KTR Audio Leak : కేటీఆర్‌ ఆడియో లీక్‌.. నెట్టింట వైరల్‌.. ఇంతకీ ఏం జరిగిందంటే?

కేటీఆర్‌ నుంచి ఫోన్‌ రావడంతో ఎమ్మెల్యే జైపాల్‌ యాదవ్‌ ఒక్కసారిగా కంగారుపడ్డారు. ఆ హడావుడిలో ఫోన్‌ స్పీకర్‌ ఆన్‌ చేశారు. దానిని మైక్‌ వద్ద ఉంచారు.

Written By: Bhaskar, Updated On : August 19, 2023 9:00 pm
Follow us on

KTR Audio Leak : ఇదసలే టెక్నాలజీ కాలం. మాట్లాడే మాట, పెట్టే పోస్ట్‌, టైప్‌ చేసే కామెంట్‌, చేసే షేర్‌ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా అంతే సంగతులు. సామాన్యుడి నుంచి ప్రజాప్రతినిధుల వరకు ఇదే వర్తిస్తుంది. కాదూ కూడదు అనుకుంటే జనంలో అభాసుపాలవ్వక తప్పదు. తాజాగా జరిగిన ఓ సంఘటన ముఖ్యమైన మంత్రి కేటీఆర్‌కు కూడా ఇలాంటి అనుభవాన్నే మిగిల్చింది. ఇంతకీ ఏం జరిగిందంటే…

త్వరలో తెలంగాణలో ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల కాబోతోంది. జనవరిలో ఎన్నికలు జరుగుతాయి అంటున్నారు. అయితే ఈసారి ప్రజల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతున్న నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ పెద్దలు నష్ట నివారణ చర్యలు ప్రారంభించారు. ప్రజల విశ్వాసం కోల్పోయిన ఎమ్మెల్యేలను పక్కన పెట్టాలని నిర్ణయించారు. సుమారు 25 మందికి ఈసారి టిక్కెట్లు ఇవ్వరని బీఆర్‌ఎస్‌ నేతలు అంటున్నారు. ఇదే సందర్భంలో వీక్‌ గా ఉన్న నియోజకవర్గాల్లో ప్రతిపక్షాల్లో బలంగా ఉన్న నాయకుడికి గులాబీ కండువా క ప్పాలని ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఈ నిర్ణయం తీసుకు న్న మంత్రి కేటీఆర్‌.. ఓ ఎమ్మెల్యే నిర్వాకంతో అడ్డంగా దొరికిపోయారు.

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని కల్వకుర్తి నియోజ కవర్గంపై బీఆర్‌ఎస్‌ అధిష్ఠానం గురిపెట్టింది. ఈ నియోజకవర్గంలో ఆయా పార్టీల నుంచి టిక్కెట్‌ ఆశిస్తున్న నేతలు అనేక మంది ఉన్నారు. ఉప్పల చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల్లో ఉంటున్న తలకొండపల్లి జడ్పీటీసీ ఉప్పల వెంకటేశ్‌ గుప్తాను పార్టీలోకి లాగేందుకు బీఆర్‌ఎస్‌ వ్యూహం పన్నింది. ఇందులో భాగంగానే శనివారం స్వయంగా మంత్రి కేటీఆర్‌ కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్‌ యాదవ్‌కు ఫోన్‌ చేశారు. తలకొండపల్లి మండలం వీరన్నపల్లి గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే స్థానిక కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతుండగా.. ఆకస్మాత్తు గా కేటీఆర్‌ నుంచి ఫోన్‌ వచ్చింది.

కేటీఆర్‌ నుంచి ఫోన్‌ రావడంతో ఎమ్మెల్యే జైపాల్‌ యాదవ్‌ ఒక్కసారిగా కంగారుపడ్డారు. ఆ హడావుడిలో ఫోన్‌ స్పీకర్‌ ఆన్‌ చేశారు. దానిని మైక్‌ వద్ద ఉంచారు. ‘జైపాల్‌ అన్నా.. మీ నియోజకవర్గంలో ఉప్పల వెంకటేష్‌ గుప్తా బలమైన నాయకుడిగా కన్పిస్తున్నాడు. పదవీ సంగతి తర్వాత.. రేపు నేను అమెరికా వెళ్తున్నా. ఇయ్యాళ ఆయన్ను పట్టుకురా.. పార్టీలో చేర్పించుకుం దాం.’ అని జైపాల్‌కు ఆదేశాలు ఇచ్చారు. కేటీఆర్‌ మాటలు విన్న కార్యకర్తలు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. దీనిని కొంతమంది వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం అది నెట్టింట వైరల్‌గా మారింది. రహస్యంగా ఉంచాల్సిన విషయం బట్టబయలు కావడంతో ఎమ్మెల్యే ముఖం మాడిపోయింది.