Mangalagiri Constituency Review : ఏపీలో కీలక నియోజకవర్గాల్లో మంగళగిరి ఒకటి. టిడిపి యువ నేత నారా లోకేష్ పోటీ చేసిన నియోజకవర్గం కావడంతో హాట్ టాపిక్ గా మారింది. గత ఎన్నికల్లో ఆయన మంగళగిరి నుంచి పోటీ చేశారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో ఓడిపోయారు. మరోసారి మంగళగిరి నుంచి తాను బరిలో దిగనున్నట్లు లోకేష్ ప్రకటించారు. వైసీపీలో మాత్రం ఆళ్ల రామకృష్ణారెడ్డిని తప్పిస్తారని ప్రచారం జరుగుతోంది. దీనిపై మాత్రం ఎటువంటి క్లారిటీ లేదు.
గత ఎన్నికల్లో ఓటమి తర్వాత లోకేష్ మంగళగిరి నియోజకవర్గం పై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. ఓటర్లకు దగ్గరయ్యేందుకు ప్రయత్నించారు. సేవా కార్యక్రమాలను సైతం చేపట్టారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా యువగళం పాదయాత్ర చేపడుతున్నారు. నియోజకవర్గ టిడిపి బాధ్యతలను ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధకు అప్పగించారు. అటు వైసీపీ సైతం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. టిడిపికి చెందిన కీలక నేత గంజి చిరంజీవిని తమ వైపు తిప్పుకుంది. రాష్ట్రస్థాయిలో నామినేటెడ్ పదవి అప్పగించింది. మాజీ మంత్రి మురుగుడు హనుమంతరావుకు ఎమ్మెల్సీను చేసింది. దీంతో ఇక్కడ లోకేష్ ను మరోసారి కట్టడి చేయాలన్న ప్రయత్నంలో వైసిపి నాయకత్వం ఉంది.
ఇటువంటి తరుణంలో మంగళగిరి నియోజకవర్గంలో గెలుపెవరిది అన్నదానిపై పొలిటికల్ క్రిటిక్ అనే సంస్థ సర్వే చేపట్టింది. దీంట్లో టిడిపి, వైసిపిల మధ్య హోరాహోరీ ఫైట్ ఉంటుందని తేలింది. గత ఎన్నికల్లో నారా లోకేష్ పై ఆళ్ళ రామకృష్ణారెడ్డి 5337 ఓట్లతో గెలుపొందారు. మంగళగిరిలో అర్బన్ ఓటర్లు 1, 47,904 ఉండగా.. రూరల్ ఓటర్లు 1,20,525 మంది ఉన్నారు. ఇప్పటికి ఇప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీకి 44.15 శాతం, టిడిపికి 44.99 శాతం ఓట్లు వస్తాయని సర్వే సంస్థ అంచనా వేసింది. టిడిపికే స్వల్ప మొగ్గు కనిపిస్తోంది. టిడిపి నుంచి నారా లోకేష్, వైసీపీ నుంచి ఆళ్ల రామకృష్ణారెడ్డి అభ్యర్థులుగా ఉంటేనే ఈ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ అభ్యర్థులు మారితే మాత్రం సమీకరణలు మారే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.