https://oktelugu.com/

Maldives : క్షవరం అయితే గానీ మాల్దీవులకు వివరం అర్థం కాలేదు

మాల్దీవులు మంత్రులు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో భారతదేశం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో.. మాల్దీవులకు అందించే సాయంలో దారుణంగా కోత విధించింది.

Written By:
  • NARESH
  • , Updated On : February 19, 2024 / 11:12 PM IST
    Follow us on

    Maldives : “భారతదేశంలో స్వచ్ఛత ఉండదు.. అక్కడ పర్యాటకం అంటే పేడ వాసన వస్తుంది. మాల్దీవుల్లాగా అక్కడ శుభ్రత ఉంటుందా? మా లాగా వారు స్వచ్ఛతను కొనసాగిస్తారా?” అప్పట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లక్షద్వీప్ లో పర్యటించి.. ఇక్కడి పర్యాటకాన్ని మీ జాబితాలో చేర్చుకోండని భారతదేశ ప్రజలకు పిలుపునిచ్చినప్పుడు.. మాల్దీవుల మంత్రులు పై వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యల తర్వాత #Banmaldives అనే యాష్ ట్యాగ్ విపరీతంగా చక్కర్లు కొట్టిన విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో భారతీయులు ఆ ప్రాంతంలో పర్యటించడం పూర్తిగా మానేశారు. ఒకప్పుడు మాల్దీవుల్లో పర్యటించే జాబితాలో భారతీయులు మొదటి స్థానంలో ఉండేవారు. ఇప్పుడు ఆ సంఖ్య ఐదుకు పడిపోయింది. మాల్దీవులు మంత్రులు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో భారతదేశం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో.. మాల్దీవులకు అందించే సాయంలో దారుణంగా కోత విధించింది.

    భారతీయులు ఆ దేశంలో పర్యటించకపోవడంతో అక్కడ ఆదాయం భారీగా తగ్గింది. ఆర్థికపరమైన సంక్షోభం తలెత్తడంతో అక్కడి ప్రభుత్వం తీవ్రంగా ఇబ్బంది పడుతోంది. ముయిజ్జి ప్రభుత్వం భారత వ్యతిరేక విధానాలు అవలంబిస్తుండడాన్ని ప్రతిపక్ష నాయకులు తప్పు పడుతున్నారు. ఇలానే చేస్తే దేశం ఆర్థికంగా మరింత ఇబ్బంది పడుతుందని హెచ్చరిస్తున్నారు. ఈ హెచ్చరికల నేపథ్యంలోనే ఆ దేశ ఆర్థిక పరిస్థితి దిగజారినట్టు వార్తలు వస్తున్నాయి. ఇటీవల అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ వద్ద మాల్దీవుల ప్రభుత్వం మోకరిల్లింది. తమ దేశం ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఉద్దీపన ప్యాకేజీ కింద బెయిల్ అవుట్ ప్రకటించాలని అభ్యర్థించింది. అయితే భారతదేశంలో వివాదం పెట్టుకోవడం వల్లే మాల్దీవులకు ఈ దుస్థితి దాపురిచిందని అక్కడి ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు.

    అంతర్జాతీయ ద్రవ్య సంస్థ సరిగా స్పందించకపోవడంతో ఇప్పటికిప్పుడు ఆ దేశానికి 1.3 బిలియన్ డాలర్ల ఆర్థిక సహాయం అత్యవసరం. చైనాతో ముయిజ్జు అంటకాగినప్పటికీ ఆ దేశం మాల్దీవులకు సహాయం చేసే పరిస్థితి లేదు. ఇతర దేశాలు కూడా మాల్దీవుల విషయంలో చొరవ చూపేంత పరిస్థితి కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో మాల్దీవుల కు చెందిన సీనియర్ సిటిజన్ హసన్ ఖురేషి సోషల్ మీడియా వేదికగా చేసిన ఒక పోస్ట్ ఆ దేశ ఆర్థిక పరిస్థితి అద్దం పడుతోంది. ” గౌరవనీయులైన భారతీయ ప్రజలకు.. మేము ఆర్థిక కష్టాల్లో ఉన్నాం. మీరందరూ దయతలచి తలా ఒక డాలర్ సహాయం చేస్తే మేము ఆ కష్టాల నుంచి గట్టెక్కుతాం. ఇప్పటికిప్పుడు మా దేశానికి 1.3 బిలియన్ డాలర్ల సహాయం కావాలి” అని అతడు అభ్యర్థించాడు..హసన్ ఖురేషి ఆ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో మాల్దీవుల ఆర్థిక పరిస్థితి పై చర్చ మొదలైంది. కొంతమంది నెటిజన్లు మాల్దీవుల ఆర్థిక పరిస్థితి పై స్పందిస్తున్నారు. భారతదేశంతో అనవసరంగా పెట్టుకున్నారని.. ఇప్పుడు ఫలితం అనుభవిస్తున్నారని కామెంట్లు చేస్తున్నారు.