https://oktelugu.com/

Maldives: మాల్దీవులు దివాలా.. భారత్ తో పెట్టుకుంటే అట్లుంటది మరి

మాల్దీవులు అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు సైతం చైనా అండ చూసుకొని అడ్డగోలుగా వ్యవహరించారు. ఇండియా అవుట్ అనే ప్రచారాన్ని గణనీయంగా చేపట్టారు. మాల్దీవుల్లో ఉన్న భారత సైనికులను వెళ్లిపోవాలని ఆదేశించారు. ఇందుకు మే 10 వరకు గడువు విధించారు.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : February 17, 2024 / 10:35 AM IST

    Maldives

    Follow us on

    Maldives: “పీల్చేగాలి, తాగే నీరు, తినే తిండి కల్పించిన వారిని ఎప్పుడూ మర్చిపోకూడదు. అలా మర్చిపోతే పుట్టగతులు ఉండవు” అంటారు పెద్దలు. పెద్దలు చెప్పిన నాటి మాట ప్రస్తుతం మాల్దీవులు అనే దేశానికి సరిగ్గా సరిపోతోంది. చైనా అండ చూసుకొని విర్రవీగిన ఆ దేశం ఇప్పుడు “భవతీ భిక్షాందేహి” అని దేబిరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ మధ్య ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లక్షద్వీప్ పర్యటనకు వెళ్ళినప్పుడు.. తలా తోకా లేని వ్యాఖ్యలు చేసి మాల్దీవుల మంత్రులు వివాదాన్ని రాజేశారు. భారత ప్రభుత్వం తీరు పట్ల, భారతదేశంలో పర్యాటకం పట్ల సామాజిక మాధ్యమాల వేదికగా ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేశారు. ఇది భారతీయ పౌరుల్లో ఆగ్రహాన్ని కలిగించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా లక్షద్వీప్ లో పర్యటించాలని కోరడంతో భారతీయ పౌరులు తమ ఆలోచన ధోరణి ని మార్చుకున్నారు. #bycot Maldives అనే యాష్ ట్యాగ్ ట్రెండ్ ను సామాజిక మాధ్యమాలలో విస్తృతంగా ప్రచారం చేశారు.. దీంతో భారత్ నుంచి మాల్దీవులకు వెళ్లే పర్యాటకుల సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది. పర్యాటకం మీదనే ఆధారపడే మాల్దీవులకు ఇది కోలుకోలేని దెబ్బ కలిగించింది. దీంతో ఆర్థికంగా ఆ దేశం తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. అప్పట్లో భారత ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన ముగ్గురు మంత్రులను మాల్దీవుల అధ్యక్షుడు తొలగించినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది.

    ఇక మాల్దీవులు అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు సైతం చైనా అండ చూసుకొని అడ్డగోలుగా వ్యవహరించారు. ఇండియా అవుట్ అనే ప్రచారాన్ని గణనీయంగా చేపట్టారు. మాల్దీవుల్లో ఉన్న భారత సైనికులను వెళ్లిపోవాలని ఆదేశించారు. ఇందుకు మే 10 వరకు గడువు విధించారు. అంతేకాదు చైనాలో పర్యటించి భారతదేశానికి వ్యతిరేకంగా పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. ఇది అక్కడి ప్రభుత్వ మనగడపై తీవ్ర ప్రభావం చూపించింది. విపక్ష పార్టీల నాయకులు ముయిజ్జు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీసుకుంటున్న నిర్ణయాలను తప్పుపట్టారు. ఒకానొక దశలో ఆ దేశ పార్లమెంట్లో జరిగిన సమావేశంలో విపక్ష పార్టీల నాయకులు ముయిజ్జు పార్టీ నాయకులపై దాడులు కూడా చేశారు. భారతదేశానికి వ్యతిరేకంగా తీసుకుంటున్న నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

    ఈ పరిణామాలు ఇలా జరుగుతుండగానే దేశంలో ఆర్థిక సంక్షోభం తీవ్రస్థాయిలో ఉందని.. దీనిని తట్టుకోవాలంటే బెయిల్ అవుట్ రుణాన్ని కోరుతూ ఆ దేశాధ్యక్షుడు ముయిజ్జు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థను ఆశ్రయించారు..ముయిజ్జు అధ్యక్షుడు కాకముందు భారత్ మాల్దీవుల మధ్య సన్నిహిత సంబంధాలు ఉండేవి. ఆ దేశం కోసం భారత ప్రభుత్వం డబ్బు వెచ్చించేది. అయితే ఇటీవలి బడ్జెట్లో మాల్దీవులకు కేటాయించే సాయం విషయంలో భారత ప్రభుత్వం కోత విధించింది.. దీంతోపాటు మన దేశం నుంచి వెళ్లే పర్యాటకులు పూర్తిగా తగ్గిపోవడం మాల్దీవుల ఆదాయంపై తీవ్రంగా ప్రభావం చూపింది. దీంతో ఆర్థికపరంగా ఆ దేశం తీవ్ర అత్యయిక పరిస్థితిని ఎదుర్కొంటోంది. హోటళ్ళకు గిరాకీ లేకపోవడం, విమానయాన సంస్థలకు టికెట్లు బుక్ కాకపోవడం వంటి పరిణామాలు ఆ దేశంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. చైనా కూడా మాల్దీవుల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తుండడం.. ముయిజ్జు ప్రభుత్వాన్ని మరింత ఇబ్బంది పెడుతోంది. వాస్తవానికి చైనా అండ చూసుకొనే ఆయన భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్వరం వినిపించడం మొదలుపెట్టారు.. అయినప్పటికీ చైనా ప్రభుత్వం మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జీని విశ్వసించడం లేదు. దేశంలో పెరిగిపోతున్న ఆర్థిక పతనం నేపథ్యంలో అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థను ఆశ్రయించిన ముయిజ్జి బెయిల్ అవుట్ రుణాన్ని కోరడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
    కాగా, గతంలో మాల్దీవులకు వెళ్లే పర్యాటకులలో భారతీయుల మొదటి స్థానంలో ఉండేవారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో ఇప్పుడు ఆ స్థానం ఐదుకు పడిపోయింది. త్వరలో మరింత దిగజారిపోయే అవకాశాలు లేక పోలేదని పర్యాటక రంగ నిపుణులు చెబుతున్నారు. మాల్దీవులు ఆర్థిక పతనం నేపథ్యంలో నెటిజన్లు రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారు. భారతదేశంతో పెట్టుకుంటే ఏ దేశానికైనా ఇదే గతి పడుతుందని హెచ్చరిస్తున్నారు.