Homeఆంధ్రప్రదేశ్‌Krishna Passed Away: ఇంజనీర్ కాలేక యాక్టర్ అయ్యాడు: మూడు షిఫ్టుల్లో పనిచేసే స్థాయికి ఎదిగాడు......

Krishna Passed Away: ఇంజనీర్ కాలేక యాక్టర్ అయ్యాడు: మూడు షిఫ్టుల్లో పనిచేసే స్థాయికి ఎదిగాడు… నట దిగ్గజం కృష్ణ ఇకలేరు

Krishna Passed Away: వెండితెరపై అల్లూరి సీతారామరాజుగా, గూఢచారి గా, కౌ బాయ్ గా, మరెన్నో పాత్రలతో ప్రేక్షకులను దశాబ్దాల పాటు అలరించిన సూపర్ స్టార్ కృష్ణ మంగళవారం తెల్లవారుజామున హైదరాబాదులో కన్నుమూశారు. 1942 మే 31 గుంటూరు జిల్లా తెనాలి మండలం బుర్రిపాలెం గ్రామంలో వీర రాఘవయ్య చౌదరి, నాగరత్న దంపతులకు కృష్ణ జన్మించారు.. ఐదుగురు సంతానంలో ఆయనే మొదటి వారు.. కృష్ణ అసలు పేరు ఘట్టమనేని శివరామకృష్ణమూర్తి. చిన్నప్పటి నుంచే ఆయనకు సినిమాలు అంట చాలా ఆసక్తి.. కానీ ఆయన తల్లిదండ్రులు అతడిని ఇంజనీర్ చేయాలి అనుకున్నారు. కానీ సీటు దొరకపోవడంతో ఆఇష్టంగానే డిగ్రీ లో చేరారు. ఏలూరులో చదువుతున్నప్పుడే అక్కడ ప్రఖ్యాత నటుడు అక్కినేని నాగేశ్వరరావుకు సన్మానం జరిగింది.. అది చూసిన కృష్ణకు తనకు కూడా అలాంటి సన్మానం జరగాలని కోరుకుని సినిమాలపై మరింత ఇష్టాన్ని పెంచుకున్నారు. ఈ రంగం వైపు వడివడిగా అడుగులు వేశారు. 1969 లో ఇందిరను కృష్ణ వివాహం చేసుకున్నారు. వీరికి ఐదుగురు సంతానం. రమేష్ బాబు, మహేష్ బాబు, పద్మావతి, ప్రియదర్శిని, మంజుల. అయితే విజయనిర్మలను కృష్ణ రెండో వివాహం చేసుకున్నారు.

సినిమాలే భవిష్యత్తు అనుకున్నారు

ఏలూరులో డిగ్రీ పూర్తయినప్పటికీ తల్లిదండ్రుల ఒత్తిడితో ఇంజనీరింగ్ చదువుదామని అనుకున్నారు. కానీ ఆయన ఎంత ప్రయత్నించినప్పటికీ సీటు లభించలేదు. ఎలాగూ డిగ్రీ పూర్తి చేశాను కదా నాకు ఇష్టమైన సినిమాల వైపు వెళ్తానని తల్లిదండ్రులను ఒప్పించారు. మొదట్లో ససే మీరా అన్నప్పటికీ తర్వాత వారు ఒప్పుకున్నారు. నటులు జగ్గయ్య, గుమ్మడి, మాత చక్రపాణి తెనాలి ప్రాంతానికి చెందినవారు కావడంతో కృష్ణ మద్రాసు వెళ్లి వారిని కలిశారు. అయితే వయసు తక్కువగా ఉందని, కొంత కాలం అయిన తర్వాత వస్తే అవకాశాలు ఇస్తామని వారు చెప్పడంతో కృష్ణ నిరాశగా వెనుతిరి గారు. ఇటు చూస్తే డిగ్రీ అయిపోయింది. పై చదువులు చదవడం ఇష్టం లేదు.. ఖాళీగా ఉండటం ఇష్టం లేక ప్రజా నాట్యమండలిలో చేరారు. అప్పట్లో ప్రజానాట్యమండలికి యువతలో బాగా క్రేజ్ ఉండేది. గరికపాటి రాజారావు సహకారంతో పాలు నాటకాల్లో నటించి నటనపై అవగాహన పెంచుకున్నారు. 1964లో ప్రముఖ దర్శక, నిర్మాత ఆదుర్తి సుబ్బారావు తెరకెక్కించిన తేనెమనసులు సినిమాతో కృష్ణ సినీ ప్రయాణం మొదలైంది. అయితే కృష్ణను తొలగించమని ఆయనపై చాలా ఒత్తిడి వచ్చింది. అయినప్పటికీ ఆయన తన నిర్ణయం మార్చుకోలేదు. షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుని 1965లో ఈ సినిమా విడుదలైంది. ఘన విజయం సాధించింది.

ఒక్క సినిమా 20 సినిమాల్లో అవకాశాలు ఇచ్చింది

“తేనె మనసులు” విజయవంతమైన తర్వాత రెండో సినిమా “కన్నె మనసుల్లో” నటిస్తుండగానే హీరో కృష్ణకు “గూఢచారి 116” లో అవకాశం వచ్చింది. ఈ సినిమా అఖండ విజయం సాధించి ఆయన కెరీర్ ను మరో మలుపు తిప్పింది. అక్కడితోనే అయిపోలేదు… ఈ సినిమా నుంచి ఆయనను ప్రేక్షకులు ఆంధ్రా జేమ్స్ బాండ్ అని పిలిచేవారు. ఆ సినిమా విజయం సాధించడంతో కృష్ణ 20 సినిమాలకు సైన్ చేశారు. గూఢచారి 116 తో ఆయన ఇమేజ్ అమాంతం పెరిగింది.. ఆ తర్వాత ఆయన మరో ఆర్ జేమ్స్ బాండ్ తరహా చిత్రాలు చేశారు.. అవన్నీ ఆయనకు విజయాలను సాధించిపెట్టాయి.. ఇక బాపు రమణ తీసిన పూర్తి అవుట్ డోర్ చిత్రం సాక్షి.. ఆయన ఇమేజ్ మరో స్థాయికి తీసుకెళ్ళింది.. విజయనిర్మలతో ఆయన మొదట నటించిన సినిమా ఇదే.. మానవత్వం మీద నమ్మకం గల ఒక పల్లెటూరి అమాయకుడి పాత్రలో ఆయన నటించిన తీరు శకులను బాగా మెప్పించింది.

మూడు షిఫ్టుల్లో పనిచేసేవారు

1970_71 మధ్యకాలంలో కృష్ణ విజృంభించారనే చెప్పాలి. ఒకే ఏడాదిలో పదుల సంఖ్యలో ఆయన సినిమాలు చేశారు.. 1968లో కృష్ణ నటించిన పది సినిమాలు విడుదలయ్యాయి. ఆ తర్వాత 1969 లో 15 సినిమాలు, 1970లో 16 చిత్రాలు, 1971లో 11 సినిమాలు, 1972లో 18 సినిమాలు, 1973లో 15 సినిమాలు, 1974లో 13 సినిమాలు, 1980లో 17 సినిమాలు విడుదలయ్యాయి. ఒక దశలో రోజుకి కృష్ణ మూడు షిఫ్ట్ ల్లో పనిచేసేవారు.

టెక్నాలజీ ఆయన చలవే

నాలుగు దశాబ్దాల పాటు సాగిన కృష్ణ కెరియర్లో 340 కి పైగా సినిమాల్లో నటించారు. సినీ ప్రస్థానంలో ఎన్నో సాహసాలు చేసిన కృష్ణ డేరింగ్ అండ్ డాషింగ్ హీరోగా పేరు తెచ్చుకున్నారు. 1970లో పద్మాలయ పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభించారు.. విజయవంతమైన సినిమాలు తీశారు.. దర్శకుడిగా 16 సినిమాలు తెరకెక్కించారు.. ఇక కృష్ణ నటించిన పలు సినిమాలు తెలుగులో కొత్త సాంకేతికతను, జానర్ ను ప్రేక్షకులకు పరిచయం చేశాయి.. తెలుగులో తొలి జేమ్స్ బాండ్ సినిమా గూఢచారి 116, తొలి కౌబాయ్ సినిమా మోసగాళ్లకు మోసగాడు, తొలి ఫుల్ స్కోప్ సినిమా అల్లూరి సీతారామరాజు, తొలి 70 ఎం ఎం సినిమా సింహాసనం వంటివి కృష్ణ నటించిన చిత్రాలే.

రాజీవ్ గాంధీ తో స్నేహంతో రాజకీయాల్లోకి వచ్చారు

హీరో కృష్ణకు రాజీవ్ గాంధీకి మధ్య మంచి స్నేహం ఉండేది.. ఇద్దరు అప్పుడప్పుడు కలుస్తూ ఉండేవారు.. ఆ అభిమానంతోనే 1984లో కృష్ణ కాంగ్రెస్ పార్టీలో చేరారు.. 1989లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఏలూరు లోక్ సభ నియోజకవర్గం నుంచి పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికయ్యారు. 1991 ఎన్నికల్లో మరోసారి ఏలూరు నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల వల్ల రాజీవ్ గాంధీ హత్యకు గురవటం… ఏలూరులో ఓడిపోవడం తో కృష్ణ ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు.. కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత తెలుగుదేశం పార్టీ, సీనియర్ ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ పలు సినిమాలు తీశారు. అప్పట్లో ఎన్టీఆర్, కృష్ణకు మధ్య విభేదాలు ఉండేవి.. వయసు మీద పడటం వల్ల 2010 నుంచి సినిమాలకు దూరంగా ఉన్నారు.. 2016లో ఆయన నటించిన చివరి చిత్రం శ్రీ శ్రీ. ఆయన నటనకు ఫిలింఫేర్ సౌత్ జీవిత సాఫల్య పురస్కారం 1997లో, ఎన్టీఆర్ జాతీయ పురస్కారం 2003లో, ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ 2008లో, భూషణ్ పురస్కారం 2009లో లభించాయి. ఒక బుర్రిపాలెం నుంచి సామాన్య రైతు కుటుంబంలో పుట్టి సూపర్ స్టార్ గా ఎదిగిన కృష్ణ జీవితం ఎందరికో ఆదర్శం. గుండెపోటుతో ఆయన చనిపోవడంతో అభిమానులు శోకసంద్రంలో మునిగి పోయారు.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular