NTR 27th Death Anniversary: సినీ వినీలాకాశంలో మెరిసిన ధృవతార. జానపద, సాంఘిక , పౌరాణికాలను వెండితెర పై అలవోకగా ఆవిష్కరించిన వెండితెర వేల్పు. రాజకీయ రంగంలో సంచలనాలు సృష్టించిన కథానాయకుడు. సంక్షేమ పథకాలకు ఆద్యుడు. బడుగుబలహీన వర్గాలకు వెన్నెముకగా నిలిచిన నాయకుడు. భువి నుంచి దివికేగి ఏళ్లు గడిచినా తెలుగు వారి గుండెల్లో చెక్కని శిల్పం. మళ్లీ జన్మంటూ ఉంటే తెలుగు నేలను మరొకసారి తాకిపోవాలని తెలుగు జనం పరితపించే పేరు ఎన్టీఆర్.

ఎన్టీఆర్ ఒక పేరు కాదు. మహోన్నత శక్తి. తెలుగు నేల పై నడియాడిన అరుదైన ఒక వ్యక్తి. తెలుగు జాతి చరిత్రలో తనకంటూ ఒక చరిత్రను లిఖించిన మేరునగధీరుడు. నేడు ఎన్టీఆర్ వర్ధంతి. ఆయన తెలుగు నేలకు దూరమయ్యి 27 సంవత్సరాలవుతున్నాయి. కానీ ఆయన వేసిన ముద్ర మాత్రం చెరగలేదు. విలువలకు వలువలు వదిలిన నేటి సమాజంలో ఆయన కట్టుబడిన విలువలు, పాటించిన సిద్ధాంతాలు నేటికీ ఆదర్శం, ఆచరణీయం.
తెలుగు సినీ, రాజకీయ రంగాల్లో ఎన్టీఆర్ ముద్ర చెరగనిది. చెరపలేనిది. ఆయన సేవలు ఎనలేనివి. సినిమా రంగంలో తనదైన ముద్ర వేశారు. రికార్డులు సృష్టించారు. పౌరాణిక పాత్రలతో తెలుగు వారి రాముడు, కృష్ణుడిగా చెరగని ముద్ర వేసుకున్నారు. సినిమాల్లో ఉంటూనే ప్రజాసేవ కోసం పరితపించారు. తెలుగుదేశం పార్టీ స్థాపించారు. తెలుగు వారి ఆత్మగౌరవం ఢిల్లీ నడివీధుల్లో అవమానాల పాలౌతుంటే.. తెలుగు జాతీ కీర్తి పతాకను ఎగురవేశారు. పార్టీ స్థాపించి 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చారు. సరికొత్త రికార్డు రాజకీయాల్లో లిఖించారు. తొలిసారిగా రూ. 2 కిలో బియ్యం ప్రవేశపెట్టి అన్నార్తుల ఆక్రందనలు తీర్చారు. సంక్షేమ బాట పట్టించారు.
పటేల్, పట్వారీ వ్యవస్థలను రద్దు చేసి మండల వ్యవస్థను తీసుకొచ్చారు. బలహీన వర్గాలకు బాసటగా నిలిచారు. అధికారంలో భాగస్వామ్యం కల్పించారు. ఆయన వేసిన విత్తనాలే తెలుగు నేల పై రాజకీయ వటవృక్షాలుగా ఎదిగాయి. ఎంతో మంది బీసీ నాయకులు అగ్రస్థానంలో నిలబడ్డారు. సంక్షేమ పథాకాల కోసం నిత్యం అప్పులు తెస్తున్న నేటి పాలకులకు ఎన్టీఆర్ ఒక దిక్సూచి. అప్పులు చేయకుండా సంక్షేమాన్ని ఇచ్చిన ఘనత ఎన్టీఆర్ దే. ఎన్టీఆర్ వేసిన బాట నేటి పాలకులకు ఆచరణీయం.

ఎన్నో ఏళ్లు రాజకీయాల్లో ఉన్నప్పటికీ అవినీతి మరకలు అంటని మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్. రాజకీయాలు దోచుకోవడానికో, దాచుకోవడానికో కాదని, ప్రజాసేవ కోసమని గంటాపథంగా చెప్పిన వ్యక్తి ఎన్టీఆర్. ఎన్టీఆర్ జీవితం తెరిచిన పుస్తకం. ఆయన జీవిత చరమాంఖం వెన్నెల్లో చంద్రుడి పై మచ్చలా మిగిలిపోయింది.
-1996లో వెన్నుపోటు.. బాబే బందిపోటు
ఎన్టీఆర్ సినిమాల్లో, రాజకీయాల్లో ఎంతో ఎత్తుకు ఎదిగినా కూడా ఆయన జీవితంలో ఒకటి మాత్రం చేదు జ్ఞాపకంగా మారింది. అదే లక్ష్మీపార్వతిని రెండో భార్యగా ఎంచుకోవడం.. పాలనలోకి ప్రవేశపెట్టడం.. దానికి నందమూరి ఫ్యామిలీ, అల్లుడు చంద్రబాబు వ్యతిరేకించడం.. ఆ తర్వాత వారంతా కలిసి చంద్రబాబు సారథ్యంలో వెన్నుపోటు పొడవడం.. ఈ ఎపిసోడ్ ఇప్పటికీ చంద్రబాబును ‘వెన్నుపోటు’ చక్రవర్తిగా మార్చింది. తీరని కళంకంగా మిగిల్చింది. తెలుగుదేశం పగ్గాలు నందమూరి కుటుంబం నుంచి నారా కబంధ హస్తాల్లోకి మారిపోయేలా చేసింది. ఎందరు ఎన్ని అన్నా కూడా ఎన్టీఆర్ కు చంద్రబాబు వెన్నుపోటు తెలుగు రాజకీయాల్లో ఒక చెరగని విషాదంగానే ఉంది. ఇప్పటికీ బాబును అది వెంటాడుతూనే ఉంది.
ఆయన గతించి 27 ఏళ్లు గడిచిప్పటికీ జనం ఆయనను మరవలేదు. జనం గుండెల్లో ఆయన గుర్తుండిపోయారు. తెలుగు జాతి ఉన్నంత వరకు ఎన్టీఆర్ కు మరణం లేదు.