Miss World 2024 : మరికొద్ది గంటల్లో ప్రపంచ సుందరి ఎవరో తేలనుంది. ముంబై వేదికగా 71వ మిస్ వరల్డ్ పోటీలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ పోటీల్లో అనేక దేశాలకు చెందిన అందమైన యువతులు పాల్గొంటున్నారు. 1996 తర్వాత అంటే దాదాపు 28 ఏళ్ల అనంతరం భారతదేశం మిస్ వరల్డ్ పోటీలకు ఆతిథ్యం ఇస్తోంది. గత నెల ఫిబ్రవరి 18 నుంచి ఈ పోటీలు ప్రారంభమయ్యాయి. గ్రాండ్ ఫినాలే మార్చి 9 అంటే శనివారం రాత్రి భారత కాలమాన ప్రకారం సాయంత్రం ఏడు గంటల 30 నిమిషాలకు జరుగుతుంది. విజేత ఎవరో ప్రకటించిన తర్వాత కార్యక్రమాలు మొత్తం ముగుస్తాయి.
112 దేశాల నుంచి
మిస్ వరల్డ్ కిరీటం కోసం దాదాపు 112 దేశాల నుంచి అందమైన యువతులు పోటీ పడుతున్నారు. మన దేశం నుంచి కర్ణాటక రాష్ట్రానికి చెందిన సినీ శెట్టి మిస్ వరల్డ్ పోటీలో ఉంది. ప్రస్తుతం ఆమె టాప్ 20 జాబితాలో స్థానం దక్కించుకుంది. 2017లో జరిగిన పోటీల్లో మీ వరల్డ్ కిరీటాన్ని మానుషీ చిల్లర్ దక్కించుకుంది. అప్పటినుంచి ఇప్పటిదాకా మన దేశానికి మిస్ వరల్డ్ దక్కలేదు. ఈసారి సినీ శెట్టి టాప్ 20 జాబితాలో ఉన్న నేపథ్యంలో ఎలాగైనా మిస్ వరల్డ్ కిరీటం దక్కించుకుంటుందని అందరూ భావిస్తున్నారు. మిస్ వరల్డ్ కిరీటాన్ని ఇప్పటివరకు మన దేశం ఆరుసార్లు గెలిచింది. తొలిసారి 1966లో రీటా ఫారియా దక్కించుకున్నారు. ఆ తర్వాత ఐశ్వర్యరాయ్, డయానా హిడెన్, యుక్తాము ఖి, ప్రియాంక చోప్రా, మానుషి చిల్లర్ ప్రపంచ సుందరీమణులుగా కిరిటాలు గెలుచుకున్నారు.
జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో..
ప్రస్తుతం 71వ మిస్ వరల్డ్ పోటీలు ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో జరుగుతున్నాయి. గత నెల ఫిబ్రవరి 18 నుంచి ఇక్కడ వేడుకలు ప్రారంభమయ్యాయి. భారతీయ కాలమానం ప్రకారం రాత్రి 7 గంటల 30 నిమిషాలకు వేడుక మొదలవుతుంది.. దీనిని ప్రత్యక్ష ప్రసారం చూడాలంటే మిస్ వరల్డ్ వెబ్లోకి వెళ్లి చూడవచ్చు. లేదా SONY LIV చానల్లో వీక్షించవచ్చు.
మనవాళ్లే
ఇక ఈ వేడుకకు బాలీవుడ్ దర్శకుడు, నిర్మాత కరణ్ జోహార్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ఈయనతోపాటు ఫిలిపిన్స్ కు చెందిన మేగాన్ యంగ్ కూడా వేదికను పంచుకోబోతున్నారు. యంగ్ 2013లో మిస్ వరల్డ్ కిరీటం గెలుచుకుంది.. ఇక ఈ వేడుకకు న్యాయ నిర్ణేతలుగా మన దేశానికి చెందిన కొంతమంది సెలబ్రిటీలు వ్యవహరిస్తున్నారు. దీనికోసం 12 మందితో కూడిన ప్యానెల్ ను మిస్ వరల్డ్ నిర్వాహ కమిటీ ఏర్పాటు చేసింది. హిందీ చిత్రాల నిర్మాత సాజిద్ నదియాడ్ వాలా, మాజీ క్రికెటర్ హార్భజన్ సింగ్, బాలీవుడ్ నటి అమృత ఫడ్నవిస్, హీరోయిన్లు కృతి సనన్, పూజా హెగ్డే, మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ చైర్మన్ జూలియా వంటి వారు న్యాయనిర్ణేతల ప్యానల్ లో ఉన్నారు. మనదేశంలో వేడుక జరుగుతున్న నేపథ్యంలో ఎక్కువమంది జడ్జిలు ఇక్కడి వారే ఉండటం విశేషం. అయితే పోటీలను పారదర్శకంగా నిర్వహిస్తామని మిస్ వరల్డ్ ప్యానల్ కమిటీ ప్రకటించింది. స్వదేశంలో జరుగుతున్న మాత్రాన పక్షపాతానికి తాగు లేదని వివరించింది.