https://oktelugu.com/

Revanth Reddy : ఆరు గ్యారంటీలు మాత్రమే కాదు.. రేవంత్ ముందు ఎన్నో సవాళ్లు

ఆరు నెలల్లో పార్లమెంటు ఎన్నికలు ఉన్న నేపథ్యంలో.. సవాళ్లు మొత్తం దాటుకొని ఆరు గ్యారెంటీలు విధిగా అమలు చేయాల్సిన బాధ్యత కొత్తగా కొలువుదీరే కాంగ్రెస్ ప్రభుత్వం పై ఉంది.

Written By:
  • NARESH
  • , Updated On : December 6, 2023 / 10:27 PM IST
    Follow us on

    Revanth Reddy : అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించింది. రేవంత్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో తొలిసారి అధికారాన్ని చేపట్టబోతోంది. గురువారం ఎల్బీ స్టేడియం వేదికగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ఇంతవరకు బాగానే ఉంది కానీ అసలు సమస్యలే చాలా ఉన్నాయి. ఎన్నికల ప్రచార సమయంలో ప్రకటించిన ఆరు గ్యారెంటీలు, 5 లక్షల కోట్ల అప్పు, 50 వేల కోట్ల నష్టాల్లో విద్యుత్ సంస్థలు, లక్ష కోట్ల కాలేశ్వరం బ్యారేజీ.. ఇలా ఎన్నో సమస్యలు రేవంత్ నాయకత్వానికి సవాలు విసురుతున్నాయి. మరి వీటిని ఆయన ఎలా అధిగమిస్తారు అనేదే ఇప్పుడు ప్రశ్న.

    ఎన్నో సమస్యలు

    ఆర్థికపరంగా తెలంగాణ రాష్ట్రం ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నది.. ఇప్పటికే రాష్ట్రం ఐదు లక్షల కోట్ల అప్పుల్లో ఉంది. విద్యుత్ సంస్థలు 50 వేల కోట్ల నష్టాల్లో ఉన్నాయి. లక్ష కోట్లతో నిర్మించిన కాలేశ్వరం ఎత్తిపోతల పథకం ప్రశ్నార్థకంగా ఉంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ప్రకటించిన ఆరు గ్యారంటీలు.. ఇవి ఇప్పటికిప్పుడు అమలు చేయాలంటే 75 వేల కోట్ల నిధులు అవసరం. ఆరు గ్యారంటీల్లో ప్రధానంగా రెండు లక్షల ఉద్యోగుల భర్తీ.. ఏ సమయంలో వీటి కోసం నోటిఫికేషన్ ఇస్తామో కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. సో ఈ ఉద్యోగాల భర్తీకి కూడా నిధులు భారీగానే అవసరం ఉంటాయి.. ఇక విద్యుత్ సంస్థలు కూడా 50వేల కోట్లు నష్టాల్లో ఉన్నాయి. కాంగ్రెస్ హామీ ఇచ్చినట్టుగా 200 యూనిట్ల దాకా ఉచిత విద్యుత్ అందించాలంటే 3500 కోట్ల దాకా సబ్సిడీ రూపంలో డిస్కమ్ లకు అందించాల్సి ఉంటుంది. ఇప్పటికే 10,000 కోట్లను రాయితీ రూపంలో ప్రభుత్వం విద్యుత్ డిస్కం లకు ఇస్తోంది. ఇది మాత్రమే కాకుండా అదనంగా ఇప్పుడు 3,500 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఇక రాష్ట్రమంతా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ హామీని కూడా అమలు చేయాల్సి ఉంటుంది. ప్రజా రవాణా వ్యవస్థ మెరుగుపడే అవకాశం ఉన్నప్పటికీ.. రద్దీకి అనుగుణంగా వేలాది బస్సులను సమకూర్చాల్సి ఉంటుంది. అయితే ఆర్టీసీ కూడా నష్టాల్లో ఉంది. ఇక ఉద్యోగుల కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం రద్దు, ఉద్యోగ, ఉపాధ్యాయులకు వేతన సవరణ కూడా అత్యంత కీలకంగా కానుంది.

    శాంతి భద్రతలను పరిరక్షించాలి

    హైదరాబాద్ కు బ్రాండ్ ఇమేజ్ ఉంది. అంతర్జాతీయ సంస్థలు ఇక్కడ కార్యకాలాపాలు సాగిస్తున్న నేపథ్యంలో పెట్టుబడులు వచ్చేలా ప్రభుత్వం చూసుకోవాల్సి ఉంటుంది. హైదరాబాదులో శాంతి భద్రతల పై కెసిఆర్ ప్రభుత్వం దృష్టి సారించిన నేపథ్యంలో.. గ్రేటర్ పరిధిలో పార్టీ బలమైన సీట్లు సాధించిందనే అభిప్రాయాలున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా శాంతి బాధితుల పరిరక్షణ కూడా ప్రధాన లక్ష్యం కావాల్సి ఉంటుంది. ఒకవైపు మజ్లీస్.. మరోవైపు బిజెపి మోహరించి ఉన్న నేపథ్యంలో.. హైదరాబాద్ తో పాటు పలు సున్నిత ప్రాంతాల్లో శాంతి భద్రతల పారి రక్షణ అత్యంత ప్రధానం కానుంది. ఇక ఇది మాత్రమే కాకుండా శ్రీశైలం, సాగర్ డ్యాం ను నది బోర్డు కు అప్పగించే అంశంపై కేంద్ర జల శక్తి శాఖ సమావేశం కానుంది. మరి దీనిపై ఏ నిర్ణయం తీసుకోవాలి అనేది ప్రభుత్వం తేల్చాలి. అని వెబ్సైటుకు చట్టబద్ధత కల్పించే తెలంగాణ పట్టాదారు పాస్ పుస్తక చట్టంలో సవరణల అంశం కూడా ఉంది. రాష్ట్రంలో రెవెన్యూ రికార్డులకు, భూములకు లింకు లేకుండా పోయింది. దీంతో పూర్వ నిజామాబాద్ జిల్లాలో భూ భారతి ప్రాజెక్టు రికార్డులకు చట్టబద్ధత కల్పించడం వంటి అంశాలు ముడిపడి ఉన్నాయి. ఆరు నెలల్లో పార్లమెంటు ఎన్నికలు ఉన్న నేపథ్యంలో.. సవాళ్లు మొత్తం దాటుకొని ఆరు గ్యారెంటీలు విధిగా అమలు చేయాల్సిన బాధ్యత కొత్తగా కొలువుదీరే కాంగ్రెస్ ప్రభుత్వం పై ఉంది. భారత రాష్ట్ర సమితి పాలనలో అవినీతిని పదేపదే ఎత్తి చూపించిన బిజెపి ఇకపై కాంగ్రెస్ ప్రభుత్వం పై కూడా డేగ కళ్ళతో నిఘాపెట్టే అవకాశం లేకపోలేదు.