https://oktelugu.com/

Naveen Patnaik: ఒడియా భాషరాని నవీన్ పట్నాయక్.. ఎలా సీఎం అయ్యారంటే?

నవీన్ పట్నాయక్ 1946 అక్టోబర్ 16న జన్మించారు. ఉత్తరాఖండ్ డెహ్రాడూన్ లోని ప్రతిష్టాత్మక వెల్హమ్ బాలుర పాఠశాలలో విద్యాభ్యాసం చేశారు.

Written By:
  • Dharma
  • , Updated On : November 28, 2023 / 10:39 AM IST

    Naveen Patnaik

    Follow us on

    Naveen Patnaik: ఒడిస్సా సీఎం నవీన్ పట్నాయక్ ది రాజకీయాల్లో చెరగని ముద్ర. కనీసం రాజకీయాలపై అవగాహన లేని ఆయన ఒడిస్సాకు సుదీర్ఘకాలం సీఎం గా పని చేయడం విశేషం. ఇప్పటికీ ఆయనకు ఒడిస్సా భాష పై పట్టు లేకపోయినా.. అక్కడి ప్రజలపై మాత్రం చెరగని ముద్ర వేసుకున్నారు. తండ్రి అకాల మరణంతో రాజకీయాల్లో ప్రదర్శించాల్సిన అనివార్య పరిస్థితి ఎదురైంది. అయితే ఇలా రాజకీయాల్లో చేరిన కొద్ది రోజుల్లోనే ఒడిస్సా కు ముఖ్యమంత్రి కావడం.. అప్పటినుంచి రెండు దశాబ్దాలకు పైగా సీఎంగా కొనసాగడం నవీన్ పట్నాయక్ ప్రత్యేకత. ప్రస్తుతం వయోభారంతో బాధపడుతున్న నవీన్ తన వారసుడిగా ఐఏఎస్ అధికారిని ప్రకటిస్తారని ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. ఆ నిర్ణయం వెలువడితే మాత్రం దేశ రాజకీయాల్లో ఇదో సంచలనమే.

    నవీన్ పట్నాయక్ 1946 అక్టోబర్ 16న జన్మించారు. ఉత్తరాఖండ్ డెహ్రాడూన్ లోని ప్రతిష్టాత్మక వెల్హమ్ బాలుర పాఠశాలలో విద్యాభ్యాసం చేశారు. ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన కిరోజీ మాల్ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు. ప్రాథమిక స్థాయి నుంచి ఒడిస్సాకు దూరంగా ఉండడంతో మాతృభాషపై పట్టు లేకుండా పోయింది.అనంతరం ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లిపోయారు. నవీన్ పట్నాయక్ తండ్రి బిజూ పట్నాయక్ ఒడిస్సా సీఎం గా పని చేశారు. జనతాదళ్ పార్టీ తరఫున ఆయన ఎంపీగా ఉండగా 1997 ఏప్రిల్ 17న చనిపోయారు. దీంతో విదేశాల్లో ఉన్న నవీన్ పట్నాయక్ రాజకీయ రంగ ప్రవేశం చేయాల్సిన అనివార్య పరిస్థితి ఎదురైంది. తండ్రి మరణంతో ఖాళీ అయిన అస్కా లోక్ సభ ఉప ఎన్నికల్లో పోటీ చేసిన నవీన్ గెలిచారు. కానీ అక్కడకు కొద్ది రోజులకే జనతాదళ్ పార్టీ విచ్ఛిన్నం అయ్యింది.

    అయితే ఒడిస్సా రాజకీయాల్లో రాజకీయ శూన్యత ఏర్పడింది. అప్పటికే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అవినీతిలో కూలిపోయింది. ఈ తరుణంలో 1998లో నవీన్ పట్నాయక్ తన తండ్రి పేరిట బిజూ జనతాదళ్ పార్టీని ఏర్పాటు చేశారు. 1999 సార్వత్రిక ఎన్నికల్లో బిజెపితో పొత్తు పెట్టుకుని ఒడిస్సాలో పార్లమెంట్ స్థానాలకు పోటీ చేశారు. అనూహ్య విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఎన్డీఏ ప్రభుత్వంలో చేరారు. కేంద్ర మంత్రిగా కూడా పదవులు చేపట్టారు. 2000 సంవత్సరంలో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన బీజేడీ తొలిసారిగా అధికారంలోకి వచ్చింది. ఇప్పటివరకు అధికారాన్ని కొనసాగిస్తోంది.

    నవీన్ పట్నాయక్ సుదీర్ఘకాలం ఒడిస్సా ముఖ్యమంత్రిగా పని చేశారు. ఒడిస్సా భాష రాకపోయినా.. రాజకీయాలపై అవగాహన లేకున్నా.. సుదీర్ఘకాలం ఒడిస్సాలో రాణించడానికి కారణం అవినీతి రహిత పాలన. రాజకీయాల్లో క్లీన్ ఇమేజ్ నవీన్ పట్నాయక్ సొంతం. పైగా వారసత్వ రాజకీయాలకు సంబంధించి బీజేడీలో వీలు లేదు. బ్రహ్మచారి కావడంతో వారసత్వం తెరపైకి రాలేదు. బంధువులకు సంబంధించి సైతం ఎవర్నీ రాజకీయాల్లోకి తేలేదు. ఒడిస్సా ప్రజలుపెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా నవీన్ పాలన సాగిస్తున్నారు. అందుకే బిజెడి ని, ఒడిస్సా రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు నవీన్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తన వద్ద ఉంటూ సమర్థుడైన అధికారిగా పేరు తెచ్చుకున్న పాండ్యన్ ను తన వారసుడిగా ప్రకటించేందుకు సిద్ధపడుతున్నట్లు సమాచారం.