Skill Development scam case : చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో కీలక పరిణామం. చంద్రబాబు దాఖలు చేసుకున్న క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు వెల్లడించే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో చంద్రబాబు అరెస్టు అయ్యారు. ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా 52 రోజులు పాటు ఉండిపోయారు. అటు తర్వాత చంద్రబాబుపై చాలావరకు కేసులు నమోదు చేస్తూ సిఐడి పట్టు బిగించింది. అయితే తన కేసుల విషయంలో కనీస నిబంధనలు పాటించలేదని చెబుతూ చంద్రబాబు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ప్రత్యేక లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. కేసులన్నింటినీ క్వాష్ చేయాలని పిటిషన్ లో పేర్కొన్నారు. దీనిపై ఇరు వర్గాల వాదనలను అత్యున్నత న్యాయస్థానం వినింది. ఇంతలో చంద్రబాబుకు బెయిల్ లభించింది. క్వాష్ పిటిషన్ పై విచారణ పూర్తయినా.. ఇంతవరకు తీర్పు వెల్లడించలేదు.
చంద్రబాబు దాఖలు చేసుకున్న పిటిషన్ పై సుదీర్ఘ వాదనలు కొనసాగాయి. గత ఏడాది అక్టోబర్ 20న ఇరువర్గాల వాదనలను విన్న సుప్రీంకోర్టు 17a, క్వాష్ పిటిషన్ పై తుది తీర్పును మాత్రం వాయిదా వేసింది. దాదాపు మూడు నెలల పాటు అదిగో ఇదిగో అంటూ కాలయాపన జరిగింది. అయితే కేసుకు సంబంధించి తుది తీర్పు రేపు వెల్లడించే అవకాశాలు ఉన్నాయని న్యాయ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఎన్నికల ముంగిట ఎటువంటి తీర్పు వస్తుందోనని దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. గవర్నర్ అనుమతి తీసుకోకుండానే తనను అరెస్టు చేశారని.. రాజకీయ కక్షతోనే ఈ విధంగా వ్యవహరించారని చంద్రబాబు పిటిషన్ దాఖలు చేసుకున్నారు. దీంతో జాతీయస్థాయిలో రాజకీయ కక్ష బాధితులు, అటు ప్రభుత్వాధినేతలు ఈ కేసు తీర్పు కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు.
అయితే ఏపీ సిఐడి సైతం ఈ కేసు విషయంలో బలమైన వాదనలు వినిపించింది. చంద్రబాబుకు 17 ఏ సెక్షన్ వర్తించదని బలంగా చెప్పుకొచ్చింది. ఇరు వర్గాల తరఫున పేరు మోసిన న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. గత ఏడాది అక్టోబర్ 20న వాదనలు పూర్తయ్యాయి. న్యాయమూర్తులు తీర్పును రిజర్వ్ చేశారు. ఇప్పుడు తీర్పు వెల్లడించేందుకు నిర్ణయించినట్లు తెలుస్తోంది. జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం తుది తీర్పును వెల్లడించనుంది. మరో రెండు నెలల్లో ఏపీలో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఈ కేసులో ఎటువంటి తీర్పు వస్తుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.