Anand Mahindra : ఆనంద్ మహీంద్రా.. కార్పొరేట్ ప్రపంచానికి పరిచయం అక్కర్లేని పేరు. వేల కోట్లకు అధిపతి అయినప్పటికీ.. సామాజిక మాధ్యమాలలో ఈయన చాలా యాక్టివ్ గా ఉంటారు. పలు ఆసక్తికరమైన విషయాలను నెటిజన్ల తో పంచుకుంటారు. వివిధ అంశాలకు సంబంధించి తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా చెప్పేస్తారు. అయితే వివాదాస్పద అంశాల జోలికి పోరు. నెటిజన్ల తో పంచుకునే విషయాల్లో తనదైన హాస్య చతురత జోడిస్తారు. ఇక సమాజాన్ని ప్రభావితం చేసే వ్యక్తులకు తనదైన సహాయం చేస్తారు. ఇటీవల ప్రజ్ఞానంద చదరంగంలో ప్రతిభ చూపడంతో.. అతడి కుటుంబానికి ఊహించని బహుమతి పంపారు ఆనంద్ మహీంద్రా. అయితే గురువారం దేశవ్యాప్తంగా రక్షాబంధన్ వేడుకలు జరుపుకుంటున్న వేళ.. అందరినీ ఆశ్చర్యపరిచే విధంగా ట్విట్టర్ లో ట్వీట్ చేశారు.
సోదరికి క్షమాపణలు
రాఖీ పండుగ వేళ ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియా ద్వారా తన చెల్లికి క్షమాపణలు చెప్పారు. రక్షాబంధన్ సందర్భంగా ఆనంద్ మహీంద్రా ట్విట్టర్ లో ఓ ఫొటో షేర్ చేశారు. “కొన్ని సంవత్సరాల క్రితం రక్షాబంధన్ సందర్భంగా నా సోదరి రాధిక, నేను కలిసి ఉన్న బ్లాక్ అండ్ వైట్ ఫోటోను పోస్ట్ చేశాను. అయితే, ఎవరో దాన్ని కలర్ ఫోటో గా మార్చారు. ఇప్పుడు రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆ ఫోటో ను మళ్లీ పోస్ట్ చేస్తున్నాను” అని రాసుకొచ్చారు. అయితే పోస్ట్ చివరిలో తన చెల్లి అనూజకు క్షమాపణలు చెప్పారు. ఎందుకంటే ఆ ఫోటో తీసిన సమయంలో ఆమె ఇంకా పుట్టలేదని తెలిపారు. ఈ ట్వీట్ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
నెటిజన్లు ఏమంటున్నారంటే..
కాగా, ఆనంద్ మహీంద్రా చేసిన ట్వీట్ పట్ల నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. “ఆనంద్ జీ.. రక్షాబంధన్ సందర్భంగా మీరు మీ సోదరికి క్షమాపణలు చెప్పారు. కచ్చితంగా ఇది ఆమెకు విలువైన బహుమతి” అని ఓ నెటిజన్ వ్యాఖ్యానించాడు. “రక్షాబంధన్ సందర్భంగా దేశవ్యాప్తంగా సోదరులంతా సోదరీమణులు కట్టిన రాఖీలతో సంబర పడుతున్నారు. కానీ మీరు మాత్రం గతం తాలూకూ జ్ఞాపకాలను నెమరు వేసుకుంటున్నారు. ఇది ముమ్మాటికి ఒక అద్భుతమైన ట్విట్” అంటూ మరొక నెటిజన్ పేర్కొన్నాడు.
Some years ago I posted the black & white photo of my sister Radhika and I during Rakhi & someone very kindly gave it colour! So posting it again while wishing everyone a Very Happy Rakshabandhan.(And apologies to my younger sister Anuja, who hadn’t arrived on the planet yet!) pic.twitter.com/TGVyPSjNNJ
— anand mahindra (@anandmahindra) August 30, 2023