Pawan Kalyan: ఏపీలో వైసీపీని ఓడించాలంటే జనసేన బలం సరిపోదు. ఖచ్చితంగా పొత్తు అవసరం. అది బీజేపీతోనా? లేక టీడీపీనీ కలుపుకుపోవాలా? అన్నదే కీలకం. టీడీపీతో పొత్తు విషయంలోనూ పవన్ కళ్యాణ్ ఆచితూచి వ్యవహరిస్తున్నారు. గత ఎన్నికల సమయంలోనూ చంద్రబాబు పదే పదే కలిసిరావాలన్నా నాడు పవన్ తిరస్కరించారు. టీడీపీని ఓడిస్తానని అన్నంత పనిచేశారు. కమ్యూనిస్టులు, బీఎస్పీతో కలిసి వెళ్లి తనూ దెబ్బతిన్నారు. ఇప్పుడు వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వనని.. అవసరమైతే ఎవరితోనైనా కలుస్తానని శపథం చేశారు. అందుకే తాజాగా మంగళగిరిలో నిర్వహించిన జనసేన విస్తృత స్థాయి సమావేశంలో జనసేనాని పవన్ కళ్యాణ్ ఫుల్ క్లారిటీతో ‘మూడు ఆప్షన్లు’ రూపొందించారు. 2024లో గెలుపే లక్ష్యంగా ‘మూడు ఆప్షన్లు’ ప్రతిపాదించారు. అవిప్పుడు ఏపీ రాజకీయాల్లో సంచలనమయ్యాయి. వైసీపీని ఓడించేందుకు పవన్ రూపొందించిన ఈ మూడు ఆప్షన్లు కనుక అమలైతే ఖచ్చితంగా జనసేనకు ఏపీలో అధికారం సాధ్యమే. ఏపీలో అధికారమే లక్ష్యంగా పవన్ కల్యాణ్ రూపొందించిన ఆ ‘మూడు ఆప్షన్లు’ ఏంటి? వాటివల్ల అధికారం సాధ్యమా? అన్న దానిపై స్పెషల్ ఫోకస్.

ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు పొత్తులపై చర్చలు జరుగుతున్న సమయంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. చంద్రబాబు సిద్ధం అంటే.. పవన్ కళ్యాణ్ కూడా రెడీ అన్నట్లుగా మాట్లాడడంతో ఏపీ రాజకీయాల్లో కీలక మార్పులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2014,2019లో తగ్గాను కానీ.. 2024లో తగ్గడానికి సిద్ధంగా లేనని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఈసారి మిగతా వాళ్లు తగ్గితే బాగుంటుందని పరోక్షంగా టీడీపీ, బీజేపీకి సలహాలిచ్చారు.
దీంతో చంద్రబాబు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ తో పొత్తు కోసం ఆసక్తి చూపడం ఖాయంగా కనిపిస్తోంది. అధికారం కోసం ఎంతైనా బెండ్ అయ్యే బాబు గారు పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఈ పిలుపునకు స్పందించి పొత్తుల కోసం రెడీగా ఉంటారు. సీట్ల విషయంలో ఖచ్చితంగా జనసేనకు ఫేవర్ గా రాజకీయం చేస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఏపీలో జనసేన-టీడీపీ-బీజేపీ పొత్తు పొడవడం ఖాయమంటున్నారు. అయితే ఈ పొత్తు పొడవకున్నా పవన్ కళ్యాణ్ ‘మూడు ఆప్షన్లు’ ఎంచుకున్నారు. వాటితో అధికారం సాధ్యమంటున్నారు. అవేంటో తెలుసుకుందాం.
1. బీజేపీ -జనసేన కలిసి ప్రభుత్వాన్ని స్థాపించడం
ఏపీలో బీజేపీ-జనసేన ప్రస్తుతం పొత్తులో ఉన్నాయి. కానీ ఎన్నికలు అనేసరికి బీజేపీ పోటీకి సై అంటే.. జనసేన నై అంటోంది. జనసేనకు ఎన్నికల్లో బీజేపీ మద్దతు ఇవ్వకుండా ఒంటరిగా పోటీచేస్తోంది. దీంతో ఈ రెండు పార్టీల మధ్య కాస్త గ్యాప్ ఉంది. జనసేన, బీజేపీ ఏపీ రాజకీయాల్లో విడివిడిగానే ప్రజా సమస్యలపై పోరాడుతున్నాయి. తిరుపతి, బద్వేలు, ఆత్మకూరు ఉప ఎన్నికల్లో బీజేపీ పోటీచేసింది. తిరుపతిలో తప్పితే మిగతా రెండు చోట్ల బీజేపీకి జనసేన సపోర్ట్ ఇవ్వలేదు. ఆత్మకూరులో అయితే జనసేనతో సంప్రదించకుండానే బీజేపీ బరిలోకి దిగడం గమనార్హం. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో మాత్రం బీజేపీ-జనసేన కలిసి పోటీచేయాలని భావిస్తున్నాయి. సగం సగం సీట్లు పంచుకొని పోటీచేసి వైసీపీ వ్యతిరేకతను సొమ్ము చేసుకొని అధికారం సాధించాలని కలలుగంటున్నాయి. టీడీపీ కలిసి వస్తే కలుపుకోవడం లేదంటే.. అప్పటి ఎన్నికల ఫలితాలను బట్టి కలిసి ప్రభుత్వాన్ని స్థాపించడమే ధ్యేయంగా అడుగులు వేస్తున్నాయి. వైసీపీని చావుదెబ్బ తీసేందుకు.. కేంద్రంలోని అధికారాన్ని ఉపయోగించుకొని.. ఏపీ ప్రజల మనసు గెలిచి మెజార్టీ సీట్లు సాధించాలని చూస్తున్నాయి. పొత్తుల ఎత్తుల్లో ఎలాగైనా సరే బీజేపీ-జనసేన కలిసి ప్రభుత్వాన్ని స్థాపించడమే ధ్యేయంగా అడుగులు వేస్తున్నారు.
2. జనసేన + బీజేపీ + టీడీపీతో కలిసి ప్రభుత్వాన్ని స్థాపించడం
ఏపీలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీకి రాష్ట్రమంతా నేతలు, కార్యకర్తల బలం ఉంది. ఇదే జనసేన, బీజేపీకి లేరు. బలమైన వైసీపీని ఓడించాలంటే బీజేపీ, జనసేన బలం సరిపోదు. అందుకే టీడీపీని కలుపుకుపోవాలని.. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా చూసుకోవాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. ఈ మేరకు ఇటీవల ప్రకటన కూడా చేశారు. అయితే టీడీపీతో కలిసేందుకు బీజేపీ ఆసక్తి చూపించడం లేదు. కానీ ఆ పార్టీని ఒప్పిస్తానని పవన్ కళ్యాణ్ అంటున్నారు. అదే జరిగితే జనసేన+బీజేపీ+టీడీపీ కలవడం ఖాయం. ఈ మూడు పార్టీలు కలిస్తే వ్యతిరేక ఓటు చీలకుండా ఖచ్చితంగా ఏపీలో వైసీపీ ఓడి ఈమూడు పార్టీల ప్రభుత్వం ఏర్పడడం ఖాయం. ఆ దిశగా పవన్ కళ్యాణ్ యే ముందుండి చొరవ తీసుకొని కూటమిగా పోటీచేయాల్సిన అవసరం ఉంది. అప్పుడే జనసేన + బీజేపీ + టీడీపీతో కలిసి ప్రభుత్వాన్ని స్థాపించడం సాధ్యమవుతుంది.
3. జనసేన ఒక్కటే ప్రభుత్వాన్ని స్థాపించడం
ఇది కాస్త కష్టసాధ్యమైన పనే. ఇప్పటికే బీజేపీతో జనసేనకు పొరపొచ్చాలున్నాయి. నిన్న మంగళగిరిలోనూ పవన్ కళ్యాణ్ ఇదే మాట అన్నారు. ‘తాను సీఎం అభ్యర్థి అని బీజేపీ చెప్పలేదని.. కరోనా కారణంగానే బీజేపీతో తాము సోషల్ డిస్టేన్స్ (దూరం) పాటిస్తున్నాని’ పరోక్షంగా ఒప్పుకున్నారు. జేపీ నడ్డా మీటింగ్ లకు కూడా హాజరు కాలేనని స్పష్టం చేశారు. బీజేపీతో తమకు చెడిపోవాలని చాలా మంది కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు. కానీ ఈసారి ఎక్కడా తగ్గేది లేదని స్పష్టం చేశారు. దీన్ని బట్టి బీజేపీ దూకుడుకు.. జనసేనను విస్మరించి ముందుకెళితే ఈ పొత్తు నిలబడే అవకాశం ఉండదు. అప్పుడు ఒంటరిగానే ఏపీ ఎన్నికల్లో పోటీచేయాల్సి ఉంటుంది. ప్రస్తుత బలం దృష్ట్యా జనసేన ఒంటరిగా పోటీచేసి సొంతంగా అధికారం సాధించడం కష్టమే. కానీ గత ఎన్నికల్లో కర్ణాటకలో జరిగినట్టు ఏపీలో హంగ్ వచ్చి పవన్ కళ్యాణ్ కు ఓ 30-40 సీట్లు వస్తే కింగ్ మేకర్ అవుతాడు. అప్పుడు ఏకంగా సీఎం సీటును పొందే ఛాన్స్ పవన్ కళ్యాణ్ కు ఉంటుంది. కర్నాటకలో కుమారస్వామి కూడా ఇలానే కింగ్ మేకర్ అయ్యి సీఎం అయ్యారు. ఒంటరిగా పోటీచేసి సీట్లు గెలిస్తే ఏపీలోనూ పవన్ కళ్యాణ్ సీఎం కావచ్చు. టీడీపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. జగన్ ను సీఎం కాకుండా చంద్రబాబు కూడా కాంప్రమైజ్ అయ్యి పవన్ కళ్యాణ్ కు మద్దతు తెలుపొచ్చు. ఏదైనా జరగవచ్చు.
అందుకే ఈ మూడు ఆప్షన్లను ముందుపెట్టి పవన్ కళ్యాణ్ ఏపీలో రాజకీయం చేయడానికి రెడీ అయ్యారు. బీజేపీతో కలిసి వెళ్లడం.. లేదంటే బీజేపీ+జనసేన+టీడీపీతో కలిసి అధికారం సాధించడం.. ఈ రెండు వీలుకాకపోతే ఒంటరిగా పోటీచేసి కింగ్ మేకర్ అయ్యి పొత్తులతో జనసేన పార్టీ ప్రభుత్వాన్ని స్థాపించడమే ధ్యేయంగా పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగా కదులుతున్నారు. మరి ఇది సాధ్యమవుతుందా? లేదా? అన్నది వేచిచూడాలి.
[…] Also Read: Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ముందు ‘3 ఆప్షన్లు’.. … […]