https://oktelugu.com/

Narendra Modi : సంప్రదాయాన్ని పాటించే మోడీ నోట.. మినీ స్కర్ట్ వ్యాఖ్యలు.. ఇంతకీ ఏం జరిగిందంటే..

కాగా, ఫ్యాషన్ విభాగంలో జాన్విసింగ్ అనే యువతి విజేతగా నిలిచారు. ఆమెకు ప్రధాని కంటెంట్ క్రియేటర్ పురస్కారం అందించారు. ఈ సందర్భంగా ఆమెతో ప్రధాని ముచ్చటించారు. వారిద్దరి మధ్య సంభాషణ లోనే ప్రధాని మినీ స్కర్ట్ వ్యాఖ్యలు చేశారు.

Written By:
  • NARESH
  • , Updated On : March 8, 2024 8:04 pm
    Narendra Modi

    Narendra Modi

    Follow us on

    Narendra Modi : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. బిజెపిలో సామాన్య కార్యకర్తగా ఉన్న నాటి నుంచి ప్రధానమంత్రిగా దేశాన్ని పాలిస్తున్న నేటి వరకు సంప్రదాయ దుస్తులనే ధరించేవారు. ఇప్పుడు కూడా పద్ధతి పాటిస్తున్నారు. కాకపోతే ప్రస్తుతం ధరించే దుస్తుల విషయంలో వైవిధ్యాన్ని ప్రదర్శిస్తారు. దీనిపై ప్రతిపక్షాలు, ఒక సెక్షన్ మీడియా రకరకాల వివాదాలు సృష్టించినప్పటికీ మోడీ పట్టించుకోరు. పైగా వివిధ వేడుకల సమయంలో, ముఖ్యంగా దేవి నవరాత్రుల సందర్భంగా మోడీ ప్రత్యేకమైన దుస్తులు ధరిస్తారు. మోడీ ధరించే దుస్తుల కోసం ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందంటే అతిశయోక్తి కాదు. అయితే మోడీ సంప్రదాయ గుజరాతి దుస్తులను ధరిస్తారు. చేనేత కార్మికులకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఆయన నూలు దుస్తులు మాత్రమే ధరిస్తారు. అలాంటి సంప్రదాయ దుస్తులను మాత్రమే ధరించే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నోటివెంట ఒక్కసారిగా ” మినీ స్కర్ట్” అనే వ్యాఖ్యలు వచ్చాయి. దీంతో ఒక్కసారిగా సభికులందరూ ఆశ్చర్యానికి గురయ్యారు.

    ఇంతకీ ఏం జరిగిందంటే

    న్యూఢిల్లీలో శుక్రవారం నేషనల్ క్రియేటర్స్ అవార్డుల ప్రధానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫ్యాషన్ రంగానికి భారత్ ఎప్పటినుంచో ఆవిష్కర్తగా ఉందన్నారు. ఆధునికతకు, ప్రాచీన కళాత్మకత కు భారత్ అనుసంధాన కర్తగా ఉందని పేర్కొన్నారు. అందుకే మన దేశం నుంచి ఎంతమంది ఫ్యాషన్ నిపుణులు ప్రపంచ యవనికపై ప్రతిభ చూపుతున్నారని కొనియాడారు. అనంతరం నేషనల్ క్రియేటర్స్ అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విజేతలతో మాట్లాడారు. ఫ్యాషన్ రంగంలో వారు సాధించిన ఘనతల గురించి తెలుసుకున్నారు.

    ఆసక్తికర వ్యాఖ్యలు

    నేషనల్ క్రియేటర్స్ అవార్డుల ప్రధానోత్సవం తర్వాత నరేంద్ర మోడీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ” శతాబ్దాల క్రితమే పలు ఆలయాల్లో భారతీయ కళాకారులు శిల్పాలను చెక్కారు. ఆ శిల్పాలను జాగ్రత్తగా పరిశీలిస్తే అందులో ఆధునికత స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతం ప్రపంచంలో ఆధునిక వస్త్రధారణ కొనసాగుతోంది. మినీ స్కర్ట్ లను(mini skirts) యువత ధరించేందుకు ఇష్టపడుతోంది. ఒకసారి మీరంతా కోణార్క్ ఆలయానికి వెళ్తే.. అక్కడ మినీ స్కర్ట్ లు వేసుకున్న విగ్రహాలను చూడొచ్చు. భుజం పైన హ్యాండ్ బ్యాగులు వేసుకున్న శిల్పాలను పరిశీలించొచ్చు. ప్రస్తుతం యువత వస్త్రధారణను నాటి కళాకారులు ముందే ఊహించి ఆనాడు చెక్కారు. అంటే వందల ఏళ్ల కాలాన్ని వారు ముందే ఊహించారని” ప్రధాని వ్యాఖ్యానించారు. కాగా, ఫ్యాషన్ విభాగంలో జాన్విసింగ్ అనే యువతి విజేతగా నిలిచారు. ఆమెకు ప్రధాని కంటెంట్ క్రియేటర్ పురస్కారం అందించారు. ఈ సందర్భంగా ఆమెతో ప్రధాని ముచ్చటించారు. వారిద్దరి మధ్య సంభాషణ లోనే ప్రధాని మినీ స్కర్ట్ వ్యాఖ్యలు చేశారు.