Medaram Jatara : ఆసియా ఖండంలో అతిపెద్ద అపురూపమైన జాతర మేడారం సమ్మక్క – సారలమ్మ జాతర. తెలంగాణ కుంభమేళాగా గుర్తింపు ఉన్న ఈ జాతరకు ఏటా కోట్లాది మంది భక్తులు తరలివస్తారు. నాలుగు రోజులు సాగే జాతరలో అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. ఇక మేడారం వచ్చి ప్రతీ భక్తుడు జంపన్న వాగులో స్నానం చేయడం ఆచారం. ఇక్కడ స్నానం చేసిన తర్వాతనే సమ్మక్క, సారలమ్మను దర్శించుకుని మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఒకప్పుడు సంపెంగ వాగుగా ఉన్న ఈ వాగు ఇప్పుడు జంపన వాగుగా మారింది. అలా ఎందుకు మారింది. ఈ వాగులో నీరు ఎందుకు ఎరుపెక్కింది అన్న వివరాలు తెలుసుకుందాం.
జంపన్నను పూజించిన తర్వాతే..
మేడారంలో భక్తులు జంపన్నను పూజించిన తర్వాతనే సమ్మక్క, సారలమ్మను దర్శించుకుని పూజలు చేస్తారు. మొక్కులు చెల్లించుకుంటారు. జంపన్న వాగులో స్నానం చేసి జంపన్నను పూజిస్తే ఆరోగ్యంగా ఉంటామన్నది భక్తుల నమ్మకం. గిరిజన వీర యోధుల వీరత్వం కారణంగా జంపన్న వాగులో స్నానం చేసిన ప్రతి ఒక్కరిలోనూ ఆత్మవిశ్వాసం పెరుగుతుందని నమ్ముతారు. అందుకే మొదటి పూజ జంపన్నకే చేస్తారు.
ఎవరీ జంపన్న..
ఇక జంపన్న అనేది తెలంగాణలో ఒక పేరు. అయితే జంపన్న అనేది ఎవరో తెలుసుకుందాం. కాకతీయ రాజులకు సామంత రాజుగా పగిడిద్ద రాజు మేడారంలో వచ్చిన కరువు కాటకాలతో కాకతీయులకు కప్పం కట్టలేక ఎదురు తిరిగాడు. ఫలితంగా కాకతీయ రాజులు మేడారం రాజ్యంపై యుద్ధం ప్రకటించారు. ఇక పగిడిద్ద రాజుకు భార్య సమ్మక్క, కొడుకు జంపన్న, కూతురు సారలమ్మ, సారలమ్మ భర్త గోవిందరాజులు, మరో కుమార్తె నాగులమ్మ ఉన్నారు. వీరంతా కాకతీయ రాజులతో యుద్ధంలో పోరాడారు.
వెన్నుపోటు..
ఇక కాకతీయ రాజులు యుద్ధంలో పగిడిద్ద రాజు, గోవిందరాజు, నాగులమ్మను వెన్నుపోటు పొడిచి చంపేశారు. అప్పటికే యుద్ధంలో తీవ్రంగా గాయపడిన జంపన్న వారి మరణ వార్త విని ఆందోళన చెందుతాడు. శత్రువుల చేతిలో ప్రాణాలు విడవడం ఇష్టలేక సంపెగ వాగులో దూకి ప్రాణత్యాగం చేశాడు. దీంతో నాడు వాగు జంపన్న రక్తంతో ఎరుపెక్కింది. నేటికీ ఎర్రగానే ఉంటుందని భక్తులు నమ్ముతారు. జంపన్న ప్రాణత్యాగం చేసిన వాగు కావడంతో సంపెగ వాగు కాస్త జంపన్న వాగుగా మారింది.
గోదావరికి ఉపనది..
ఇక సంపెంగ వాగు గోదావరికి ఉపనది. సహజంగా గోదావరి నీరు ఎరుపు రంగులో ఉంటుంది. కాబట్టి వాగు నీరు కూడా ఎర్రగా ఉంటుందని కొందరి వాదన. ఏది ఏమైనా జంపన్న వాగులో స్నానం చేయడం వల్ల తమను రక్షించే సమ్మక్క, సారలమ్మల త్యాగం గుర్తుకు వస్తుందని, వారిలో ధైర్యం నింపుతుందని గిరిజనుల నమ్మకం. ఇప్పుడు అది అందరి నమ్మకంగా మారింది. అందుకే జంపన్న వాగులో స్నానం చేసిన తర్వాతనే సమ్మక్క, సారలమ్మను దర్శించుకునే సంప్రదాయం కొనసాగుతుంది.