Mohammed Shami: ఐసీసీ వన్డే వరల్డ్ కప్‌లో నిప్పులు చెరిగే బంతులతో ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లకు ముచ్చెమటలు పట్టించి.. వికెట్లు పడగొట్టి భారత క్రికెట్ అభిమానుల మనసు దోచుకున్నాడు టీమిండియా సీమ్ బౌలర్ మహ్మద్ షమీ. పలు మ్యాచ్‌లలో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. అద్భుతమైన ఆటతీరుతో క్రికెట్ అభిమానుల మనసు దోచుకున్న షమీ.. మరోమారు తన మంచి మనసు చాటుకున్నాడు. రోడ్డు ప్రమాదానికి గురైన ఓ వ్యక్తిని కాపాడాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
నైనిటాల్ సమీపంలో రోడ్డు ప్రమాదం..
శనివారం రాత్రి నైనిటాల్ రోడ్డు మార్గంలో ఓ కారు అదుపు తప్పి పక్కనే ఉన్న పొదల్లోకి దూసుకుపోయింది. ఆ వెనుకే కారులో వస్తున్న షమీతోపాటు వాహనదారులు వెంటనే స్పందించి బాధితుడిని రక్షించి ఆసుపత్రికి తరలించారు. కారు ప్రమాదానికి సంబంధించిన వీడియోను మహ్మద్ షమీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. ‘‘అతడు అదష్టవంతుడు. దేవుడు అతడికి మళ్లీ జీవితం ఇచ్చాడు. నైనిటాల్లో అతడి కారు ఘాట్ రోడ్ నుంచి పక్కకు దూసుకుపోయింది. నా కారుకు కాస్త ముందుగానే ఈ సంఘటన చోటు చేసుకుంది. వెంటనే అక్కడున్న వారితో కలిసి సురక్షితంగా అతడిని బయటకు తీసుకొచ్చాం. అతడి పరిస్థితి బాగానే ఉంది’’ అని ఆ వీడియోకు క్యాప్షన్ ఇచ్చాడు.
ట్రావెలింగ్ చాలా ఇష్టమట..
క్రికెటర్లలో ఒక్కొక్కరికి ఒక్కో ఇష్టం ఉంటుంది. కింగ్ కోహ్లీ వాచ్‌లను సేకరిస్తుంటారు. కొత్తగా వచ్చిన ప్రతీ వాచ్ కొనుగోలు చేస్తాడు. మిస్టర్ కూల్ ధోనీకి బైక్‌లు, వాహనాలు అంటే ఇష్టం. బైక్‌రైడింగ్ చేయడంపై ఆసక్తి చూపుతారు. అందుకే కొత్త వాహనాలు కొనుగోలు చేస్తాడు. ఇక, భారత్ సీనియర్ ఆటగాడు, ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీకి ట్రావెలింగ్ ఇష్టమట. ఈ విషయాన్ని ఆయనే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ‘ప్రయాణించడం ఇష్టపడతా. అలాగే ఫిషింగ్ చేయడం నచ్చుతుంది. దూరప్రాంతాలకు డ్రైవింగ్ కూడా ఇష్టమే. కార్లు, బైకులు నడపుతా. కానీ, భారత్ తరఫున ఆడే సమయంలో బైక్ రైడింగ్ ఆపేశా. అలాంటి సమయంలో గాయపడితే? చాలా ఇబ్బంది ఎదురవుతుంది. హైవేలపైనా, గ్రామాల్లోనూ బైకులపై విపరీతంగా తిరిగేవాడిని. బైకులు, కార్లే కాకుండా ట్రాక్టర్, బస్, ట్రక్కులను కూడా నడిపేవాడిని. నా స్నేహితుడికి ట్రక్ ఉండేది. చిన్న వయసులోనే దానిని ఓ మైదానంలో నడిపేవాళ్లం. ఒకసారి మా ట్రాక్టర్తో చెరువులోకి దూసుకెళ్లా. అప్పుడు మా నాన్న చీవాట్లు పెట్టేశారు’ అని షమీ గుర్తు చేసుకున్నాడు.