Hyderabad Metro: విశ్వనగరం హైదరాబాద్‌కు ఉన్న కీలక ఆభరణాల్లో మెట్రో ఒకటి.. నగరానికి మొట్రో వచ్చాక ఆ మార్గాల్లో ట్రాఫిక్ చాలా వరకు తగ్గింది. నగర వాసులకు రవాణా సులభతరమైంది. ఏటా మెట్రో ఎక్కేవారి సంఖ్య పెరుగుతోంది. దీంతో మరిన్ని రూట్లతో మెట్రోను విస్తరించేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. అయితే.. మెట్రో స్టేషన్లు.. ఇప్పుడు సూసైడ్ స్పాట్లుగా మారడమే ఆందోళన కలిగిస్తోంది. మెట్రో 2019లో ప్రారంభం కాగా, ఇప్పటి వరకు పదుల సంఖ్యలో ఆత్మహత్యలు జరిగాయి.
పెరుగుతున్న ప్రయాణికుల సంఖ్య..
మెట్రో ప్రారంభంలో రోజుకు లక్ష మంది ప్రయాణించేవారు. గడిచిన నాలుగేళ్లలో ఈ సంఖ్య ఐదు రెట్టు పెరిగింది. ప్రస్తుతం 5.10 లక్షల మందిని మెట్రో రైళ్లు వారివారి గమ్యస్థానాలకు చేరవేస్తున్నాయి. ఉదయం నుంచి రాత్రి వరకు రద్దీ తగ్గడం లేదు. దీంతో మెట్రో టైమింగ్స్‌ను పొడిగించారు. అదనపు బోగీలు పెంచాలన్న డిమాండ్ వస్తోంది.
ఆగస్టు నుంచి అదనపు బోగీలు..
వచ్చే ఆగస్టు నుంచి మెట్రో రైళ్లకు మూడు అదనపు బోగీలు కలపాలని యాజమాన్యం నిర్ణయించింది. ప్రస్తుతం కోచ్‌లు కొనుగోలు చేయడం కష్టం కావడం, సమయం పట్టే అవకాశం ఉండడంతో అద్దెకు తీసుకోవాలని హైదరాబాద్ మెట్రో అధికారులు నిర్ణయించారు. ఈమేరకు చెన్నై, నాగపూర్ మెట్రో అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు.
ఐదేళ్లలో ఆరు ఆత్మహత్యలు..
ఇక హైదరాబాద్ మెట్రో ప్రారంభమై ఐదేళ్లు దాటింది. ఈ ఐదేళ్లలో మెట్రో స్టేషన్లలో ఆరుగురు ఆత్మహత్య చేసుకున్నారు. 2019లో మొదటిసారి ఆత్మహత్యాయత్నం చేయగా, స్థానికులు గమనించి కాపాడారు. 2021లో దిల్‌సుఖ్‌నగర్, అమీర్‌పేటలో ఒక్కొక్కరు ఆత్మహత్య చేసుకున్నారు. 2022లో ఈఎస్‌ఐ, మూసాపేట మెట్రో స్టేషన్లలో ఒక్కొక్కరు సూసైడ్ చేసుకున్నారు. తాజాగా కేపీహెచ్‌బీ స్టేసన్‌లో ఆదివారం ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు.
సెక్యూరిటీ పెంపుపై దృష్టి..
మెట్రో స్టేషన్లు సూసైడ్ స్పాట్లుగా మారుతున్నాయని ఆరోపణలు పెరుగుతుండడంతో హైదరాబాద్ మెట్రో అధికారులు సెక్యూరిటీ పెంపుపై పునరాలోచన చేస్తున్నారు. స్టేషన్లలో ప్రస్తుతం ఉన్న సెక్యూరిటీతోపాటు అదనపు సిబ్బంది ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. అదే సమయంలో సీసీ కెమెరాలు కూడా అదనంగా ఏర్పాటు చేయాలని చూస్తున్నారు. ప్రయాణికులతోపాటు మెట్రోకు సెక్యూరిటీ కోసం త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ప్రయాణికులు కూడా సెక్యూరిటీ పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ఆత్మహత్యల నియంత్రణకు ఇదే పరిష్కారమని సూచిస్తున్నారు.