https://oktelugu.com/

Delhi NCT Bill: ఢిల్లీ ఇక రాష్ట్రం కాదు.. కొత్త చట్టం ఏం చెబుతోందంటే?

మొదటినుంచి ఈ బిల్లును ఇండియా కూటమిలోని పార్టీలు, భారత రాష్ట్ర సమితి, బహుజన్ సమాజ్ వాదీ పార్టీ, మజ్లీస్ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. ఇక ఈ బిల్లుపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ట్విట్టర్ వేదికగా కేంద్ర ప్రభుత్వం మీద మండిపడ్డారు.

Written By:
  • Rocky
  • , Updated On : August 4, 2023 / 10:48 AM IST
    Follow us on

    Delhi NCT Bill: ఢిల్లీ సేవల బిల్లుకు లోక్ సభ ఆమోదం తెలిపింది. జాతీయ రాజధాని ఢిల్లీ ప్రాంత ప్రభుత్వ (సవరణ) బిల్లు_2023 ను కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా గురువారం పార్లమెంట్లో ప్రవేశపెట్టగా.. ఆందోళనలు, నిరసనల మధ్య ఈ బిల్లుకు లోక్ సభ ఆమోదం తెలిపింది. నాలుగు గంటల పాటు ఈ బిల్లుపై సభలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఈ బిల్లును ఎందుకు తీసుకు వస్తున్నామో కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా వివరణ ఇచ్చారు.. ఢిల్లీ రాష్ట్రం కాదు. కేంద్రపాలిత ప్రాంతం. ఢిల్లీ సేవలు ఎప్పటికీ కేంద్రంతోనే ముడిపడి ఉంటాయి. దేశ రాజధాని ఢిల్లీకి సంబంధించి ఏవైనా చట్టాలు చేసే హక్కు కేంద్ర ప్రభుత్వానికి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. రాజధానిలో బ్యూరోక్రాట్లను ఎవరు నియంత్రిస్తారనే దానిపై సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారమే బిల్లును తీసుకొచ్చామని, ఢిల్లీ కోసం చట్టాలు చేసేందుకు కేంద్రాన్ని అనుమతించే నిబంధనలు, అధికరణలు రాజ్యాంగంలో కూడా ఉన్నాయని అమిత్ షా గుర్తు చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ తన అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు..బ్యూరో క్రాట్ల బదిలీతో విజిలెన్స్ ను తన నియంత్రణలో పెట్టుకోవడానికి మాత్రమే ఈ బిల్లును వ్యతిరేకిస్తుందని, ప్రజా సేవ కోసం కాదని అమిత్ షా ఆరోపించారు.

    విపక్షాలు ఏమన్నాయి అంటే

    మొదటినుంచి ఈ బిల్లును ఇండియా కూటమిలోని పార్టీలు, భారత రాష్ట్ర సమితి, బహుజన్ సమాజ్ వాదీ పార్టీ, మజ్లీస్ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. ఇక ఈ బిల్లుపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ట్విట్టర్ వేదికగా కేంద్ర ప్రభుత్వం మీద మండిపడ్డారు. “దేశ రాజధాని ప్రజలను బానిసలుగా చేసేందుకే కేంద్రం ఈ బిల్లును తీసుకొచ్చింది. దీనిని సమర్థించేందుకు వాళ్ల దగ్గర ఒక్క విలువైన పాయింట్ కూడా లేదు. తప్పు చేస్తున్నా మన్న సంగతి వారికి కూడా తెలుసు. ఇండియా కూటమి అధికారంలోకి రాగానే దీనిని కచ్చితంగా అడ్డుకుంటాం.” అని ఆయన వ్యాఖ్యానించారు.. 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో ఢిల్లీని రాష్ట్రంగా ప్రకటిస్తారని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హామీ ఇచ్చారని ఆప్ అధినేత గుర్తు చేశారు. లోక్ సభ లో చర్చ జరుగుతున్నప్పుడు ఈ బిల్లుపై భారత రాష్ట్ర సమితి ఎంపీ రంజిత్ రెడ్డి మాట్లాడారు. ” కేంద్రం సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగించే లాగా వ్యవహరిస్తోంది. ఇది సరైన పద్ధతి కాదు. ఈ బిల్లు ను మూజువాణి ఓటు ద్వారా ఆమోదం పొందేలా కేంద్రం చేసింది. దీనివల్ల రాష్ట్రాల హక్కుల్లోకి కేంద్రం ప్రవేశిస్తుంది” అని ఆయన వ్యాఖ్యానించారు.

    ఏమిటి ఈ బిల్లు

    దేశ రాజధానిలో పరిపాలన సేవల పై నియంత్రణ ను లెఫ్ట్నెంట్ గవర్నర్ కు అప్పగించేలా కేంద్ర ప్రభుత్వం మే 19న ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ఢిల్లీలో గ్రూప్_ ఏ అధికారుల బదిలీలు, నియామకాలు వారిపై క్రమశిక్షణ చర్యలకు సంబంధించి నేషనల్ క్యాపిటల్ సివిల్ సర్వీస్ అథారిటీ ఏర్పాటు చేయాలని కేంద్రం సంకల్పించింది. దాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ ముందు నుంచి వ్యతిరేకిస్తూ వస్తున్నది. అంతకుముందు సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించింది. ఢిల్లీలో ప్రభుత్వ ఉద్యోగుల నియామకాలు, బదిలీలపై నియంత్రణ అధికారాలు ఆ రాష్ట్ర ప్రభుత్వానికే ఉంటాయని పేర్కొంటూ సుప్రీంకోర్టు మే 11న తీర్పు ఇచ్చింది. దీంతో కేంద్రం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ఇప్పుడు పార్లమెంటు సమావేశం నేపథ్యంలో ఈ ఆర్డినెన్స్ ను బిల్లు రూపంలో సభ ముందు పెట్టింది. ఇక తాజాగా సభ ఆమోదించిన బిల్లు కార్యరూపంలోకి వస్తే ఢిల్లీ పూర్తిగా కేంద్రం చేతుల్లోకి వెళ్తుంది. కేంద్రపాలిత ప్రాంతంగా మారిపోతుంది.