Miss world 2024 : రెండూ అందాల పోటీలే.. మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ కు ఇదీ తేడా

ఇక ప్రతి దేశంలో జరిగే పోటీలకు ఎంట్రీలను ఆహ్వానిస్తూ ప్రకటన జారీ చేస్తారు.. దీనికంటే ముందు ప్రతి రాష్ట్రంలోనూ అందగత్తెలను ఎంపిక చేసి.. అలా విజేతగా నిలిచిన వారిని మిస్ ఇండియా పోటీలకు పంపిస్తారు. ఇక స్థానిక రాష్ట్రాల్లో జరిగే పోటీలకు ముందుగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

Written By: NARESH, Updated On : March 9, 2024 10:01 pm
Follow us on

Miss world 2024: ఈ విశాలమైన ప్రపంచంలో అందాల పోటీలంటే ముందుగా మనకు గుర్తుకొచ్చేది మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్. వీటి తర్వాతే ఫెమినా.. ఇతర పోటీలు. అందుకే ఈ పోటీల్లో పాల్గొనేందుకు.. కిరీటం దక్కించుకునేందుకు చాలామంది అందమైన యువతులు పోటీ పడుతుంటారు.. ప్రస్తుతం 71వ మిస్ వరల్డ్ పోటీలు భారత్ వేదికగా జరుగుతున్నాయి. ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో ఫిబ్రవరి 18 నుంచి ఇక్కడ పోటీలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఆ వేదికగా శనివారం ఫైనల్ పోటీలు జరుగుతున్నాయి. మరికొద్ది క్షణాల్లో విజేత ఎవరో తెలుస్తుంది.

ఇంతకీ ఏంటి తేడా

మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ రెండు కూడా అందమైన యువతులతో నిర్వహించే పోటీలే. ఈ పోటీల్లో గెలిచిన వారే కిరీటాలు దక్కించుకుంటారు. అయితే ఈ రెండు పోటీలను వేరువేరుగా నిర్వహిస్తుంటారు. అయితే చాలామంది ఈ పోటీల ద్వారా కేవలం అందగత్తెలను మాత్రమే ఎంపిక చేస్తారనుకుంటారు.. కానీ అందంతో పాటు తెలివైన వారినే నిర్వాహకులు విజేతలుగా ప్రకటిస్తారు. మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ పోటీలను ప్రైవేటు సంస్థలే నిర్వహిస్తాయి. ఎరిక్ మోర్లే అనే బ్రిటన్ వ్యక్తి మిస్ వరల్డ్ పోటీలను మొట్టమొదటిగా ప్రారంభించాడు. అతడు ఒక బ్రిటిష్ టీవీలో యాంకర్ గా పనిచేసేవాడు.. అందాన్ని, అందంగా ఉన్న అమ్మాయిలను అమితంగా ఆరాధించే అతడు 1951లో మిస్ వరల్డ్ పోటీలకు శ్రీకారం చుట్టాడు. ఆ పోటీలను మిస్ వరల్డ్ లిమిటెడ్ అనే సంస్థ ద్వారా నిర్వహించేవాడు. మోర్లే మరణించిన తర్వాత అతడి భార్య జూలియా మోర్లే ఆ బాధ్యత తీసుకున్నారు. ప్రతి సంవత్సరం ఈ మిస్ వరల్డ్ పోటీలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం 71వ మిస్ వరల్డ్ పోటీలను ఇండియాలో నిర్వహిస్తున్నారు. ఈ మిస్ వరల్డ్ కిరీటం కోసం 112 దేశాల నుంచి అందమైన అమ్మాయిలు పోటీ పడుతున్నారు.

మిస్ యూనివర్స్

ఈ పోటీలను అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన ఓ వ్యాపారి ప్రారంభించాడు. అతడు పసిఫిక్ మిల్స్ అనే వస్త్రాల కంపెనీ నిర్వహించేవాడు. అతడు తన కంపెనీ ద్వారానే మిస్ యూనివర్స్ పోటీలను మొదలుపెట్టాడు. ఈ పోటీల కోసం మిస్ యూనివర్స్ అనే సంస్థను ప్రారంభించాడు. బ్రిటన్ లో మిస్ వరల్డ్ పోటీలు ప్రారంభమైన తర్వాత వాటి ద్వారా ప్రభావితమై మిస్ యూనివర్స్ పోటీలను 1952 లో ప్రారంభించాడు. అయితే మిస్ వరల్డ్, యూనివర్స్ పోటీలు దాదాపు ఒకే విధంగా ఉంటాయి. వివిధ దేశాలకు చెందిన అందమైన యువతులను ఒకే వేదిక వద్దకు తీసుకువచ్చి.. అందులో అందమైన, తెలివైన యువతిని న్యాయ నిర్ణేతలు ఎంపిక చేసి వజ్రాలు పొదిగిన కిరీటాన్ని తొడుగుతారు. క్రితం సారి పోటీలో విజేత.. ఈసారి విజేతకు ఈ కిరీటాన్ని తలపైన బహూకరిస్తుంది.

ఫ్రాంచైజీ కొనుగోలు చేస్తారు

మిస్ యూనివర్స్, మిస్ వరల్డ్ పోటీలలో.. ప్రతి దేశంలోనూ ఒక సంస్థ స్థానిక ఫ్రాంచైజీ కొనుగోలు చేస్తుంది. మిస్ వరల్డ్ పోటీలకు పంపేందుకు కూడా స్థానికంగా ఒక ఫ్రాంచైజీ ఉంటుంది. ఫెమీనా కూడా అలాంటి సంస్థనే. ఇలా ఫ్రాంచైజీ దక్కించుకున్న సంస్థలు దేశవ్యాప్తంగా అందాల పోటీలను నిర్వహిస్తాయి. ఆ పోటీల్లో గెలిచిన వారిని అంతర్జాతీయంగా జరిగే మిస్ యూనివర్స్, మిస్ వరల్డ్ పోటీలకు ఎంపిక చేసి, పంపిస్తాయి. మిస్ ఫెమినా గా పోటీల్లో విజేత గా నిలిచిన యువతి మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొంటుంది.

ఎంట్రీలను ఆహ్వానిస్తూ..

ఇక ప్రతి దేశంలో జరిగే పోటీలకు ఎంట్రీలను ఆహ్వానిస్తూ ప్రకటన జారీ చేస్తారు.. దీనికంటే ముందు ప్రతి రాష్ట్రంలోనూ అందగత్తెలను ఎంపిక చేసి.. అలా విజేతగా నిలిచిన వారిని మిస్ ఇండియా పోటీలకు పంపిస్తారు. ఇక స్థానిక రాష్ట్రాల్లో జరిగే పోటీలకు ముందుగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.