Pingali Venkayya Centenary: జనగణమన అనే పాట వినిపించగానే దేశంలో ప్రతి ఒక్కరి మది ఉప్పొంగుతుంది. ఆ మూడు రంగుల జెండాను చూసిన ప్రతి ఒక్క గుండె ఉద్వేగంగా స్పందిస్తుంది. అందుకే ఈ దేశం మనదే.. తేజం మనదే.. ఎగురుతున్న జెండా మనదే..” నేను అంతా కలిపితే పిడికెడు మట్టే కావచ్చు.. కానీ తల ఎత్తి చూస్తే నా దేశపు జెండాకు ఉన్నంత పొగరు నాకుంది” ఇలాంటి మాటలు రాయాలంటే ఎంత గుండె ధైర్యం ఉండాలి? అంతటి గుండె ధైర్యాన్ని పాదుకొల్పిన జెండాకు ఇంకెంత తెగువ ఉండాలి? ఆ తెవువ కు సిసలైన అర్థమే మువ్వన్నెల జెండా. వీరుల రక్తానికి చిహ్నంగా కాషాయం, శాంతికి గుర్తుగా తెలుపు, పచ్చని పంటలకు ప్రతీకగా ఆకుపచ్చ రంగు.. ఈ దేశ సార్వభౌమాధికారాన్ని వివరించే అశోక చక్రం… ఇంతటి ఘనత భారతదేశ జాతీయ జెండా సొంతం. ప్రపంచంలో ఏ జాతీయ జెండాలోనూ ఇన్ని వైవిధ్యాలు కనిపించవు. ఈ జాతీయ జెండా రూపశిల్పి స్వర్గీయ పింగళి వెంకయ్య.

దేశం 75 సంవత్సరాల స్వాతంత్ర సంబరాలు జరుపుకుంటున్న వేళ ఆ మహనీయుని స్మరించుకోవడం భారతీయులుగా మన ప్రథమ కర్తవ్యం. ఆగస్టు ఒకటి మంగళవారం పింగళి వెంకయ్య 146వ జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో భారీ ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తోంది. కానీ ఇదే సమయంలో అంతటి ఘన కీర్తి కారుడు ఎటువంటి గుర్తింపుకు నోచుకోకపోవడం బాధాకరం. అసలు పింగళి వెంకయ్యను ఈ జాతి ఎందుకు అంతగా గుర్తించలేదు? జీవిత చర్మంకంలో ఆయన ఆర్థిక ఇబ్బందులు ఎందుకు ఎదుర్కొన్నారు? మరణ అనంతరం కూడా ప్రభుత్వం ఎందుకు ఇంకా చిన్న చూపే చూస్తోంది? ఎంతోమంది భారత రత్నాలు అయిన ఈ దేశంలో పింగళి వెంకయ్య ఎందుకు ఇంకా ఆ గౌరవానికి దూరంగానే ఉన్నారు?
జీవితాంతం గాంధేయవాదిగానే
1876 ఆగస్టు 2న ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా మచిలీపట్నంలో తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో పింగళి వెంకయ్య జన్మించారు. తండ్రి పింగళి హనుమంత రాయుడు, తల్లి వెంకటరత్నం.బాల్యం, విద్యాభ్యాసం చల్లపల్లి మండలం యార్లగడ్డ, మొవ్వ మండలం బట్ల పెనుమర్రు, మోపిదేవి మండలం పెద్ద కల్లేపల్లి లో కొనసాగించారు. పింగళి వెంకయ్య తాతయ్య పేరు చలపతిరావు. ఈయన తహసిల్దార్ గా పనిచేసేవారు. పింగళి వెంకయ్య మచిలీపట్నం హిందూ ఉన్నత పాఠశాలలో ప్రాథమిక విద్యను అభ్యసించారు. ఆయనకు పామర్రు గ్రామకరణం రుక్మిణి తో వివాహం జరిగింది. తన ఉన్నత విద్యను పూర్తి చేసిన తర్వాత అతను 19 సంవత్సరాల వయసులో బ్రిటిష్ సైన్యంలో చేరాడు. దక్షిణాఫ్రికాలో జరిగిన “ఆంగ్లో బోయర్ ” యుద్ధంలో పాల్గొన్నారు. అదే సమయంలో అక్కడ మహాత్మా గాంధీని (1899-1902) కలుసుకున్నాడు. అదే సమయంలో ఇద్దరి మధ్య చర్చలు జరిగాయి. యుద్ధం అనంతరం బ్రిటిష్ జాతీయ జెండాకు సైనికులు సెల్యూట్ చేయడం పింగళి వెంకయ్య మనసులో బాగా ముద్ర పడిపోయింది. ఆయన దేశానికి తిరిగి వచ్చారు. మచిలీపట్నంలోని ఆంధ్ర నేషనల్ కాలేజీలో లెక్చరర్ గా ఉద్యోగ జీవితం ప్రారంభించారు. మన దేశానికి కూడా ఒక జెండాను రూపొందించాలని అప్పుడే ఆయన అనుకున్నారు.
ఆ సంఘటనను చూసి
దేశ స్వాతంత్ర ఉద్యమం కోసం అఖిల భారత కాంగ్రెస్ ఆధ్వర్యంలో విస్తృతంగా సమావేశాలు జరుగుతుండేవి. మేధావులు, ఉద్యమకారులు అందులో పాల్గొనేవారు. 1906లో కలకత్తాలో కాంగ్రెస్ సమావేశాల ప్రారంభోత్సవంలో బ్రిటిష్ దేశస్థులు వారి జాతీయ జెండాను మనదేశంలో ఆవిష్కరించడాన్ని చూసి చాలామంది కలత చెందారు. అదే సమయంలో మన దేశానికి కూడా ఒక జాతీయ జెండా ఉండాలని అభిప్రాయానికి వచ్చారు. ఇదే విషయాన్ని పింగళి వెంకయ్య సమావేశంలో ఉద్ఘాటించారు. అయితే జెండాకు సంబంధించి తానే రూపకల్పన చేస్తానని ప్రకటించారు. అప్పటినుంచి ఇతర దేశాలకు సంబంధించిన జెండాలను ఆయన అధ్యయనం చేశారు. భారతదేశ జాతీయ జెండా కోసం ఆయన ఆ రోజుల్లోనే 30 రకాల నమూనాలను సిద్ధం చేశారు. ఆంగ్లేయుల ఒత్తిడి అధికంగా ఉన్న ఆ రోజుల్లో 1916లో” ఏ నేషనల్ ఫ్లాగ్ ఫర్ ఇండియా” అనే బుక్ లెట్ ను ప్రచురించారు. 1921 మార్చి 31, ఏప్రిల్ ఒకటి ఈ రెండు రోజుల పాటు విజయవాడలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశానికి మహాత్మా గాంధీ హాజరయ్యారు. ఆ సమావేశంలోనే పింగళి వెంకయ్య మాటలు గుర్తుకు వచ్చి జాతీయ జెండా ఆవశ్యకతను ఆయన నొక్కి చెప్పారు. అదే సమయంలో పింగళి, మహాత్మా గాంధీ తో పాటు విక్టోరియా మ్యూజియం కూడా వెళ్లారు అక్కడ ఉన్న వివిధ ఆకృతులను పరిశీలించారు అయితే ఈ పర్యటన పింగళి వెంకయ్య దృక్పథాన్ని పూర్తిగా మార్చేవేసింది.
మొదట్లో కాషాయం ఆకుపచ్చ రంగు మాత్రమే జెండాలో ఉండాలని నిర్ణయించారు. మధ్యలో చేనేతకు చిహ్నంగా చరఖాను ఉంచారు. ఈ జెండాను చూసి మురిసిపోయిన గాంధీ మహాత్ముడు ఒక చిన్న సలహా ఇచ్చారు. ఆ చరఖా స్థానంలో తెలుపు రంగు వేయాలని ఆదేశించారు. వెంటనే పింగళి వెంకయ్య మూడు గంటల్లో జెండాను సిద్ధం చేసి సమావేశంలో ప్రదర్శించారు. దీనికి కాంగ్రెస్ నేతలు కూడా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. అంతేకాకుండా సమావేశంలో తీర్మానం కూడా చేశారు. అదే సంవత్సరం ఏప్రిల్ 13న “యంగ్ ఇండియా” పత్రికలో మహాత్మా గాంధీ జాతీయ జెండా ఆవశ్యకతను ప్రస్తుతిస్తూ ఒక ప్రత్యేక వ్యాసం రాశారు. దాని రూపకర్త పింగళి వెంకయ్యను ప్రశంసించారు. ఇక అప్పటినుంచి ఆయన “జెండా వెంకయ్య”గా స్థిరపడ్డారు. 1931 వరకు ఈ స్వరాజ్ జెండా దేశమంతా రెపరెపలాడింది. అయితే మధ్య మధ్యలో జరిగిన సమావేశాల్లో వివిధ వర్గాలకు చెందిన మేధావులు ఇచ్చిన సూచనల ప్రకారం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ జెండాలో కొన్ని మార్పులు చేర్పులు చేపట్టింది. ఎరుపు రంగును కాషాయంతో భర్తీ చేసింది. చరఖాను జోడించింది. ఇక 1947 లో స్వాతంత్రం అనంతరం తొలి రాష్ట్రపతి బాబు రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో నేషనల్ ఫ్లాగ్ కమిటీ సమావేశం అయింది.. చరఖా స్థానంలో అశోకుడి చక్రం ఉంచాలని తీర్మానం చేశారు. అప్పటినుంచి తెలుపు రంగు మధ్యలో అశోకుడి చక్రం స్థిరపడిపోయింది.

పింగళి వెంకయ్య బహుముఖ ప్రజ్ఞాశాలి
పింగళి వెంకయ్య కేవలం అధ్యాపకులు మాత్రమే కాదు.. ఆయనకు అనేక విషయాలపై పట్టు ఎక్కువ. 1913లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పూర్తిగా జపాన్ భాషలో మాట్లాడారు అప్పటినుంచి ఆయనను జపాన్ వెంకయ్యగా పిలవడం మొదలుపెట్టారు ఇక మచిలీపట్నం అప్పట్లో చేపలు పట్టే పరిశ్రమలకు వస్త్ర పరిశ్రమలకు పెద్ద కేంద్రంగా ఉండేది వస్త్ర పరిశ్రమకు ముఖ్య వనరు పత్తి కాబట్టి ఆ పంటలో అధిక దిగుబడులు సాధించేందుకు కంబోడియా కాటన్ అనే వంగడంపై పరిశోధన చేసి పత్తి వెంకయ్యగా మరో పేరు తెచ్చుకున్నారు ఒక వ్యక్తి జెండా వెంకయ్యగా జపాన్ వెంకయ్యగా పత్తి వెంకయ్యగా స్థిరపడిపోవడం చరిత్రలో ఎవరికి సాధ్యపడకపోవచ్చు. ఇక పింగళి వెంకయ్య స్థిత ప్రజ్ఞుడు. హుందాగా ఉండే స్వాతంత్ర సమరయోధుడు. ప్రేమను పెంచి పది మందికి పంచాలని పదే పదే చెప్పేవారు. తన రాజకీయ గురువు బాలగంగాధర తిలక్ మరణ అనంతరం రాజకీయాలకు దూరంగా ఉన్నారు నెల్లూరులో కొంతకాలం పాటు పరిశోధనలు చేశారు.
నేలలు ఖనిజాల శాఖలో కేంద్ర ప్రభుత్వ సలహాదారుగా పనిచేశారు. జీవిత చరమంగంలో విజయవాడకు వచ్చారు ఆ సమయంలో ఆర్థిక ఇబ్బందులు ఆయనను తీవ్రంగా ఇబ్బంది పెట్టాయి పింగళి 1963 జూలై 4న మరణించారు. అప్పటి ప్రధాని లాల్ బహుదూర్ శాస్త్రి విజయవాడ వచ్చినప్పుడు గాంధీజీ లోని లైబ్రరీ హాల్లో పింగళి చిత్రపటం ఆవిష్కరించారు ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో హైదరాబాద్ ట్యాంక్ బండి పై ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు 2009లో కేంద్రం పోస్టల్ స్టాంప్ విడుదల చేసింది 2011 లో భారతరత్న ఇవ్వాలని ప్రతిపాదన వచ్చిన ఇప్పటికీ అలాగే ఉంది. కారులో అప్పటి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు విజయవాడ ఆకాశవాణి కేంద్రానికి పింగళి పేరును పెట్టారు కార్యాలయ ఆవరణలో పింగళి విగ్రహాన్ని ఆవిష్కరించారు. జాతీయ జెండాకు సంబంధించి రూపకల్పన చేసిన పింగళి వెంకయ్య జీవిత చర్మంకంలో ఆర్థిక ఇబ్బందులు పడినప్పుడు ఎవరూ ఆదుకోలేదు. ఆయన మరణానంతరం కూడా దక్కాల్సిన గౌరవం దక్కలేదు. ఇప్పటికీ దేశంలో ఎంతోమంది లబ్ద ప్రతిష్ట వ్యక్తులకు భారతరత్న పురస్కారం లభించింది. కానీ పింగళి వెంకయ్యకు ఇంతవరకు ఆ పురస్కారం అందలేదు. ఈ దేశాన్ని ఏళ్లపాటు ఏలిన కాంగ్రెస్ ప్రభుత్వానికి స్వతహాగా గాంధేయవాదుడైన పింగళి వెంకయ్య గుర్తుకు రాకపోవడం బాధాకరం. దేశం 75 ఏళ్ల స్వాతంత్ర సంబరాలు ఇప్పటికైనా ఆ పింగళి మహనీయుడికి భారతరత్న పురస్కారం అందిస్తే బాగుంటుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.