీకేల పొత్తులు, ఎత్తులు టీడీపీని గెలిపిస్తాయనే విశ్వాసం మాత్రం ఇంకా టీడీపీకి కలగడం లేదని తెలుస్తోంది.