Loksabha Elections 2024 : ఏపీ ఎన్నికల్లో పొత్తు కుదిరిన నేపథ్యంలో.. తెలంగాణలోనూ ఆ ధర్మాన్ని టిడిపి, బిజెపి పాటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. త్వరలో తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఖమ్మం పార్లమెంటు స్థానం నుంచి టిడిపిని పోటీ చేయాలని బిజెపి కోరుతున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఖమ్మం నియోజవర్గం ఆంధ్రకు సరిహద్దులో ఉంటుంది. పైగా గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ తొమ్మిది స్థానాలను టిడిపి గెలుచుకుంది. భద్రాచలంలో మాత్రమే భారత రాష్ట్ర సమితి గెలిచింది.. ఉన్న ఒక్క ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ లో చేరుతారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఇక్కడ సిట్టింగ్ ఎంపీగా ఉన్న నామా నాగేశ్వరరావును భారత రాష్ట్ర సమితి అభ్యర్థిగా ప్రకటించింది. ఆయన నిలబడినప్పటికీ ఈసారి గెలిచే పరిస్థితి లేదని వివిధ సంస్థలు చేసిన సర్వేల్లో వెళ్లడైంది.
ఇక్కడ బిజెపి అభ్యర్థులుగా పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. ఇటీవల దివంగత ముఖ్యమంత్రి జలగం వెంగళరావు రెండవ కుమారుడు, మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు ఇటీవల బీజేపీలో చేరారు. అంతకుముందు జి. వెంకటేశ్వర్లు, తాండ్ర వినోద్ రావ్ బిజెపిలో చేరారు. ఎంపీ టికెట్ వస్తుందని ప్రచారం చేసుకున్నారు. అయితే జలగం వెంకట్రావు బిజెపిలో చేరడంతో ఆయనకే టికెట్ వస్తుందని అందరూ అనుకుంటున్నారు. ఈ నియోజకవర్గంలో బిజెపికి అనుకున్నత స్థాయిలో కార్యవర్గం లేదు. ఈ జిల్లాలో ఇప్పటివరకు జరిగిన ప్రత్యక్ష ఎన్నికల్లో ఎమ్మెల్యే లేదా ఎంపీగా గెలిచిన చరిత్ర బిజెపికి లేదు. అందుకే టిడిపిని ఈ పార్లమెంటు స్థానంలో పోటీ చేయాలని బిజెపి కోరుతున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక్కడ టిడిపి పోటీ చేస్తే కాంగ్రెస్ కు గట్టి పోటీ ఇవ్వచ్చని సర్వే సంస్థలు తేల్చి చెప్పడంతో బిజెపి పెద్దలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
భారత రాష్ట్ర సమితి అధినేత కెసిఆర్ ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థిగా నాగేశ్వరరావు ప్రకటించినప్పటికీ.. ఆయన అంతగా ఆసక్తిని ప్రదర్శించడం లేదని తెలుస్తోంది.. ఒకవేళ ఆయనను టిడిపిలోకి ఆహ్వానించి.. బిజెపి మద్దతు తో పోటీ చేస్తే గెలిచే అవకాశం ఉంటుందని చర్చ జరుగుతున్నది. ఖమ్మంలో టిడిపి అభ్యర్థిని నిలబెడితే.. ఆ ప్రభావం గ్రేటర్ హైదరాబాద్లో ఆ ప్రభావం ఉంటుందనే చర్చ జరుగుతోంది. దీనివల్ల ఓటు బ్యాంకు పెరిగే అవకాశం ఉంటుందని బిజెపి పెద్దలు అంతర్గతంగా చర్చించుకుంటున్నట్టు తెలిసింది. ఇక బిజెపి తెలంగాణలో ఖమ్మం, వరంగల్ స్థానాలు మినహా 15 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. రెండు రోజుల క్రితం భారతీయ జనతా పార్టీలో చేరిన ఆరూరి రమేష్ కు వరంగల్ టికెట్ కేటాయించిందనే ప్రచారం జరుగుతోంది. ఖమ్మం విషయంలో మాత్రం బిజెపి ఇంకా ఒక అంచనాకు రాలేదు. ఇటీవల జలగం వెంకట్రావు బిజెపిలో చేరారు. అదే ఆయనకు ఇంకా టికెట్ కలర్ కాలేదని తెలుస్తోంది. ఒకవేళ బిజెపి అధిష్టానం ఆయనకు టికెట్ ఇస్తే.. తెలంగాణలో టిడిపి పోటీ చేసే అవకాశం ఉండదు. వెంకట్రావు కాదని టిడిపికి ఖమ్మం స్థానాన్ని కేటాయిస్తే మాత్రం రాజకీయాల్లో సమూల మార్పులు చోటు చేసుకుంటాయని విశ్లేషకులు భావిస్తున్నారు.