Madapur Rave Party : మాదాపూర్ రేవ్ పార్టీ : వెలుగులోకి సంచలన నిజాలు

రేవ్ పార్టీకి సంబంధించి సినీ నిర్మాత వెంకట్ పోలీసుల అదుపులో ఉన్న నేపథ్యంలో సరికొత్త విషయాలు వెలుగులోకి వస్తాయని తెలుస్తోంది.

Written By: K.R, Updated On : August 31, 2023 8:11 pm

Madapur Rave Party

Follow us on

Madapur Rave Party : హైదరాబాదులో విష సంస్కృతి మరింతగా వేళ్ళూనుకుంటున్నది. భిన్న నేపధ్యాలకు చెందిన ప్రజలు జీవిస్తున్న క్రమంలో రకరకాల అలవాట్లు, వ్యసనాలు క్రమంగా వ్యాప్తిలోకి వస్తున్నాయి. సరదా కోసం మొదలవుతున్న ఈ అలవాట్లు మత్తులోకి నెడుతున్నాయి. గతంలో సిగరెట్, మద్యంతో సరిపెట్టుకునే యువత.. ఇప్పుడు నిషా కోసం గంజాయి, మాదకద్రవ్యాల బారిన పడి మత్తుకు బానిసలవుతున్నారు. తాజాగా హైదరాబాద్ మహానగరంలో రేవ్ పార్టీ వ్యవహారం కలకలం రేపుతోంది. మాదా పూర్ లో రేవ్ పార్టీని యాంటీ నార్కో టిక్స్ బ్యూరో అధికారులు భగ్నం చేయడం ఆందోళన కలిగిస్తోంది. ఈ పార్టీలో లభించిన డ్రగ్స్ ను అధికారులు సీజ్ చేశారు. నిందితులను మాదాపూర్ పోలీసులకు అప్పగించారు. ఈ కేసులో ఒక సినీ నిర్మాతతో పాటు ఐదు ప్రముఖులు ఉన్నారు.

ఇదీ జరిగింది

మాదాపూర్ వద్ద విఠల్ రావు నగర్ లోని ఓ అపార్ట్మెంట్లో రేవ్ పార్టీ నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి నార్కోటిక్స్ బృందానికి సమాచారం అందింది. వెంటనే వారు బృందాలను అలర్ట్ చేశారు. పార్టీ మొదలయ్యే సమయానికి అక్కడికి పోలీసులు చేరుకున్నారు. పోలీసులు ఆ సమయానికి చేరుకునే వరకు అక్కడ చాలామంది డ్రగ్స్ వినియోగిస్తూ మత్తులో తూలుతున్నారు. వాళ్లందర్నీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారు వినియోగిస్తున్న డ్రగ్స్ సీజ్ చేశారు. ఈ రేవ్ పార్టీలో భారీగా డ్రగ్స్ బయటపడ్డాయి. అయితే ఈ డ్రగ్స్ ను ఎవరు తీసుకువచ్చారనే విషయంపై పోలీసులు ఆరా తీశారు. పార్టీ నిర్వాహకులు తెచ్చారా లేదా డ్రగ్ డీలర్స్ ఎవరైనా పార్టీలో ఉన్నారా అనే విషయంపై కూపీ లాగుతున్నారు. ఈ రేవ్ పార్టీలో ఓ సినిమా నిర్మాత కూడా పట్టుబడడం కలకలం రేపుతోంది. అతనితోపాటు మరో ఐదుగురు పేరు మోసిన ప్రముఖులు కూడా ఉండటం సంచలనం కలిగిస్తోంది.

సినీ నిర్మాత వెంకట్ ఆధ్వర్యంలో..

ఈ రేవ్ పార్టీని నిర్మాత వెంకట్ నిర్వహించినట్టు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. గతంలో ఒకచోట వెంకట్ నిర్వహించిన పార్టీపై పోలీసులు దాడి చేశారు. అయితే అప్పటినుంచి వెంకట్ తప్పించుకుని తిరుగుతున్నాడు. అయితే అతడి కదలికలపై పోలీసులు నిఘా పెట్టారు. బుధవారం రాత్రి పక్కా సమాచారంతో రంగంలోకి దిగారు. క్రమంలోనే విఠల్ రావు నగర్ లోని అపార్ట్మెంట్లో నిర్వహించిన దాడిలో వెంకట్ బృందం చీకటి కోణాలు వెలుగులోకి వచ్చాయి. మత్తు పదార్థాలతో పాటు పట్టుబడిన నిందితులను పోలీస్ స్టేషన్ కు తరలించి మరింత లోతుగా విచారణ జరుపుతున్నారు. మాదక ద్రవ్యాల నిరోధక విభాగం వారి నుంచి డ్రగ్స్ మూలాలపై ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. వెంకట్ బృందం నుంచి పోలీసులు కొకైన్ ఎల్ ఎస్ డీ, ఇతర మత్తు పదార్థాలు ఎంత మేరకు స్వాధీనం చేసుకున్నారనేది ఇప్పటివరకు ఒక స్పష్టత లేదు.. నిర్మాత వెంకట్ కు మాదక ద్రవ్యాలు ఎవరు సరఫరా చేశారు? ఇందులో నైజీరియన్ల పాత్ర ఎంత? గతంలోనూ ఈ తరహా పార్టీలు వెంకట్ నిర్వహించినప్పుడు మాదకద్రవ్యాలు ఎవరు సరఫరా చేశారు? అనే కోణాల్లో పోలీసులు విచారణ జరుపుతున్నట్టు తెలుస్తోంది.

ఎలా కళ్ళు కప్పారు?

సినీ పరిశ్రమలో డ్రగ్స్ వ్యవహారాలు ఈనాటివి కావు. అయితే రాష్ట్రంలో డ్రగ్స్, సైబర్ నేరాలు విస్తరిస్తున్న నేపథ్యంలో.. నియంత్రించేందుకు కేసిఆర్ ప్రభుత్వం రాష్ట్రంలో రెండు కొత్త విభాగాలు ప్రారంభించింది. అవే నార్కోటిక్స్, సైబర్ బ్యూరోలు. దేశంలో మరి ఎక్కడ లేని విధంగా నాలుగు వేల మందితో ఈ బ్యూరోలను ఏర్పాటు చేసింది.. యువత మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకునేందుకు, డ్రగ్స్ నివారణకు యాంటీ నార్కోటిక్స్ బ్యూరో చర్యలు చేపడుతోంది. విదేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు డ్రగ్స్ సరఫరా కాకుండా ఉండేందుకు కఠిన చర్యలు అమలు చేస్తోంది. అయినప్పటికీ ఇలాంటి పార్టీలు జరగడం అనుమానాలకు తావిస్తోంది. ప్రభుత్వం ఇంత కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ డ్రగ్స్ రాష్ట్రానికి ఎలా వస్తున్నాయి అనేది అంతు పట్టకుండా ఉంది. ప్రస్తుతం రేవ్ పార్టీకి సంబంధించి సినీ నిర్మాత వెంకట్ పోలీసుల అదుపులో ఉన్న నేపథ్యంలో సరికొత్త విషయాలు వెలుగులోకి వస్తాయని తెలుస్తోంది.