https://oktelugu.com/

Jan Nicol : 36 బంతుల్లో 101 పరుగులా.. ఇదేం ఊచకోత స్వామి

నేపాల్ బౌలర్లను ఒక ఆట ఆడుకున్నాడు. 36 బంతుల్లో 11 ఫోర్లు, 8 సిక్స్ ల సహాయంతో 101 రన్స్ చేసి నమిబియా జట్టు స్కోరును 206 వద్ద సెట్ చేశాడు.

Written By:
  • NARESH
  • , Updated On : February 27, 2024 / 09:54 PM IST
    Follow us on

    Jan Nicol : నేపాల్ వేదికగా నేపాల్, నమిబియా, ఐర్లాండ్ జట్లతో టి20 ట్రై సిరీస్ జరుగుతోంది. సిరీస్ లో భాగంగా మంగళవారం నేపాల్, నమీబియా జట్ల మధ్య జరిగిన తొలి t20 మ్యాచ్ లో నమిబియా 20 పరుగుల తేడాతో నేపాల్ జట్టును ఓడించింది. క్రితి పూర్ లోని త్రిభువన్ దాస్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన నమీబియా జట్టు 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 206 చేసింది. నమీబియా జట్టు ఆటగాడు లోఫ్టీ 36 బంతుల్లో మెరుపు సెంచరీ చేయడంతో నమిబియా అంత స్కోరు సాధించింది. నేపాల్ జట్టులో కెప్టెన్ రోహిత్ పౌడెల్ రెండు వికెట్లు తీశాడు. కరణ్ కేసీ, అభినాష్ బోహారా చెరో వికెట్ తీశారు.

    ఆ తర్వాత 207 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన నేపాల్ జట్టు 186 పరుగులకు ఆల్ అవుట్ అయింది. దీపేంద్ర సింగ్ (48), రోహిత్ పౌడెల్(42), కుషాల్ మళ్ళా(32), సోమ్ పాల్ కామి(28), మినహా మిగతా వారెవరూ రాణించకపోవడంతో ఆతిధ్య నేపాల్ జట్టు ఓటమి చెందింది. నమీబియా జట్టులో రూబెన్ నాలుగు వికెట్లు తీసి సత్తా చాటాడు. బెర్నార్డ్, జాన్ ఫ్రై లింక్, జాన్ నికోల్ లోఫ్టీ తలా రెండు వికెట్లు తీసి నేపాల్ జట్టు పతనాన్ని శాసించారు. నేపాల్ ఇన్నింగ్స్ ప్రారంభించిన తొలి బంతికే కుశాల్ రూపంలో తొలి వికెట్ కోల్పోయింది. రూబెన్ బౌలింగ్లో అతడు ఎల్బీడబ్ల్యుగా అవుట్ అయ్యాడు. మరో ఓపెనర్ ఆసిఫ్ షేక్ కూడా త్వరగానే అవుట్ అయ్యాడు. ఈ క్రమంలో రోహిత్, కుషాల్ ఇన్నింగ్స్ నిర్మించే బాధ్యతను భుజాలకు ఎత్తుకున్నారు. జట్టు స్కోరు 77 పరుగుల వద్దకు చేరుకున్నప్పుడు రోహిత్ ఔట్ అయ్యాడు. మిగతా బ్యాటర్లు కూడా కీలక సమయాల్లో అవుట్ కావడంతో నేపాల్ జట్టు ఓడిపోవాల్సి వచ్చింది.

    62 పరుగులకు మూడు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్నప్పుడు జట్టుకు ఆపద్బాంధవుడి గా నిలిచాడు జాన్ నికోల్ లోఫ్టీ. క్రీజ్ లోకి వచ్చి రాగానే దూకుడుతో చెలరేగాడు.. నేపాల్ బౌలర్లను ఒక ఆట ఆడుకున్నాడు. 36 బంతుల్లో 11 ఫోర్లు, 8 సిక్స్ ల సహాయంతో 101 రన్స్ చేసి నమిబియా జట్టు స్కోరును 206 వద్ద సెట్ చేశాడు. చివరికి అతడు అభినాష్ బౌలింగ్లో క్యాచ్ అవుట్ అయ్యాడు. బ్యాట్ తో మాత్రమే కాకుండా బంతితో కూడా రాణించడంతో అతడికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారం లభించింది. ఈ సిరీస్ లో భాగంగా రెండవ మ్యాచ్ బుధవారం జరుగుతుంది. నేపాల్, ఐర్లాండ్ జట్లు తలపడతాయి.