Medaram Jatara 2024: మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరకు వేళయింది. భక్తజన కోటి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వన దేవతల దర్శనం బుధవారం(ఫిబ్రవరి 21) నుంచి కలుగనుంది. ఇందుకు మేడారం సిద్ధమైంది. దీంతో తెలంగాణతోపాటు, ఆంధ్రప్రదేశ్, ఛతీస్‌గఢ్, మహారాష్ట్ర, ఒడిశా, జార్ఖండ్ తదితర రాష్ట్రాల నుంచి భక్తులు మేడారం బయల్దేరారు. దారులన్నీ మేడారం వైపే సాగుతున్నాయి. ఇప్పటికే మేడారానికి 10 లక్షల మందికిపైగా చేరుకున్నారు. అమ్మవార్లు గద్దెపైకి రాక కోసం వేచి ఉన్నారు.
గద్దెకు రానున్న కోయ రాజులు..
ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర అయిన మేడారం జాతర బుధవారం(ఫిబ్రవరి 21న) ప్రారంభం కానుంది. గద్దెలపైకి వనదేవుడు సమ్మక్క భర్త పగిడిద్ద రాజు, ఆయన కొడుకు జంపన్నను ఉదయం కోయపూజారులు గద్దెలపైకి తీసుకురానున్నారు. దీంతో జాతర ప్రారంభం అవుతుంది. గద్దెలపైకి తీసుకువచ్చే దేవుళ్లను కోయ పూజారులు కాలినడకన తీసుకురావడం విశేషం.
పూనుగొండ్ల గుట్ట నుంచి..
పూనుగొండ్లలో దేవుడు గుట్ట నుంచి పడిడిద్ద రాజును కోయ పూజారులు మేడారం తీసుకువస్తారు. గద్దెలపై ప్రతిష్టిస్తారు. శాంతి పూజ అనంతరం శాంతిపూజ చేస్తారు. పెన్క వంశీయయులు పగడ రూపంలో ఉన్న పగిడిద్ద రాజును పెళ్లి కొడుకుగా సిద్ధం చేసి ఆ పడగ రూపాన్ని గ్రామంలో ఊరేగించి తర్వాత పూనుగొండ్ల అడవుల నుంచి మేడారానికి తీసుకువస్తారు. పూజారి జగ్గారావుతోపాటు మరో పది మంది పూజారులు పగిడిద్ద రాజు వెంట మేడారం వస్తారు. దారి మధ్యలో గోవిందరావుపేట మండలం కర్కపల్లి లక్ష్మీపురంలో పెన్క వంశీయుల వద్ద రాత్రి పగిడిద్ద రాజు విడిది చేస్తారు. బుధవారం ఉదయం బయల్దేరి సారలమ్మ గద్దెను చేరడానికి ముందే పగిడిద్ద రాజు మేడారం చేరుకుంటారు.
కన్నెపల్లి నుంచి జంపన్న..
ఇక సమ్మక్క తనయుడు, సారలమ్మ సోదరుడు అయిన జంపన్నను కన్నెపల్లి నుంచి పోలెబోయిన వంశస్తులు మేడారానికి తీసుకువస్తారు. పూజారి పోలెబోయిన సత్యమైన కుటుంబ సభ్యులు, గ్రామస్తులు మంగళవారం(ఫిబ్రవరి 20) సాయంత్రం 5 గంటలకు కన్నెపల్లి నుంచి బయల్దేరి రాత్రి 7 గంటలకు మేడారం చేరుకుంటారు. లక్షల మంది భక్తుల సమక్షంలో జంపన్నను గద్దెలపై ప్రతిష్టిస్తారు. పగిడిద్ద రాజు గద్దెపైకి రావడంతో జాతరలో ప్రధాన ఘట్టం మొదలవుతుంది.