https://oktelugu.com/

Nagarjuna Sagar: తెలంగాణ ఎన్నికలకు ముందు ఆపరేషన్‌ ‘సాగర్‌’.. అర్ధరాత్రి సగం డ్యామ్‌ స్వాధీనం చేసుకున్న ఏపీ

కృష్ణా నది జలాల్లో వాటా కోసం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు అర్ధరాత్రి హైడ్రామా నడిపింది. నాగార్జున సాగర్‌ డ్యామ్‌లో సగభాగాన్ని ఆంధ్రప్రదేశ్‌ స్వాధీనం చేసుకుంది.

Written By:
  • Raj Shekar
  • , Updated On : December 1, 2023 / 11:30 AM IST

    Nagarjuna Sagar

    Follow us on

    Nagarjuna Sagar: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు సరికొత్త డ్రామాకు తెరలేపాయి. తెలంగాణ సెంటిమెంటును రగిల్చేందుకు, బీఆర్‌ఎస్‌ సర్కార్‌ పడిపోతే.. తెలంగాణ దోపిడీకి గురవుతుందన్న సందేశం ప్రజల్లోకి పంపి ఓటర్ల దృష్టిని మరల్చేందుకు గులాబీ సర్కార్‌ పెద్ద ప్లానే వేసింది. 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేసీఆర్‌ తనకు చేసిన సాయానికి రుణం తీచ్చుకునేందుకు ఏపీ సీఎం జగన్‌ కూడా ఇందులో భాగమయ్యారు. ఇరు రాష్ట్రాల సీఎంలు కలిసి రూపొందించిన ఆపరేషన్‌ ‘సాగర్‌’ పెద్దగా ప్రభావం చూపనట్లు తెలుస్తోంది. ఎగ్జిట్‌పోల్స్‌ పలితాలే ఇందుకు నిదర్శనమంటున్నారు విశ్లేషకులు.

    డ్యామ్‌పై అర్ధరాత్రి హైడ్రామా
    కృష్ణా నది జలాల్లో వాటా కోసం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు అర్ధరాత్రి హైడ్రామా నడిపింది. నాగార్జున సాగర్‌ డ్యామ్‌లో సగభాగాన్ని ఆంధ్రప్రదేశ్‌ స్వాధీనం చేసుకుంది. ఇది తెలంగాణతో వివాదానికి దారితీసింది. డ్యామ్‌ను ఏపీ ఆక్రమించుకోవడంపై తెలంగాణ ప్రభుత్వం కృష్ణా రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డుకు ఫిర్యాదు చేసింది. ఏపీ అధికారులు డ్యామ్‌కు అడ్డుకట్ట వేసి తెలంగాణ వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. సీసీ కెమెరాలు, ఆటోమేటెడ్‌ ఎంట్రీ గేట్‌లతో సహా డ్యామ్‌ మౌలిక సదుపాయాలను దెబ్బతీస్తోందని ఆరోపించారు.

    13 గేట్లు స్వాధీనం..
    2014లో ఆంధ్ర ప్రదేశ్‌ నుంచి తెలంగాణ విడిపోయినప్పటి నుంచి ఈ డ్యామ్‌పై రెండు రాష్ట్రాల మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది. దీంతో ఏటా కృష్ణా రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు రెండు రాష్ట్రాలకు కేఆర్‌ఎంబీ నీటిని కేటాయిస్తుంది. అయితే ఈసారి సాగర్‌కు పెద్దగా వరద రాలేదు. దీంతో ఇప్పటి వరకు నీటిని విడుదల చేయలేదు. ఈ క్రమంలో ఆయకట్టు రైతులు వేసిన పంటలు ఎండిపోతున్నాయి. దీంతో సాగర్‌ నీటిని తరలించుకుపోయేందుకు ఎన్నికలకు కొన్ని గంటల ముందు ఏపీ ప్రభుత్వం ఆ రాష్ట్ర నీటిపారుదల అధికారులతో పాటు 400 మంది ఏపీ పోలీసులను అర్ధరాత్రి 1గంట తర్వాత డ్యామ్‌పైకి పంపించింది. ఏపీ పోలీసుల రాకను గమనించిన తెలంగాణ సిబ్బంది ఆశ్చర్యపోయారు. వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. తెల్లవారి అధికారులు చేరుకునేలోపు డ్యాంలోని 36 గేట్లలో 13 గేట్లను ఏపీ అధికారులు తమ అధీనంలోకి తీసుకున్నారు.

    గేట్లకు పవర్‌ కట్‌..
    దీంతో అప్రమత్తమైన తెలంగాణ అధికారులు, పోలీసులు ఏపీ అధికారులతో వాగ్వాదానికి దిగారు. తమ ప్రభుత్వ ఆదేశాల మేరకే విధులు నిర్వర్తిస్తున్నామని ఏపీ అధికారులు చెప్పడంతో తెలంగాణ అధికారులు వెనుదిరిగారు. అనంతరం గేట్లు ఎత్తకుండా విద్యుత్‌ సరఫరా నిలిపివేశారు. అయితే ఏపీ ఇంజినీరింగ్‌ అధికారులు ప్రత్యామ్నాయ చర్యలతో విద్యుత్‌ సరఫరా పునరుద్ధరించి 13 నంబర్‌ గేటు తెరిచి కెనాల్‌కు నీటిని విడుదల చేశారు. మరోవైపు ఏపీ అధికారులు కూడా రాష్ట్ర చిరునామాలతో ఆధార్‌ కార్డులు ఇస్తే తప్ప తెలంగాణ వాహనాలను అనుమతించడం లేదు. మూడేళ్ల క్రితం కూడా ఏపీలో ఇదే తరహా ప్రయత్నం జరిగినా అది బెడిసికొట్టిందని తెలంగాణ అధికారులు తెలిపారు.

    కేఆర్‌ఎంబీకి ఫిర్యాదు..
    ఇదిలా ఉండగా తెలంగాణ ప్రభుత్వం ఈ విషయమై కృష్ణా రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డుకుఫిర్యాదు చేసింది. తమ అనుమతి లేకుండా అక్రమంగా ఏపీ ప్రభుత్వం కృష్ణా జలాలను తరలించుకుపోతోందని తెలిపారు. డ్యామ్‌ నుంచి 10 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారని తెలిపారు. ప్రాజెక్టుపై ఉన్న తెలంగాణ సీసీ కెమెరాలను ధ్వంసం చేశారని, గేట్లను కూడా బద్దలు కొట్టే ప్రయత్నం చేశారని ఆరోపించారు.