NTR Centenary Celebrations: తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తోంది. రాజమండ్రిలో రెండు రోజులపాటు ఉత్సవాలు నిర్వహించేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తుంది. అంతకుముందు హైదరాబాదు, విజయవాడలో ఉత్సవాలు నిర్వహించింది. అంతవరకు బాగానే ఉన్నా టీడీపీ అసలు విషయాన్ని ఇప్పటివరకు ప్రస్తావించింది లేదు. అదేమనగా ఎన్టీ రామారావు జీవిత కాలంలో అనుసరించిన విలువల గురించి. ఆశయాలు, ఆయన ఎన్నుకున్న మార్గాలు, లక్ష్యాల గురించి.
ఎన్టీఆర్ పార్టీ స్థాపించింది తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని జాతీయస్థాయిలో వినిపించేందుకు అని అందరికీ తెలిసిన విషయమే. ఆయన ముఖ్య ఉద్దేశం ఫెడరల్ భావాలు. రాష్ట్రాలపై కేంద్రం జోక్యం ఉండకూడదని పోరాటం చేశారు. ప్రతి విషయానికి కేంద్రంపై రాష్ట్రాలు ఆధారపడకూడదని రాజకీయ చతురతను ఆయన చేసి చూపించారు. అప్పటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీకి సైతం చుక్కలు చూపించారు. గతాన్ని గుర్తు చేసుకుంటున్నప్పుడు ఎన్టీఆర్ పోరాటం చేసింది ఏ విలువల కోసం అనే ప్రస్తావన కూడా తప్పనిసరిగా ఉండాల్సిందే.
కానీ, ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ నిర్వహించిన, నిర్వహించబోతున్న శతజయంతి ఉత్సవాల్లో ఎన్టీఆర్ అనుసరించిన మార్గాల గురించి మచ్చుకైనా వినిపించడం లేదు. ప్రధానమైన ఫెడరల్ వ్యవస్థ అనే అంశంపై ప్రస్తావన ఇప్పటివరకు లేదు. ఆయన కారణజన్ముడని, అంతని.. ఇంతని.. అనడం మినహా ఆయన ఆశయాలను తూచా తప్పకుండా పాటిస్తామని చంద్రబాబు, ఆయన పార్టీ నేతలు ప్రస్తావించింది లేదు.
ఇటీవలి కాలంలో సమస్య ఉత్పన్నమైన ప్రతీసారి రాష్ట్రాలు తరుచూ కేంద్రం వైపు చూడటం జరుగుతుంది. అలా జరిగేలా కేంద్రంలో అధికారం చేపట్టిన ఏ పార్టీ అయినా మలుచుకున్నారనడంలో సందేహం లేదు. న్టీఆర్ ముఖ్యంగా కోరుకున్నది ఫెడరల్ రాజ్యాంగం గురించి. ప్రస్తుతం కేంద్రం తీసుకుంటూ నిర్ణయాలు తప్పు అని చెప్పేందుకు అటు టిడిపి ఇటు వైసిపి వెనుకాడడం గమనించదగ్గ విషయం.
కృష్ణాజిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టి నిజమైన నివాళులు అర్పించింది ఆమెను అని చెప్పుకుంటున్నా వైసిపి కూడా ఎన్టీఆర్ ఆశయాల గురించి ఇప్పటివరకు ప్రస్తావించింది లేదు. శతజయంతి ఉత్సవాలకు వచ్చిన రజినీకాంత్ వ్యాఖ్యలపై స్పందించి వివాదం సృష్టించింది మినహా కేంద్రం అనుసరిస్తున్న విధానాలపై మాట్లాడింది లేదు.
రెండు రోజుల్లో రాజమండ్రిలో జరగనున్న శతజయంతి ఉత్సవాల్లో పార్టీ చేపట్టబోయే కార్యక్రమాలు, భవిష్యత్తు ప్రణాళికలు గురించి విశదీకరిస్తారని అందరూ ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్ కు భారతరత్న కోసం ఎంతకైనా పోరాడుతామని చంద్రబాబు చెబుతున్నారు. అదే సమయలో ఫెడరల్ రాజ్యాంగం, ఎన్టీఆర్ రాజకీయ విలువల గురించి కూడా మాట్లాడతారని ఆశిద్దాం.