Mahatma Gandhi Martyrs’ Day 2024: “ఇందిరమ్మ ఇంటిపేరు కాదు గాంధీ. ఊరికి ఒక్క వీధి పేరు కాదు గాంధీ. కరెన్సీ నోటు మీద.. ఇలా నడిరోడ్డు మీద మనం చూస్తున్న బొమ్మ కాదు గాంధీ. భరతమాత తలరాతను మార్చిన విధాత గాంధీ. తరతరాల ఏమయాతన తీర్చిన వరదాతర గాంధీ.. రామనామం అతని తలపంతా.. ప్రేమ ధామమే మనసంతా. ఆశ్రమ దీక్ష.. స్వతంత్ర కాంక్ష.. ఆకృతి దాల్చిన అవధూత.. అపురూపం అతడి చరిత.. కర్మయోగమే జన్మంతా.. ధర్మక్షేత్రమే బతుకంతా.. సంభవామి అని ప్రకటించిన అలనాటి కృష్ణ భగవద్గీత.. ఈ బూసినోటి తాతా.. మనలాగే ఓ తల్లి కన్న మామూలు మనిషి కదా గాంధీ.. మహాత్ముడంటూ మన్నన పొందే స్థాయికి పెంచదా ఆయన స్ఫూర్తి.. సత్యాహింసల మార్గజ్యోతి.. అతడు నవ శకానికి నాంది.. గుప్పెడు ఉప్పును పోగేసి.. నిప్పుల ఉప్పెనగా చేసి.. దండయాత్రనే దండయాత్రగా ముందుకు నడిపిన అధినేత.. అసలు సిసలైన జగజ్జేత” మహాత్మ సినిమాలో.. మహాత్మా గాంధీ గురించి సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన పాట ఇది. గాంధీ జీవిత చరిత్ర గురించి ఒక పాట రూపంలో చెప్పాలి అంటే కష్టమే. కానీ సీతారామశాస్త్రి ఆ ప్రయోగం చేశారు. దాదాపు గాంధీ జీవిత చరిత్రను ఒక పాట రూపంలో రాశారు. ఈ పాటలో చెప్పినట్టుగానే గాంధీ జీవితం ఈ తరానికి మాత్రమే కాదు వచ్చే తరాలకు కూడా ఒక అనుభవ పాఠం. అహింస, ధర్మం, నీతి, న్యాయం, నిజాయితీ.. ఇలా ప్రతి ఒక్క అంశాన్ని స్ఫురించే వ్యక్తిత్వం గాంధీ సొంతం. అందుకే సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ.. నేటికీ ఆయను గుర్తుంచుకుంటున్నాం. జాతి పితగా స్మరించుకుంటున్నాం. నేడు గాంధీ వర్ధంతి సందర్భంగా ఒక్కసారి నాటి సంగతులను మననం చేసుకుంటే..
గాంధీ మహాత్ముడి అసలు పేరు మోహన్ దాస్ కరంచంద్ గాంధీ. 1869 అక్టోబర్ 2న గుజరాత్ రాష్ట్రంలోని పోరు బందర్ అనే ప్రాంతంలో పుత్రిబాయి, కరంచంద్ గాంధీ దంపతులకు మహాత్మా గాంధీ జన్మించారు. రాజ్ కోట్ లో పాఠశాల విద్య పూర్తి చేశారు. చిన్నతనంలో చూసిన సత్య హరిచంద్ర నాటకం గాంధీ మీద తీవ్ర ప్రభావం చూపింది. భావ్ నగర్ లో ఉన్నత విద్యను చదివిన గాంధీ.. బారిష్టర్ చదివేందుకు ఇంగ్లాండ్ వెళ్లారు.. ఆ తర్వాత బొంబాయిలో న్యాయవాద వృత్తి చేపట్టారు. అనంతరం అందులో భాగంగా దక్షిణాఫ్రికా వెళ్లారు. ఒకరోజు ఒకటో తరగతి టికెట్ కొని ట్రైన్ లో ప్రయాణిస్తుండగా నల్లజాతీయుడని అవమానించి గాంధీ మహాత్ముడిని రైలు నుంచి దింపేశారు. ఆ అవమానాన్ని భరించలేక గాంధీ మహాత్ముడు నల్లవారందరినీ కూడగట్టి సత్యాగ్రహం చేశాడు. అక్కడి ప్రజలలో సామాజిక స్పృహ కలిగించారు. తిరిగి ఇండియా వచ్చిన తర్వాత స్వాతంత్ర యోధులైన గోపాలకృష్ణ గోఖలే, బాలగంగాధర తిలక్ వంటి వారితో స్వాతంత్ర ఉద్యమం ప్రారంభించారు.
సహాయ నిరాకరణ ఉద్యమం, విదేశీ వస్తువుల బహిష్కరణ, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా వంటి ఉద్యమాలను నిర్వహించారు. గాంధీ మహాత్ముడికి చిన్నతనంలోనే కస్తూరిబాయిత వివాహం జరిగింది. 1944లో భార్య వియోగం కలిగినప్పటికీ స్వాతంత్ర ఉద్యమాన్ని విడువలేదు. తన జీవితం మొత్తాన్ని స్వాతంత్ర ఉద్యమానికి కేటాయించారు. ఇలా గాంధీ నడిపిన అహింస పోరాటా స్ఫూర్తి వల్ల 1947 ఆగస్టు 15న భారతదేశంలో లభించింది. దేశ స్వాతంత్రానికి తన జీవితాన్ని పణంగా పెట్టిన గాంధీజీ.. ప్రార్థన మందిరంలో ఉన్న సమయంలో నాథూరాం గాడ్సే 1948 జనవరి 30న తుపాకీతో కాల్చి చంపారు. గాంధీ స్థాపించిన సబర్మతి, వార్దా ఆశ్రమం ఆయన ఆశయాలకు ప్రతిరూపాలుగా నిలుస్తున్నాయి. గాంధీ చనిపోయి ఇన్ని సంవత్సరాలయినప్పటికీ.. దేశంలో జరుగుతున్న ప్రతి ఉద్యమానికి ముందు గాంధీని స్మరించుకుంటున్నామంటే అతని ప్రభావాన్ని అర్థం చేసుకోవచ్చు. అహింస పరమో ధర్మః.. అనే నినాదాన్ని అతడు ఆచరించి చూపాడు.. రాముడిని గుండెల్లో పెట్టుకున్నాడు. రామరాజ్యంతోనే దేశం సుభిక్షమవుతుందని ప్రకటించాడు. కుల మతాలకు తావు లేకుండా దేశమంతా అన్నదమ్ముల్లా కలిసి ఉండాలని పిలుపునిచ్చాడు. సత్యం, శాంతి, అహింస ఉత్తమ మార్గాలు అని చెప్పి.. వాటిని ఆచరించి.. ఆచరించేలా చేసి.. జాతిపితగా.. మహాత్ముడిగా.. శాశ్వతంగా భారతీయుల హృదయాల్లో నిలిచిపోయారు మోహన్ దాస్ కరంచంద్ గాంధీ.