https://oktelugu.com/

Naveen Patnaik: భేష్ నవీన్.. ఇలాంటి నిర్ణయం ఒడిశానే కాదు సమాజాన్నీ కదిలిస్తుంది

నవీన్ పట్నాయక్.. ఒడిశా ముఖ్యమంత్రిగా సుదీర్ఘకాలం పనిచేస్తున్నారు. బిజూ పట్నాయక్ వారసుడిగా ఒడిశాలో తనదైన పాలన అందిస్తున్నారు. ఆయనకు పెళ్లి కాలేదు. పెళ్లి చేసుకునే వయసు దాటిపోయింది.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : February 16, 2024 / 05:31 PM IST

    Naveen Patnaik

    Follow us on

    Naveen Patnaik: దోపిడీలకు పాల్పడిన రాజకీయ నాయకుడు చనిపోతే ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు.. తన జీవితకాలంలో పిల్లికి కూడా బిచ్చం పెట్టని సినీ నటుడు చనిపోతే ప్రభుత్వం మర్యాదలతో చివరి కార్యక్రమాలు. సమాజ అభివృద్ధికి చిల్లిగవ్వ కూడా ఇవ్వని క్రీడాకారుడు చనిపోతే ప్రభుత్వ ఆధ్వర్యంలో దహన సంస్కారాలు.. ఇలాంటివి మనం రోజూ టీవీలో చూస్తూ ఉంటాం. పేపర్లో చదువుతూనే ఉంటాం. కానీ ఈ సమాజ ఉన్నతికి.. మనుషుల బాగుకోసం పాటుపడిన వారికి అలాంటి గౌరవం దక్కుతుందా? ప్రభుత్వాలు ఆ దిశగా చర్యలు తీసుకుంటాయా? అసలు సమాజం ఉన్నతికి పాటుపడిన వారికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని ఒక చట్టం తీసుకొస్తే ఎలా ఉంటుంది? పదిమందిని బతికించిన ఓ మనిషి శరీరానికి ఘనంగా అంత్యక్రియలు చేస్తే వారి కుటుంబ సభ్యులకు ఎలాంటి తృప్తి కలుగుతుంది? ఈ ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానం చెప్పారు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్. ఇంతకీ ఆయన తీసుకున్న నిర్ణయం ఎలా ఉందో ఈ కథనంలో తెలుసుకుందాం..

    నవీన్ పట్నాయక్.. ఒడిశా ముఖ్యమంత్రిగా సుదీర్ఘకాలం పనిచేస్తున్నారు. బిజూ పట్నాయక్ వారసుడిగా ఒడిశాలో తనదైన పాలన అందిస్తున్నారు. ఆయనకు పెళ్లి కాలేదు. పెళ్లి చేసుకునే వయసు దాటిపోయింది. ఆయనకు ఒడిశా తప్ప ఇంకో వ్యాపకం ఉండదు. బంధువులను పరిపాలనలోకి ఎంటర్ కానివ్వడు. వారిని ఎంటర్టైన్ చేయడు. స్థూలంగా చెప్పాలంటే ఆయనదో లోకం. డబ్బులు ఎవరినీ అడగడు.. లంచాన్ని అస్సలు సహించడు. అయితే ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలు తీసుకోవడంలో నవీన్ పట్నాయక్ ముందు వరుసలో ఉంటాడు. అలా అతడు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

    సాధారణంగా మన దేశంలో అవయవాలు పనిచేయక.. అవయవాలు కావాల్సి వచ్చి.. ఆసుపత్రుల్లో రోజులు లెక్కపెడుతున్న రోగులు ఎంతోమంది. బ్రెయిన్ డెడ్ కేసుల్లో అవయవాలు దానం చేస్తున్నది కొంతమందే. ఇలా అవయవాలు దానం చేసిన వారికి దక్కుతున్న చివరి మజిలీ గౌరవం కూడా అంతంత మాత్రమే. అయితే అవయవ దానం చేసిన వారి అంత్యక్రియలను ప్రభుత్వపరంగా చేపడితే ఎలా ఉంటుంది? దీని వల్ల భవిష్యత్తులో చాలామంది అవయవాలు దానం చేసేందుకు ముందుకు వస్తారు కదా? ఇదే ఆలోచన ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కు వచ్చింది. ఆ ఆలోచన వచ్చిందే తడవుగా ఆయన అమలులో పెట్టారు. అవయవదానాన్ని ప్రోత్సహించేందుకు కీలక ప్రకటన చేశారు.. వాస్తవానికి ఒడిశా ప్రభుత్వం అవయవదానాన్ని ప్రోత్సహిస్తున్నది. 2019 నుంచే గంజాం జిల్లాకు చెందిన సూరజ్ పేరు మీద వార్షిక అవార్డును ప్రకటించింది కూడా. రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ అయిన సూరజ్ అనే బాలుడు అవయవాలను దానం చేసేందుకు అతడి తల్లిదండ్రులు ముందుకు వచ్చారు. గుండె, కాలేయం, మూత్రపిండాలు, కళ్ళు దానం చేసి పలువురి ప్రాణాలు కాపాడారు. వారికి మరో జీవితాన్ని ప్రసాదించారు. ఈ విషయం తెలుసుకున్న నవీన్ పట్నాయక్ అప్పట్లో సూరజ్ తల్లిదండ్రులను కలుసుకొని.. వారు చేసిన పనికి ప్రోత్సాహంగా ప్రభుత్వం తరఫున ఐదు లక్షలు అందజేశారు. ఇక అప్పటి నుంచి ప్రతి సంవత్సరం సూరజ్ పేరు మీద వార్షిక పురస్కారాన్ని అందజేస్తున్నారు..

    వార్షిక పురస్కారం అందజేయడం వల్ల ప్రజల్లో అవగాహన పెరిగినప్పటికీ.. అది నవీన్ పట్నాయక్ ఆశించినత స్థాయిలో కాదు. అందుకే ఆయన అవయవ దానం చేసిన వారికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించారు. దీనివల్ల ప్రజల్లో అవగాహన పెరగడమే కాకుండా.. అవయవాలు దానం చేసిన వారు ప్రజల్లో హీరోలుగా మిగిలిపోతారనేది ఆయన భావన. వారికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు చేయడం వల్ల కుటుంబ సభ్యుల్లో కూడా ఆ గౌరవం ఎప్పటికీ మిగిలిపోతుంది. అందువల్లే నవీన్ పట్నాయక్ ఈ నిర్ణయం తీసుకున్నారు. నవీన్ పట్నాయక్ తీసుకున్న నిర్ణయం పట్ల దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తం అవుతున్నది. ముఖ్యంగా జీవన్ దాన్ లాంటి ట్రస్టు సభ్యులు నవీన్ పట్నాయక్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.. కేవలం ఒడిశా ప్రభుత్వమే కాకుండా తమిళనాడు ప్రభుత్వం కూడా అవయవదానాలను ప్రోత్సహిస్తున్నది. అవయవ దాతల అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహిస్తామని ముఖ్యమంత్రి స్టాలిన్ గతంలోని ప్రకటించారు. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తమిళనాడు రాష్ట్రం నుంచి దీనిని స్ఫూర్తిగా తీసుకొని.. తమ రాష్ట్రంలోనూ అమలు చేస్తున్నామని ప్రకటించారు