https://oktelugu.com/

Medaram Jatara 2024: మేడారం హిస్టరీ : సమ్మక్క సారలమ్మల చరిత్ర తెలుసా?

మేడారం ఒక గిరిజన ప్రాంతం. దట్టమైన అడవిలో ఉండే గ్రామం. గిరిజనులు మాత్రమే ఈ జాతర జరుపుకునేవారు. కానీ క్రమంగా వన దేవతల జాతర.. జన జాతరగా మారింది. సమ్మక్క సారలమ్మ అందరి కుల మతాలకు అతీతంగా పూజించబడుతున్నారు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : February 20, 2024 / 01:31 PM IST

    Medaram Jatara 2024

    Follow us on

    Medaram Jatara 2024: ఆసియాలో అతిపెద్ద గిరిజన జాతర అది.. తెలంగాణ కుంభమేళాగా గుర్తింపు పొందింది. ఈ జాతరకు తెలంగాణతోపాటు దేశంలోని అనేక రాష్ట్రాలతోపాటు, విదేశాల నుంచి కూడా భక్తులు తరలివస్తారు. సొంత వాహనాలు, ఆర్టీసీ బస్సులు, రైళ్లు, ఎడ్ల బండ్లుల, కాలినడక.. ఇలా ఎలా వీలైతే అలా మేడారం తరలి వస్తారు. రెండేళ్లకు ఒకసారి జరిగే ఈ జాతర కేవలం నాలుగు రోజులు సాగుతుంది. ఈ నాలుగు రోజులు జాతరకు వచ్చే భక్తుల సంఖ్య ఏటేటా పెరుగుతోంది. ఈ ఏడాది ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు జాతర జరుగనుంది. ఈ జాతరకు 2 కోట్ల మంది వస్తారని అధికారులు వస్తారని అంచనా వేస్తున్నారు. మరోవైపు రెండు నెలలుగా మేడారానికి భక్తులు వస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకు 30 లక్షల మంది వరకు జాతరకు వచ్చి వెళ్లారని అంచనా. ఇంత మంది వస్తున్నారంటే జాతరకు ఎంత ప్రాముఖ్యత ఉందో అర్థం చేసుకోవచ్చు. మరి మేడారంలో ఎవరు ఉంటారు.. అక్కడికి ఇంత మంది భక్తులు ఎందుకు వస్తారు. మహాజాతరకు ఎందుకీ విశిష్టత, సమ్మక్క, సారలమ్మ ఎవరు, వీరిని దేవుళ్లుగా ఎందుకు పూజిస్తున్నారు అనే వివరాలు తెలుసుకుందాం.

    అందరి జాతర..
    మేడారం ఒక గిరిజన ప్రాంతం. దట్టమైన అడవిలో ఉండే గ్రామం. గిరిజనులు మాత్రమే ఈ జాతర జరుపుకునేవారు. కానీ క్రమంగా వన దేవతల జాతర.. జన జాతరగా మారింది. సమ్మక్క సారలమ్మ అందరి కుల మతాలకు అతీతంగా పూజించబడుతున్నారు. రెండేళ్లకోసారి జరిగే ఈ జాతరకు ఇప్పుడు ఇసుకేస్తే రాలనంత జనం వస్తున్నారు. అమ్మవార్ల మహత్యం అలాంది మరి.

    ఎవరీ తల్లులు..
    మేడారంలో భక్తులు పూజించేది సమ్మక్క, సారలమ్మను. మరి వీరు ఎవరు అంటే.. పూర్వం కోయదొర మేడరాజు వేటకోసం అడవికి వెళ్లిన సందర్భంలో అక్కడివారికి పెద్ద పులుల కాపల మధ్య ఓ పసిపాప కనిపించింది. ఆ పాపను తన గూడెంకు తీసుకెళ్లాడు. పాప రాకతో గూడెంలో అన్నీ శుభాలే జరిగాయి. ఆమెను వన దేవతగా భావించారు. మాఘ శుద్ధ పౌర్ణమి రోజున పాపకు సమ్మక్కగా నామకరణం చేశారు. సమ్మక్కను పెంచి పెద్ద చేసిన మేడరాజు ఇక మేడరాజు నాటి కాకతీయ రాజులకు సామంత రాజుగా ఉండేవాడు నేటి జగిత్యాల జిల్లా పొలవాస అతని రాజ్యంగా ఉండేది. సమ్మక్క పెరిగి పెద్దయ్యాక తన మేనల్లుడు అయిన మేడారం సామంత రాజు పగిడిద్ద రాజుకు ఇచ్చి వివాహరం జరిపించారు. ఇలా సమ్మక్క మేడారం చేరుకుంది.

    మేడరాజు కుటుంబం ఇదీ..
    ఇక మేడరాజు – సమ్మక్క దంపతులకు ఇద్దరు కూతుళ్లు సారలమ్మ, నాగులమ్మ, కొడుకు జంపన్న కలిగారు. సారలమ్మను గోవిందరాజుకు ఇచ్చి వివాహం జరిపించారు. ఇలా కాకతీయుల సామంత రాజుగా పగిడిద్ద రాజు తన మేడారం రాజ్యాన్ని పాలించాడు. అయితే అనుకోకుండా కాకతీయులపై యుద్ధం చేయాల్సి వచ్చింది.

    కప్పం కట్టలేక యుద్ధం..
    మేడారంలో నాడు తీవ్ర కరువు వచ్చిందట. దీంతో అక్కడి ప్రజల నుంచి కప్పం వసూలు చేసేంకు గోవిందరాజు నిరాకరించాడు. ఇదే విషయాన్ని కాయతీయ రాజులకు చెప్పాడు. కానీ కాకతీయ రాజులు కప్పం కట్టాల్సిందే అని హుకూం జారీ చేశారు. అయినా పగిడిద్ద రాజు అంగీకరించలేదు. దీంతో కాకతీయరాజులు మేడారంపై యుద్ధం ప్రకటించారు. గిరిజనుల స్వాతంత్య్రం కోసం కాకతీయ రాజులతో వీరోచితంగా పోరాడారు.

    అమరులైన సమ్మక్క కుటుంబం..
    కాకతీయుల రాజు ప్రతాపరుద్రుడు తన సేనలతో మేడారంపై దండ్రయాత్ర చేశాడు. ములుగు జిల్లా లక్నవరం సరస్సు మొదలుకుని గిరిజనులకు, కాకతీయ సైనికులకు మధ్య హోరాహోరీ యుద్దం జరిగింది. గిరిజనుల ఆయుధాలు అయిన బాణాలు, బల్లేలతో సమ్మక్క సేన వీరోచితంగా కాకతీయులపై పోరాడింది. పగిడిద్ద రాజు, సారలమ్మ, నాగులమ్మ, గోవిందరాజును కాకతీయులు వెన్నుపోటు పొడవడంతో వీరమరణం పొందారు.

    చిలకల గుట్టలో అంతర్ధానమైన సమ్మక్క..
    భర్త కొడుకు, కూతురు, అల్లుడు యుద్ధభూమిలో వీరమరణం పొందినా తన ప్రజల కోసం సమ్మక్క కాకతీయులతో ధైర్యంగా పోరాడింది. జంపన్న శత్రువలు చేతిలో చనిపోవడం ఇష్టం లేక సంపెంగవాగులో దూకి ప్రాణత్యాగం చేశాడు. అప్పటి నుంచే సంపెంగ వాగు జంపన్నవాగుగా మారింది. తన కుటుంబం మొత్తం చనిపోయిందని తెలుసుకున్న సమ్మక్క కాకతీయులపై విరుచుకుపడింది. సమ్మక్క వీరత్వం చూసిన కాకతీయ రాజు ప్రతాపరుద్రుడే ఆశ్చర్యానికి గురయ్యాడు. సమ్మక్కను ఎదుర్కొనలేక కాకతీయ సైన్యం సమ్మక్కను సైతం వెన్నుపోటు పొడిచింది. అయినా సమ్మక్క సైన్యానికి చిక్కకుండా.. మేడారానికి ఈశాన్యంలో ఉన్న చిలకలగుట్టపైకి వెళ్లి అక్కడే అంతర్ధానమైంది.

    సమ్మక్క భక్తుడిగా ప్రతాప రుద్రుడు..

    కొన్నేళ్ల తర్వాత ఓ చెట్టుకింద్ద పుట్టగద్దర కుకుమ భరిణి రూపంలో సమ్మక్క కనిపించింది అని చరిత్ర చెబుతుంది. ఈ క్రమంలో కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు తన పొరపాటును గ్రహఇంచాడు. సమ్మక్క భక్తుడిగా మారాడు. రెండేళ్లకోసారి మేడారంలో సాతర నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశాడు.

    కుంకుమ భరణికి పూజలు..
    ఇక మేడారంలో మాఘశుద్ధ పౌర్నమి నాడు సమ్మక్క సారలమ్మ జాతర రెండేళ్లకోసారి నిర్వహిస్తున్నారు. మేడారం జాతరలో భాగంగా మొదట పగిడిద్ద రాజు, గోవిందరాజులను గద్దెలపైకి తీసుకువస్తారు. వీరి రాకతో జాతర మొదలవుతుంది. గోవిందరాజును కొండాయి నుంచి పగిడిద్దరాజును పూనుగొండ్ల నుంచి తీసుకువస్తారు. ఆ తర్వాత సారలమమను కన్నెపల్లి నుంచి సమ్మక్కను చిలకల గుట్ట నుంచి తీసుకువస్తారు. భక్తులు దర్శించుకున్న తర్వాత అమ్మవార్లు తిరిగి వన ప్రవేశం చేస్తారు.