Software Employee Deepti : వీడని మిస్టరీ.. సాఫ్ట్ వేర్ ఉద్యోగి దీప్తి మృతిపై ఎన్నో అనుమానాలు

ఒకటి లేదా రెండు రోజుల్లో ఈ కేసు కు సంబంధించి నిజాలు మొత్తం బయటపెడతామని పోలీసులు అంటున్నారు.

Written By: Bhaskar, Updated On : August 31, 2023 8:44 pm

Korutla-Deepti

Follow us on

Software Employee Deepti : జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని భీముని దుబ్బ ప్రాంతానికి చెందిన సాఫ్ట్ వేర్ ఉద్యోగి దీప్తి అనుమానాస్పద మృతి పై మిస్టరీ వీడడం లేదు. మీడియా, సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి దర్యాప్తు ప్రారంభించారు. పట్టణంలోని భీముని దుబ్బ ప్రాంతానికి చెందిన బంక శ్రీనివాస్ ఇటుక బట్టి వ్యాపారం నిర్వహిస్తుంటాడు. ఇతడికి ఇద్దరు కూతుర్లు ఉన్నారు. పెద్దకూతురు బంకి దీప్తి బీటెక్ పూర్తి చేసి ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. ప్రస్తుతం వర్క్ ఫ్రం హోం చేస్తోంది. చిన్న కూతురు చందన బీటెక్ పూర్తి చేసి.. ఉద్యోగ ప్రయత్నంలో ఉంది. ఈ క్రమంలో మూడు రోజుల క్రితం శ్రీనివాస్ దంపతులు హైదరాబాదులో ఒక శుభకార్యానికి వెళ్లారు. దీప్తి, చందన మాత్రమే ఇంట్లో ఉన్నారు. శ్రీనివాస్ మంగళవారం ఉదయం నుంచి కూతుర్లకు ఫోన్ చేసినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. దీప్తి ఫోన్ లిఫ్ట్ చేయలేదు. తన ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. దీంతో ఇంటి పక్క వారికి శ్రీనివాస్ ఫోన్ చేసి, తన ఇంట్లోకి వెళ్లి చూడమని కోరాడు. దీంతో వారు ఇంట్లోకి వెళ్లి చూడగా దీప్తి ముందు రూమ్ లోని సోఫాలో పడి ఉండడాన్ని గమనించారు. వారు ఈ సమాచారాన్ని శ్రీనివాస్ కు అందించారు. పనిలో పనిగా పోలీసులకు కూడా విషయం చెప్పారు.

రంగంలోకి క్లూస్ టీం

స్థానికులు చెప్పిన సమాచారం ప్రకారం పోలీసుల క్లూస్ టీం సంఘటన స్థలానికి వచ్చింది. వారు తనిఖీలు నిర్వహించారు. వంట గదిలో ఉన్న మద్యం సీసాను సీజ్ చేశారు. సోఫాలో ఆ చేతనంగా పడి ఉన్న దీప్తిని పరీక్షించగా.. ఆమె చనిపోయిందని నిర్ధారించారు. ఆమె మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మద్యం బాటిల్ పై ఉన్న లేబుల్ ఆధారంగా వైన్స్ సిసి పుటేజి పరిశీలించారు.

చందన వాయిస్ మెసేజ్ వైరల్

అయితే బుధవారం ఉదయం చందన తన ఫోన్ నుంచి తండ్రి శ్రీనివాస్ కు, తనకు తమ్ముడయ్యే వ్యక్తి సాయికి వాయిస్ మెసేజ్ పెట్టింది.”నేను, అక్క కలిసి పార్టీ చేసుకున్నాం. నేను బ్రీజర్ తాగాను. అక్క హాఫ్ బాటిల్ వోడ్కా తాగింది. ఆ మత్తులో తన బాయ్ ఫ్రెండ్ ను ఇంటికి పిలవనా అని నన్ను అడిగింది. దానికి నేను వద్దు అన్నాను. మద్యం ఎక్కువయి సోఫాలో పడుకుంది. నేను రెండుసార్లు లేపినప్పటికీ లేవలేదు. ఛాన్స్ దొరికింది కదా అని నేను ఇంట్లో నుంచి వెళ్లిపోయాను. అంతేగాని అంతేగాని నేను అక్కను ఎందుకు చంపుతాను” అంటూ ఆ ఆడియోలో చందన పేర్కొన్నది. కొద్దిసేపటికి చందన ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. దీంతో పోలీసులకు చందన మీద అనుమానం మొదలైంది. పోలీసులు తమ వద్ద ఉన్న సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఫోన్ ట్రేస్ చేశారు. ఆమె హైదరాబాదులో ఉన్నట్టు గుర్తించారు. విచారణ బృందం అక్కడి చేరుకోగా.. చందన అక్కడి నుంచి వెళ్లిపోయిందని సమాచారం. చిన్న కూతురు చందన అదృశ్యం కావడం.. శ్రీనివాస్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు.

బంగారం, డబ్బు మాయం

కాగా ఇంట్లోనే బంగారు ఆభరణాలు, నగదు పోయిందని శ్రీనివాస్ పోలీసులకు తెలిపాడు. 30 తులాల బంగారం, రెండు లక్షల నగదు పోయినట్టు సమాచారం. శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు దీప్తి మృతిని అనుమానాస్పద మరణం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. చందన ఆచూకీ కోసం వారు తీవ్రంగా గాలిస్తున్నారు. అయితే దీప్తి బాయ్ ఫ్రెండ్ ఎవరు? మద్యం తాగే అలవాటు దీప్తికి ఎప్పటి నుంచి మొదలైంది? ఈ కేసులో బాయ్ ఫ్రెండ్ ప్రమేయం ఏమైనా ఉందా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ చందన వ్యవహరిస్తున్న తీరు పోలీసులకు అనుమానాస్పదంగా కనిపిస్తోంది. అయితే ఒకటి లేదా రెండు రోజుల్లో ఈ కేసు కు సంబంధించి నిజాలు మొత్తం బయటపెడతామని పోలీసులు అంటున్నారు.