Thatikonda Rajaiah- Muthireddy Yadagiri: “చదరంగంలో సిపాయిల్ని, గుర్రాల్ని, ఏనుగులను, మంత్రులను దాటి రాజును కొట్టేస్తే ఆట ముగుస్తుంది. అదే మళ్లీ సిపాయిల్ని జోడిస్తే ఆట మళ్లీ మొదలవుతుంది. ఇక్కడ కిరీటాలు మాత్రమే శాశ్వతం.. తలలు కాదు..” కేజిఎఫ్_2 లో ఓ డైలాగ్ ఇది. అచ్చం ఈ డైలాగు లాగానే కెసిఆర్ కూడా తెలంగాణలో మరీ ముఖ్యంగా తన పార్టీలో కొత్త కొత్త ఎత్తులు వేస్తున్నారు. కొత్త కొత్త వ్యక్తులను పరిచయం చేస్తున్నారు. పాతవారి నుంచి నిరసన ఎదురు కాకుండా.. కొత్తవారికి ఎదురే లేకుండా చూసుకుంటున్నారు.
జనగామ టికెట్ ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ని కాకుండా పల్లా రాజేశ్వర్ రెడ్డిని అంతర్గతంగా ఎంపిక చేసినప్పుడు ఆ నియోజకవర్గంలో అగ్గిరాజుకుంది. ముత్తిరెడ్డి తన ఆవేశాన్ని వెలిబుచ్చారు. భారత రాష్ట్ర సమితి అధిష్టానం పై ఎటువంటి మాట మాట్లాడకపోగా.. రాజేశ్వర్ రెడ్డిని విమర్శించారు. ఆమధ్య వరుసగా నమస్తే తెలంగాణకు జాకెట్ యాడ్స్ ఇచ్చారు. కేటీఆర్ అమెరికా నుంచి రాగానే తన గోడు వెళ్ళబోసుకున్నారు. ఫలితంగా రాజేశ్వర్ రెడ్డిని జనగామ వెళ్ళకుండా కేటీఆర్ తాత్కాలికంగా నిరోధించగలిగారు. ఆ తర్వాత పరిణామాలు వేగంగా మారిపోయాయి. ముత్తిరెడ్డి ఆగ్రహం ఒక్కసారిగా చల్లారిపోయింది. రాజేశ్వర్ రెడ్డి మొహంలో నవ్వు వెల్లివిరిసింది. ఇంతకీ అక్కడ జరిగింది ఏంటంటే భూ కబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్న ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కి ఆర్టీసీ చైర్మన్ పదవి కట్టబెట్టారు. రాజేశ్వర్ రెడ్డి కి లైన్ క్లియర్ చేశారు.. ఫలితంగా ఇప్పుడు యాదగిరి రెడ్డి రాజేశ్వర్ రెడ్డికి మద్దతు పలకడం అనివార్యం అయిపోయింది. అలాంటి పరిస్థితులను కేసీఆర్ సృష్టించారు.
ఇక స్టేషన్ ఘన్ పూర్ టికెట్ కడియం శ్రీహరికి కేటాయించడంతో అక్కడి ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఆగ్రహంగా ఉన్నారు. అధిష్టానంపై ఎటువంటి నిరసన వ్యక్తం చేయకపోయినప్పటికీ.. కడియం శ్రీహరి పై విమర్శలు గుప్పించారు. నిరసన కూడా వ్యక్తం చేశారు. అయితే ఆయనకు టికెట్ ఇస్తామని బహుజన సమాజ్ వాది పార్టీ ఆఫర్ చేసింది. దాని తెలంగాణ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజయ్యను పరామర్శించి, ఓదార్చారు. కాంగ్రెస్ నాయకుడు దామోదర రాజనర్సింహను రాజయ్య కాల్చారు. టికెట్ పై హామీ ఇచ్చినట్టు కూడా వార్తలు వచ్చాయి. అయితే ఈ పరిణామాలతో మేల్కొన కేసీఆర్ రాజయ్యను దగ్గరికి తీసుకున్నారు. కేటీఆర్ ను రంగంలోకి దింపి ఆయనకు రాష్ట్ర రైతు సమన్వయ సమితి చైర్మన్ పదవి అప్పగించారు. దీంతో కడియం శ్రీహరికి తాటికొండ రాజయ్య మద్దతు పలికాల్సిన అవసరం ఏర్పడింది.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారత రాష్ట్ర సమితి అభ్యర్థులకు ఎదురుగాలి వీస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. జనగామ, స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గాలలో చెలరేగిన అసమ్మతి.. రాష్ట్రాన్ని మొత్తం చుట్టేయకముందే జాగ్రత్త పడ్డారు. అయితే ఈ నిరసనగలం వినిపిస్తున్న నేతలకు మరకలు ఉన్న నేపథ్యంలోనే టికెట్లు ఇవ్వలేదని కెసిఆర్ గుర్తు చేసినట్టు తెలుస్తోంది. పైగా కేబినెట్ హోదా కలిగిన పదవులు ఇవ్వడంతో ఒక్కసారిగా అసమ్మతిని తగ్గించినట్లు తెలుస్తోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాపై కాంగ్రెస్ పార్టీ గంపెడు ఆశలు పెట్టుకున్న నేపథ్యంలో.. ఈ జిల్లాలో ఎట్టి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వకూడదని కెసిఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. రాజయ్యకు స్టేషన్ ఘన్ పూర్ టికెట్ ఇస్తామని ఒక దశలో కాంగ్రెస్ పార్టీ భావించింది. దీనిని ఉదాహరణగా చూపి భారత రాష్ట్ర సమితి మీద ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయించుకుంది. అయితే ఈ విషయాన్ని పసిగట్టిన కేసీఆర్ ముందుగానే రాజయ్యను తన లైన్ లోకి ఇస్తున్నారు.. ఆయనకు కేబినెట్ హోదా కలిగిన పదవి ఇవ్వడంతో సైలెంట్ అయిపోయారు. ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కూడా మొదట్లో ఒకింత ఆగ్రహం వ్యక్తం చేసినప్పటికీ.. ఆయనకు కూడా ప్రాధాన్యం ఉన్న పదవి ఇవ్వడంతో మెత్తబడ్డారు.