https://oktelugu.com/

Padma Awards 2024: తెలుగు వారికి ‘పద్మాభిషేకం’.. వెంకయ్య నాయుడు, చిరంజీవిలకు పద్మ విభూషణ్

కేంద్రం మొత్తం 132 పద్మ అవార్డులను ప్రకటించింది. అందులో ఐదు పద్మ విభూషణ్, 17 పద్మభూషణ్, 110 పద్మశ్రీ పురస్కారాలు ఉన్నాయి. ఇందులో 30 మంది మహిళలు, 8 మంది విదేశీయులు ఉన్నారు.

Written By:
  • Dharma
  • , Updated On : January 26, 2024 / 08:46 AM IST
    Follow us on

    Padma Awards 2024: జాతీయస్థాయిలో తెలుగు రాష్ట్రాలకు మరో అరుదైన గౌరవం దక్కింది. 8 మంది ప్రముఖులకు పద్మ అవార్డులు లభించాయి.మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్ అవార్డులు దక్కాయి. ఒకేసారి ఇద్దరు తెలుగువారికి రెండో అత్యున్నత పౌర పురస్కారం లభించడం విశేషం.ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం అవార్డులను ప్రకటించింది. ఈ ఏడాది వివిధ రంగాలకు చెందిన 132 మందికి పద్మ పురస్కారాలు ప్రకటించగా.. అందులో తెలుగు వారు ఎనిమిది మంది ఉండడం విశేషం. యాట రిపబ్లిక్ డే వేడుకలకు ముందు రోజు పద్మ అవార్డులు ప్రకటించడం ఆనవాయితీగా వస్తోంది. కళ,సామాజిక సేవ,ప్రజా వ్యవహారాలు, శాస్త్ర సాంకేతిక, ఇంజనీరింగ్, వాణిజ్యం,పరిశ్రమలు, వైద్యం,సాహిత్యం, విద్య, క్రీడా రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వారికి ఈ పౌర పురస్కారాలకు ఎంపిక చేస్తోంది.

    కేంద్రం మొత్తం 132 పద్మ అవార్డులను ప్రకటించింది. అందులో ఐదు పద్మ విభూషణ్, 17 పద్మభూషణ్, 110 పద్మశ్రీ పురస్కారాలు ఉన్నాయి. ఇందులో 30 మంది మహిళలు, 8 మంది విదేశీయులు ఉన్నారు. 9 మందికి మరణానంతరం ఈ గౌరవం దక్కింది. ఈ ఏడాది ఏపీకి వెంకయ్య నాయుడు, చిరంజీవిలకు పద్మభూషణ్ లు దక్కగా.. డి. ఉమామహేశ్వరికి పద్మశ్రీ అవార్డు లభించింది. తెలంగాణకు ఐదు పద్మశ్రీలు దక్కాయి. కళా రంగం నుంచి ఏ.వేలు ఆనందాచారి, దాసరి కొండప్ప, గడ్డం సమ్మయ్యలకు పురస్కారాలు దక్కాయి, సాహిత్యం, విద్యారంగం నుంచి కేతావత్ సోములాల్, కూరెళ్ల విఠలాచార్యులు ఉన్నారు.అసాధారణమైన విశిష్ట సేవలు చేసిన వారికి పద్మ విభూషణ్, ఉన్నత స్థాయి విశిష్ట సేవలు అందించిన వారికి పద్మభూషణ్, విశిష్ట సేవలు అందించిన వారికి పద్మశ్రీ అవార్డులు అందిస్తారు. మార్చిలో ఈ అవార్డులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అందించనున్నారు.

    వివిధ రంగాల్లో తమదైన ప్రత్యేకత కనబరుస్తూ.. పెద్దగా ప్రచారానికి నోచుకోని వారిని కూడా గుర్తించి కేంద్రం ఈసారి పద్మ అవార్డులను ప్రకటించింది. సుప్రీంకోర్టు తొలి మహిళా న్యాయమూర్తిగా రికార్డులకు ఎక్కిన కేరళకు చెందిన దివంగత జస్టిస్ ఫాతిమా బివీకి మరణానంతరం పద్మభూషణ్ లభించింది. మహారాష్ట్రకు చెందిన కేంద్ర మాజీ మంత్రి రామ్ నాయక్, కేరళకు చెందిన కేంద్ర మాజీ మంత్రి రాజగోపాల్, ప్రముఖ గాయని ఉషా ఉధూప్, లక్ష్మీకాంత్ ప్యారేలాల్ ద్వయం లో ఒకరైన ప్యారే లాల్ శర్మ లకు పద్మభూషణ్ ప్రకటించింది. పశ్చిమ బెంగాల్ నుంచి ప్రముఖునటుడు మిధున్ చక్రవర్తి, తమిళనాడు నుంచి దిబ్బంగత నటుడు విజయకాంత్ లకు ఇవే పురస్కారాలు ప్రకటించడం విశేషం. కళా రంగం నుంచి నృత్యకారిణి, సీనియర్ నటి వైజయంతి మాల బాలి, ప్రముఖ భరతనాట్య కళాకారుని పద్మ సుబ్రహ్మణ్యం లను పద్మ విభూషణ్ కు ఎంపిక చేయడం విశేషం.

    తెలుగు రాష్ట్రాలకు పద్మ పురస్కారాల్లో ఎప్పుడూ ప్రాధాన్యం లభిస్తూనే ఉంది. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ నుండి 103 మందికి, తెలంగాణ నుంచి 168 మందికి పద్మ పురస్కారాలు లభించాయి. తాజా అవార్డులతో కలిపి ఇప్పటివరకు ఏపీ నుంచి 8 మందికి పద్మ విభూషణ్, 25 మందికి పద్మభూషణ్, 70 మందికి పద్మశ్రీలు దక్కాయి. తెలంగాణ నుంచి ఇప్పటివరకు 14 మందికి పద్మ విభూషణ్, 34 మందికి పద్మభూషణ్, 120 మందికి పద్మశ్రీలు లభించినట్లు అయ్యింది.