https://oktelugu.com/

Minister Roja : మంత్రి రోజాకి షాక్?

నగరి నియోజకవర్గంలో రోజాకు సొంత పార్టీ నాయకులు వ్యతిరేక స్వరం వినిపిస్తున్న నేపథ్యంలో ఆమెకు జగన్ టికెట్ ఇస్తారా? ఇస్తే ఏం చేయాలి? అనే కోణంలో కేజే కుమార్ వర్గీయులు కొద్దిరోజులుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రోజాకు టికెట్ ఇవ్వద్దని అధిష్టానాన్ని కోరుతున్నారు.

Written By:
  • NARESH
  • , Updated On : March 5, 2024 / 10:14 PM IST

    Minister Roja

    Follow us on

    Minister Roja : మంత్రి రోజాకు ఈసారి టికెట్ దక్కడం కష్టమేనా? ఆమె సొంత నియోజకవర్గం నగరిలో ఎదురు గాలి వీస్తోందా? వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మదిలో కూడా ఇదే ఆలోచన ఉందా? ఈ ప్రశ్నలకు అవును అనే అంటున్నాయి వైసిపి వర్గాలు. ఇప్పటికే ఆ నియోజకవర్గంలో వైసిపి రెండుగా చీలిపోయింది. మున్సిపల్ మాజీ చైర్మన్ కేజే కుమార్ వైసీపీలో ఒక వర్గానికి నాయకత్వం వహిస్తున్నారు. నగరిలోని ఐదు మండలాల నేతలు ఆమెకు టికెట్ ఇవ్వద్దని ఒక తీర్మానం చేసి వైసిపి అధిష్టానానికి అందజేశారు. తమ మాట కాదని టికెట్ ఇస్తే ఓడిస్తామని హెచ్చరించారు. పార్టీ కోసం పనిచేసిన వారిని రోజా పట్టించుకోవడంలేదని.. అందువల్లే వ్యతిరేకంగా పనిచేయాల్సి వస్తోందని వైసిపి నాయకులు అంటున్నారు. ఈ పరిణామంతో నగరి నియోజకవర్గంలో ఒక్కసారిగా పరిణామాలు మారిపోయాయి.

    వాస్తవానికి నగరి నియోజకవర్గంలో కొంతకాలంగా రోజా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.. రోజా సోదరులు, ఆమె భర్త నియోజవర్గంలో పెత్తనం చెలాయిస్తున్నారని.. అక్రమాలకు పాల్పడుతున్నారని సొంత పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఇదే విషయాన్ని గతంలో వైవి సుబ్బారెడ్డి ఎదుట విన్నవించారు.. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా ఫిర్యాదులు చేశారు. అయినప్పటికీ అధిష్టానం ఆమెపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. పైగా రోజా వారిని ఉద్దేశించి పలు కీలక వ్యాఖ్యలు చేయడంతో వైసిపి రెండు వర్గాలుగా విడిపోయింది. ఇటీవల నగరి పురపాలక కార్యాలయంలో జరిగిన సమావేశంలో మెజారిటీ కౌన్సిలర్లు రోజాకు వ్యతిరేకంగా నినాదాలు చేయడం అక్కడి పరిస్థితిని తేటతెల్లం చేసింది. ఈ నేపథ్యంలో రోజాకు ఈసారి టిక్కెట్టు ఇవ్వడం కష్టమేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు తనకే టికెట్ వస్తుందని రోజా ధీమా వ్యక్తం చేస్తున్నారు.

    కేవలం నగరి మాత్రమే కాకుండా ఈసారి ఎన్నికల్లో పలు నియోజకవర్గాల్లో రసవత్తరమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. సర్వే, ప్రజా బలం, ఇతర విషయాల ఆధారంగా జగన్మోహన్ రెడ్డి అభ్యర్థులకు టికెట్లు కేటాయిస్తున్నారు. ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్న సిట్టింగ్ ఎమ్మెల్యేలను నిర్మొహమాటంగా తొలగిస్తున్నారు. అలా టికెట్ ఇవ్వని వారికి కేంద్ర కార్యాలయానికి తెప్పించుకొని అసలు విషయం చెప్పేస్తున్నారు. ఇలా చాలామంది వైసిపి నుంచి వెళ్లిపోయారు. ఇక ఉన్నవారి విషయంలో కూడా జగన్ అనేక మార్పులు, చేర్పులు చేశారు. వైసీపీలో జగన్మోహన్ రెడ్డి సుప్రీం కాబట్టి ఆయన మాటకు ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎదురు చెప్పడం లేదు. ఫలితంగా ఆయన చెప్పిన చోట పోటీ చేస్తున్నారు.

    నగరి నియోజకవర్గంలో రోజాకు సొంత పార్టీ నాయకులు వ్యతిరేక స్వరం వినిపిస్తున్న నేపథ్యంలో ఆమెకు జగన్ టికెట్ ఇస్తారా? ఇస్తే ఏం చేయాలి? అనే కోణంలో కేజే కుమార్ వర్గీయులు కొద్దిరోజులుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రోజాకు టికెట్ ఇవ్వద్దని అధిష్టానాన్ని కోరుతున్నారు. ఒకవేళ రోజాకు టికెట్ ఇస్తే కేజే కుమార్ ను వైసిపి రెబల్ అభ్యర్థిగా బరిలోకి దింపాలని యోచిస్తున్నారు. ఇటీవల ఓ ప్రైవేట్ న్యూస్ ఛానల్ నిర్వహించిన ముఖాముఖిలో రోజా మాట్లాడారు. నగరి టికెట్ తనకే ఇస్తారని ప్రకటించారు. ఆమె ప్రకటించిన కొద్ది రోజులకే కేజే కుమార్ వర్గీయులు వ్యతిరేకంగా సమావేశం నిర్వహించడం విశేషం.