Medigadda Barrage: “గాలి అన్నాక వీస్తుంది. నీరు అన్నాక పల్లపు ప్రాంతాలలో పారుతుంది. నేల అన్నాక కుంగిపోతుంది. గట్టిగా వానలు కొడితే మోటర్లు మునిగిపోతాయి. ఇంతోటి దానికి కాలేశ్వరం దండగ ప్రాజెక్టు, కెసిఆర్ కు ఏటీఎం అయిందంటారా” మేడిగడ్డ గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే ఒక గులాబీ కార్యకర్త ఇచ్చిన రిప్లై ఇది. ఇప్పుడు తెలంగాణలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. ఈసారి కాంగ్రెస్ పార్టీకి కొంచెం ఎడ్జ్ ఉన్నట్టు కనిపిస్తోంది. అధికార పార్టీ మీద ప్రజల్లో వ్యతిరేకత ఉంది. ఇదే సమయంలో బిజెపి పుంజుకోవాల్సిన సమయంలో.. దాని స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ ఆక్రమించింది. దీనిని డైవర్ట్ చేసేందుకు కేసిఆర్ పడరాని పాటుపడుతున్నాడు. గత రెండు పర్యాయాలు తన ప్రభుత్వం మీద ఉన్న మరకలను మర్చిపోయి కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీ లకు మక్కికి మక్కిగా తన మేనిఫెస్టోను ప్రకటించాడు. అయినప్పటికీ క్షేత్రస్థాయిలో పెద్దగా ఉపయోగం ఉన్నట్టు కనిపించడం లేదు. ఇది జరుగుతుండగానే కెసిఆర్ కు మేడిగడ్డ కుంగిపోవడం ఒక తలనొప్పిగా మారింది.
వాస్తవానికి ఈ ప్రాజెక్టు మీద మొదటి నుంచి చాలా ఆరోపణలు ఉన్నాయి. సందేహాలు, విమర్శలకు లెక్కే లేదు. విద్యుత్ జేఏసీ రఘు ఏకంగా కాలేశ్వరం ప్రాజెక్టు మీద పుస్తకమే రాశాడు. అసలు ఈ ప్రాజెక్టు సంబంధించి ఇంజనీర్లను పక్కకు తోసేసి, అభినవ మోక్షగుండం విశ్వేశ్వరయ్య లాగా కేసీఆర్ ప్రాజెక్టు డిజైన్ చేస్తే నమస్తే తెలంగాణ మురిసిపోయింది. పేజీలకు పేజీలు వార్తలు కుమ్మేసింది. ఇక తెలంగాణ సమాజం అయితే మౌనంగా ఉండిపోయింది. ప్రాజెక్టు స్వరూపం మీద విమర్శలు వచ్చినప్పటికీ ఎవరు ప్రశ్నించలేదు. అంతేకాదు దీనికి అదనంగా టీఎంసీలు జత చేస్తున్నామని చెప్పి మరిన్ని అప్పులు తెచ్చారు. ఇంకా ఖర్చు పెట్టాలని అనుకున్నారు. లక్ష కోట్ల ప్రాజెక్టు తెలంగాణకు ఏ స్థాయిలో లాభం తీసుకొస్తుంది? అసలు ఈ ప్రాజెక్టు నాణ్యత ఎంత? దీనిని ఏ నిఘా సంస్థ పర్యవేక్షిస్తుంది? ఈ ప్రశ్నలకు అటు కేంద్రం గాని, అటు రాష్ట్రం గాని పట్టించుకోలేదు.ఈ ప్రాజెక్టు కెసిఆర్ కు ఏటీఎం లాగా మారిందని మొదటి నుంచి ప్రతిపక్షాలు ఆరోపిస్తూనే ఉన్నాయి. బిజెపి నాయకులైతే కెసిఆర్ జైలుకు వెళ్లక తప్పదని పలుమార్లు చెప్పారు. కానీ కెసిఆర్ జైలుకు వెళ్ళిందీ లేదు. బిజెపి నాయకులు ఆయనపై ఒత్తిడి తీసుకొచ్చిందీ లేదు. సరే, లాలూ ప్రసాద్ యాదవ్ గడ్డి తినలేదా? శరత్ పవార్ చెరకు రైతుల పొట్ట కొట్టలేదా? శిబు సోరేన్ బొగ్గును మాయం చేయలేదా? కనీసం కెసిఆర్ ఒక పెద్ద ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేశాడు అని తటస్తులు అనుకున్నారు. కానీ ఈ మేడిగడ్డ కుంగిన తర్వాత ఈ ఎత్తిపోతల పథకం నాణ్యత ఏమిటి? భవిష్యత్తు ఏమిటి అనే ప్రశ్నలు తెలంగాణ సమాజాన్ని ఆలోచనలో పడేస్తున్నాయి. ప్రపంచంలోకెల్లా అత్యంత ప్రతిష్టాత్మక ఎత్తిపోతల పథకం అని చెప్పుకుంటూ, డిస్కవరీ, ఎన్డీటీవీ వంటి చానల్స్ లో ప్రచారం చేసుకున్నారు. పర్యాటకులను తీసుకొచ్చి హంగామా చేశారు. సొంత మీడియాతో పాటు అద్దమీడియాలో ఆకాశమంత ఘనత అన్నట్టుగా రాయించారు. దీన్ని కేసీఆర్ మార్క్ అభివృద్ధికి కొలమానం అనే రేంజ్ లో చెప్పారు.
ఇప్పుడు ఏం జరిగింది ఒక బరాజ్ కుంగిపోవడం.. అంటే అక్కడ ఏం జరిగిందో ఎవరూ చెప్పలేకపోతున్నారు. ప్రస్తుతానికి రాకపోకలు నిలిపివేశారు. బరాజ్ కింగిన మాట వాస్తవమని అక్కడ పనిచేస్తున్న ఇంజనీర్లు చెబుతున్నారు. అంతేకాదు మెల్లిగా దీనిని కుట్ర కోణం వైపు తీసుకుపోతున్నారు. అప్పట్లో క్లౌడ్ బరెస్టింగ్ అని కెసిఆర్ చేసిన ఆరోపణల మాదిరిగానే అధికారులు కుట్ర కోణం సిద్ధాంతాన్ని తెరపైకి తెస్తున్నారు. వాస్తవానికి తెలంగాణలో ఎన్ని సంవత్సరాలపాటు ఏ ప్రాజెక్టుకు కూడా కుట్రమప్పులేదు? అకస్మాత్తుగా ఈ కాలేశ్వరం ఎత్తిపోతల పథకానికి ఎందుకు ఎదురైనట్టు? గత ఏడాది, ఈ ఏడాది కురిసిన వర్షాలకు మోటర్లు మునిగిపోవడం, నాణ్యత లోపాలు కళ్ళకు కడుతున్నాయి. వర్షాలకు 17 బాహుబలి మోటార్లకు గానూ ఏకంగా 12 పూర్తిగా దెబ్బతిన్నాయి. ఆ మునిగిన వాటి పరిస్థితి ఏమిటో కాంట్రాక్టు సంస్థ చెప్పడం లేదు, ప్రభుత్వం వివరించడం లేదు. మరి మేడిగడ్డ బరాజ్ ప్రమాదం తీవ్రత ఎంత? ఇప్పుడు ఇది కలవరం కలిగిస్తున్న ప్రశ్న. సాంకేతిక వైఫల్యాలకు కారకుడు ఎవరు? భవిష్యత్తు కాలంలో తలెత్తే సాంకేతిక లోపాలకు ఎవరు కారణం? ఈ బరాజ్ కట్టింది ఎల్ అండ్ టీ కంపెనీ అట, ఐదేళ్లపాటు ఏం జరిగినా ఆ సంస్థ భరించాలి. ఈ లెక్క ప్రకారం రాష్ట్ర ఖజానాకు వచ్చిన నష్టమేమీ లేదని గులాబీ రంగు పూసుకున్న ఇంజనీర్లు తమ వాట్సాప్ గ్రూపులలో చర్చించుకుంటున్నారు. ఇంత జరిగిన తర్వాత.. జరుగుతున్న చర్చ అది కాదు.. ఇప్పుడు కుంగిపోయిన బరాజ్ పరిస్థితి ఏమిటి అనేది? అది అక్కడితో ఆగుతుందా అని? నిజంగా అంత నాణ్యంగా ఉంటే మోటార్లు ఎందుకు మునుగుతున్నాయి? బరాజ్ ఎందుకు కుంగుతోంది?! అన్నట్టు ఆ మేడిగడ్డ ను కట్టింది 80,000 పుస్తకాల అనుభవం కదా.. ఇప్పుడది కాపాడుతుందా?