NDA Vs India Alliance: ఎన్డీఏ వర్సెస్ ఇండియా కూటమి.. తెలుగుదేశానికి ఏది బెటర్ అంటే?

చంద్రబాబు అరెస్టు తరువాత ఇండియా కూటమి నేతల వైపు నుంచి ఎక్కువగా స్పందన వచ్చింది. బిజెపి జాతీయ నేతలు కానీ, ఎన్డీఏ కూటమి నాయకులు కానీ స్పందించలేదు. దీనిని టిడిపి శ్రేణులు తట్టుకోలేకపోతున్నాయి.

Written By: Dharma, Updated On : September 21, 2023 2:13 pm

NDA Vs India Alliance

Follow us on

NDA Vs India Alliance: తెలుగుదేశం పార్టీలో అసహనం పెరుగుతోంది. చంద్రబాబు అరెస్టై పది రోజులు గడుస్తున్నా కేంద్ర పెద్దలు స్పందించకపోవడంతో టిడిపి శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వారం రోజులుగా ఢిల్లీలో గడుపుతున్న లోకేష్ కు ప్రధాని మోదీ, అమిత్ షా కలిసేందుకు అవకాశం ఇవ్వకపోవడంపై టిడిపి శ్రేణులు మండిపడుతున్నాయి. అటువంటి వారితో కలిసి పని చేసే కంటే.. టిడిపికి గౌరవం లభించే ఇండియా కూటమి వైపు అడుగులు వేయడమే ఉత్తమమని తెలుగు తమ్ముళ్లు భావిస్తున్నారు.

చంద్రబాబు అరెస్టు తరువాత ఇండియా కూటమి నేతల వైపు నుంచి ఎక్కువగా స్పందన వచ్చింది. బిజెపి జాతీయ నేతలు కానీ, ఎన్డీఏ కూటమి నాయకులు కానీ స్పందించలేదు. దీనిని టిడిపి శ్రేణులు తట్టుకోలేకపోతున్నాయి. ఎన్డీఏ కి దగ్గరవుతామని చంద్రబాబు అనుకోవడంలో తప్పులేదు.. కానీ కష్టంలో ఉన్నప్పుడు కూడా వారు ఆదుకోకపోతే దానిని ఏమనుకోవాలి? అని తమ్ముళ్లు తెగ బాధపడుతున్నారు. అందుకే ఎన్డీఏ వైపు చూడడం వేస్ట్ అని.. ఇండియా కూటమి మేలని భావిస్తున్నారు. చంద్రబాబు గట్టి నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

అయితే ఇప్పటికే ఓసారి తీసుకున్న నిర్ణయం ప్రతికూల ప్రభావం చూపడంతో చంద్రబాబు ఆచీతూచీ అడుగులు వేసే అవకాశాలు ఉన్నాయి. రాబోయే ఎన్నికల్లో మళ్లీ ఎన్డీఏ నే అధికారంలో వస్తుందన్న అంచనాలు ఉన్నాయి. అయితే ఆ కూటమికి సీట్లు తగ్గే అవకాశం ఉంది. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ పుంజుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇటువంటి తరుణంలో ఇప్పటిలా దూకుడుగా వ్యవహరించే అవకాశం మోడీ, అమిత్ షాలకు దక్కదన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఇటువంటి తరుణంలో భవిష్యత్తు అవసరాల కోసం ఇండియా కూటమి వైపు అడుగులు వేయడమే ఉత్తమమని అధినేతకు తెలుగు తమ్ముళ్లు కోరుతున్నారు.

చంద్రబాబు అరెస్ట్ తరువాత ఎక్కువగా స్పందించినది ఇండియా కూటమి నేతలే. మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్, వామపక్షాల నాయకులు.. ఇలా అందరూ వరుసగా స్పందించారు. తెగ బాధపడ్డారు. సీఎం జగన్ వైఖరి పై మండిపడ్డారు. కానీ కేంద్ర పెద్దలు కనీసం స్పందించలేదు. అసలు ఏం జరిగిందో ఆరా తీయలేదు. సహాయం కోసం ఢిల్లీ వచ్చిన లోకేష్ ను పట్టించుకోలేదు. అదే ఇండియా కూటమిలో ఉండి ఉంటే జాతీయస్థాయిలో ఒక ఉద్యమమే ఎగసిపడేది. ఈ పరిణామాల క్రమంలో టిడిపి శ్రేణులు బిజెపి వైఖరిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. కఠిన నిర్ణయం తీసుకోవాలని అధినేతకు విజ్ఞప్తి చేస్తున్నారు.