https://oktelugu.com/

Mumbai Attacks: ముంబై ఉగ్రదాడికి 15 ఏళ్లు.. ఆ ఐదుగురి పోరాటం అసమానం

ఉగ్రవాదులను నియంత్రించడంలో వీర జవానులు, పోలీసులు చూపిన తెగువ అజరామరంగా నిలుస్తోంది. ముఖ్యంగా ఐదుగురు వీర జవానులు వీరోచిత పోరాటంతో వందలాదిమంది అమాయకుల ప్రాణాలు కాపాడగలిగారు.

Written By:
  • Dharma
  • , Updated On : November 26, 2023 / 10:04 AM IST
    Follow us on

    Mumbai Attacks: పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు ప్రపంచాన్ని వణికిస్తున్నాయి. కేవలం భారత్ మాత్రమే కాకుండా.. ప్రపంచంలో చాలా దేశాలు ఉగ్రవాద బారిన పడుతున్నాయి. చివరకు పాకిస్తాన్ సైతం బాధిత దేశంగా మారుతుండడం విశేషం. భారత ఆర్థిక రాజధాని అయిన ముంబై పై లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ దాడి జరిగి 15 ఏళ్లు అవుతోంది. కానీ అదో మాయని గాయంగా నిలుస్తోంది. 2008 నవంబర్ 26న కొలాబా సముద్ర తీరం నుంచి ముంబైలోకి చొరబడిన పదిమంది తీవ్రవాదులు నగరమంతా విస్తరించారు. బృందాలుగా విడిపోయి చత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినేషన్ రైల్వే స్టేషన్, తాజ్ హోటల్, నారీమణులైట్ హౌస్ వంటి రద్దీగా ఉన్న ప్రాంతాలకు చేరారు. ఏకకాలంలో 12 చోట్ల ఒకేసారి బాంబుల మోత మోగించారు. దాదాపు 60 గంటల పాటు సాగిన ఈ మారణ హోమంలో 166 మంది చనిపోయారు. ఈ మారణ హోమం యావత్ ప్రపంచాన్ని వణికించింది. భారత్ కు అన్ని దేశాల మద్దతు లభించింది.

    అయితే ఉగ్రవాదులను నియంత్రించడంలో వీర జవానులు, పోలీసులు చూపిన తెగువ అజరామరంగా నిలుస్తోంది. ముఖ్యంగా ఐదుగురు వీర జవానులు వీరోచిత పోరాటంతో వందలాదిమంది అమాయకుల ప్రాణాలు కాపాడగలిగారు. చివరకు ముష్కరుల దాడిలో అసువులు బాసారు. పరాక్రమ వీరులుగా భారత జాతిపై చెరగని ముద్ర వేశారు. ముంబై దాడులు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ అమరవీరుల స్ఫూర్తిని, పోరాట నిరతిని ఒక్కసారి గుర్తు చేసుకుందాం.
    * హేమంత్ కర్కరే
    ముంబై యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ చీఫ్ గా హేమంత్ కర్కరే ఉండేవారు. సరిగ్గా రాత్రి భోజనం చేస్తుండగా నగరంలోకి తీవ్రవాదులు ప్రవేశించారు అన్న సమాచారం వచ్చింది. వెంటనే ఇంటి నుంచి బయటకు వచ్చి ఎసిపి అశోక్ కామ్టే, ఇన్స్పెక్టర్ విజయ్ సలాస్కర్ తో కలిసి డ్యూటీలోకి దిగారు. కామ హాస్పిటల్ వెలుపల జరిగిన ఎన్కౌంటర్లో ఉగ్రవాదులు అజ్మల్ కసాబ్, ఇస్మాయిల్ ఖాన్ లు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో హేమంత్ వీర మరణం పొందారు. ఆయన పోరాటానికి గుర్తుగా భారత ప్రభుత్వం అశోక చక్ర పురస్కారంతో గౌరవించింది. అంజలి ఘటించింది.

    * అశోక్ కామ్టే

    ముంబై పోలీస్ విభాగంలో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ గా అశోక్ విధులు నిర్వహిస్తుండేవారు. ఉగ్రదాడి జరిగిన సమయంలో ఆయన ఏ టి ఎస్ చీఫ్ హేమంత్ కర్కరే బృందం లో ఉండేవారు. కామా హాస్పిటల్ వెలుపల జరిగిన ఎన్కౌంటర్లో ఉగ్రవాది ఇస్మాయిల్ ఖాన్ అతనిపై కాల్పులు జరిపాడు. ఒక బుల్లెట్ అశోక్ తలకు తగిలింది. ఆ స్థితిలో కూడా కొందరు శత్రువులను అశోక్ తుద ముట్టించాడు.
    * విజయ్ సలాస్కర్
    ఈయన సీనియర్ పోలీస్ ఇన్స్పెక్టర్. విజయ్ సలాస్కర్ పేరు వింటేనే ముంబై అండర్ వరల్డ్ వణికి పోయేది. ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ గా గుర్తింపు పొందిన విజయ్ ఏపీఎస్ చీఫ్ హేమంత్ కర్కరే బృందంలో ఒక సభ్యుడు. ఉగ్రవాదుల బుల్లెట్ దాటికి ఎదురెళ్లి మరి కొంతమంది అమాయకుల ప్రాణాలను కాపాడగలిగారు. ఈయనకు సైతం మరణానంతరం అశోక చక్ర పురస్కారం లభించింది.
    * తుకారాం ఓంబ్లె
    ముంబై పోలీస్ విభాగంలో ఈయన ఏఎస్ఐ గా పని చేసేవారు. ఉగ్రవాదులను ఎదుర్కోవడంలో అత్యంత ధైర్య సాహసాలను ప్రదర్శించారు. ఉగ్రవాది అజ్మల్ కసబ్ ను ఎదుర్కోవడమే కాకుండా, అతన్ని పట్టుకోవడంలో కూడా విజయం సాధించారు. కసబ్ అతనిపై కాల్పులు జరపడంతో తుకారాం అమరుడయ్యారు. ఈయనకు సైతం అశోక చక్ర పురస్కారం ప్రకటించి భారత ప్రభుత్వం గౌరవించింది.
    * మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్
    మిషన్ ఆపరేషన్ బ్లాక్ టోర్నాడోకు నాయకత్వం వహించింది ఈయనే. 51 ఎన్ఎస్ఏజీ కమాండర్. తాజ్ మహల్ ప్యాలెస్, టవర్స్ హోటల్ లోపల దాక్కున్న ఉగ్రవాదులపై మేజర్ ఉన్నికృష్ణన్ పోరాడుతుండగా.. వెనుక నుంచి ఓ ఉగ్రవాది దాడి చేశాడు. దీంతో మేజర్ కుప్పకూలిపోయారు. ఆయనకు సైతం అశోక చక్ర పురస్కారం లభించడం విశేషం. ఈ ఐదుగురే కాదు.. హవల్దార్ గజేంద్ర సింగ్, నాగప్ప ఆర్. మహాలే, కిషోర్ కె. సిండే, సంజయ్ గోవిల్కర్, సునీల్ కుమార్ యాదవ్ వంటి పోరాట యోధులు అమరులయ్యారు. ఉగ్రవాద ఉన్మాద చర్యల నుంచి ముంబై నగరాన్ని కాపాడగలిగారు. ఈ ఘటన జరిగి 15 ఏళ్లు కావస్తున్నా.. మృతుల కుటుంబాలకు, అమరవీరుల కుటుంబ సభ్యులకు ఇదో మానని గాయంగా మిగిలింది.