https://oktelugu.com/

Laborer Santiago Martin : ఓ కూలీ.. లాటరీ వ్యాపారయ్యాడు.. ₹1,368 కోట్ల ఎన్నికల బాండ్లు కొన్నాడు..

2022 ఏప్రిల్ 2న ఇదే కేసులో 409 కోట్ల చరాస్తులనూ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు ఫ్రీజ్ చేయడం విశేషం. ఇది జరిగిన ఐదు రోజులకే మార్టిన్ ఏకంగా 100 కోట్ల ఎన్నికల బాండ్లు కొనుగోలు చేశాడు. అయితే ఇతడు ఏ పార్టీ కోసం ఎక్కువ డబ్బులు ఖర్చు చేశాడనేది ఇప్పటివరకు తెలియ రాలేదు.

Written By:
  • NARESH
  • , Updated On : March 16, 2024 / 03:48 PM IST

    Laborer Santiago Martin became a lottery trader

    Follow us on

    Laborer Santiago Martin : దినసరి కూలీ ఆదాయం ఎంత ఉంటుంది.. మహా అయితే ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో 300 నుంచి 400.. పట్టణ ప్రాంతాల్లో 500 నుంచి 800 వరకు ఉంటుంది. కానీ ఇతడు కాస్ట్లీ కూలీ.. ఎంత కాస్ట్లీ అంటే ఏకంగా 1368 కోట్లతో ఎన్నికల బాండ్లు కొనుగోలు చేసేంత.. ఇంతకీ ఎవరు అతడు.. ఎందుకు ఆ స్థాయిలో ఎన్నికల బాండ్లు కొనుగోలు చేశాడు.. ఒక కూలి నుంచి డబ్బున్న వ్యక్తిగా ఎలా ఎదిగాడు. దీనికి అతడు ఎంచుకున్న మార్గం ఏమిటి..

    శాంటియాగో మార్టిన్ (Shantiago Martin) ఇతడి స్వస్థలం తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరు. పేద కుటుంబం కావడంతో పెద్దగా చదువుకోలేదు. బతుకుదెరువు నిమిత్తం ముందుగా మాయమ్మ రాజధాని యాంగూన్ లో కూలి పనులు చేశాడు. ఆ ఆదాయం సరిపోకపోవడంతో 13 సంవత్సరాల వయసులోనే లాటరీ వ్యాపారం లోకి వచ్చాడు. అందులో కొంతవరకు సంపాదించాడు. అక్కడ ఎన్ని రోజులు ఉన్నా ఆదాయం పెరగదని భావించి 1988లో భారతదేశానికి తిరిగి వచ్చాడు. తన మాతృ రాష్ట్రం తమిళనాడులో లాటరీ వ్యాపారం ప్రారంభించాడు. కర్ణాటక, కేరళ, పశ్చిమ బెంగాల్, పంజాబ్, మహారాష్ట్ర, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, మేఘాలయ, నేపాల్, భూటాన్ వంటి రాష్ట్రాలకు తన వ్యాపారాన్ని విస్తరించాడు. కేవలం లాటరీ వ్యాపారం ద్వారా వేల కోట్లు సంపాదించాడు. అయితే ఇతడు అనేక అక్రమాలకు పాల్పడ్డాడని, అవకతవకల ద్వారా ప్రజలను మోసం చేశాడని ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు తొలిసారిగా ఇతడు నిర్వహిస్తున్న వ్యాపారులపై దాడులు చేశారు. అయితే ఇతడి వ్యాపార కార్యాలయాలు మొత్తం కేవలం కాగితాల పైనే ఉన్నాయి. రికార్డుల ప్రకారం పంజాబ్ లోని లూథియానా లో ఉన్న ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్ కార్యాలయం చిరునామా వద్దకు వెళ్తే.. అక్కడ అటువంటిది ఏమీ లేదని తేలింది. ఇక దేశవ్యాప్తంగా, ఇతర దేశాలలోనూ మార్టిన్ అడ్డగోలుగా వ్యాపారం చేశాడని.. అక్రమాలకు పాల్పడ్డాడని ఆరోపణలున్నాయి. 2019-23 సంవత్సరానికి సంబంధించి మార్టిన్ సంస్థ ఫ్యూచర్ గేమింగ్ ఆదాయం 215 కోట్లే. కానీ, రూ. 1,368 కోట్ల ఎన్నికల బాండ్లను ఫ్యూచర్ సంస్థ కొనుగోలు చేయడం విశేషం. 2022లో ఖాతాలను నిలుపుదల చేసినప్పటికీ 2023లో 100 కోట్లను ఫ్యూచర్ సంస్థ విరాళంగా ఇచ్చిందంటే మార్టిన్ అక్రమ సంపాదన అర్థం చేసుకోవచ్చు. గత ఏడాది జూలై 6న 100 కోట్ల విలువైన బాండ్లను మార్టిన్ సంస్థ కొనుగోలు చేసింది. 2022లోనే 400 కోట్లకు పైగా ఆస్తులను ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు అటాచ్ చేసినప్పటికీ.. ఫ్యూచర్ సంస్థ ఖాతాలు నిర్వహించడం, వందల కోట్ల విరాళాలు ఇవ్వడం విశేషం.

    మార్టిన్ వ్యాపారాలపై 2019 సెప్టెంబర్ 23న కేంద్ర హోంశాఖ పాలు రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది.. అతడిని మోసగాడు అని పేర్కొంది. హోం శాఖ ఈ హెచ్చరికలు జారీ చేసిన కొద్ది రోజుల్లోనే మార్టిన్ ఎన్నికల బాండ్లు కొనుగోలు చేయడం విశేషం. కేవలం ఆ ఒక్క నెలలోనే అతడు ఏకంగా 190 కోట్ల ఎన్నికల బాండ్లు కొనుగోలు చేశాడు. అప్పటినుంచి ఈ ఏడాది జనవరి దాకా 1,368 కోట్ల విలువైన బాండ్లు కొనుగోలు చేసిన వ్యక్తిగా మార్టిన్ నిలిచాడు. మార్టిన్, అతడు నిర్వహిస్తున్న సంస్థలపై పన్ను ఎగవేతలు, మనీ లాండరింగ్, మోసం, అక్రమాలు వంటి ఆరోపణలు ఉన్నాయి. 2011 నుంచి ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు, ఆదాయపు పన్ను అధికారులు అతనిపై దృష్టి సారించాయి. లోతుగా దర్యాప్తు చేస్తే అతడు కోయంబత్తూరులో భూ ఆక్రమణలకు పాల్పడ్డాడని, మోసాలు చేశాడని, దౌర్జన్యాలకు దిగడంతో ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు కేసులు నమోదు చేశారు. కేరళ లాటరీ లో అక్రమాలకు పాల్పడినందుకుగానూ మార్టిన్ పై అక్కడి ప్రభుత్వం కేంద్ర హోం శాఖకు ఫిర్యాదు చేసింది. అంతేకాదు అతడి సిక్కిం స్టేట్ లాటరీ కార్యకలాపాలపై నిషేధం విధించింది. సిబిఐ కూడా మార్టిన్ పై పలు కేసులు నమోదు చేసింది. లాటరీ వ్యాపారంలో బహుమతి మొత్తాన్ని పెంచి.. ప్రజల నుంచి 1000 కోట్ల వరకు మార్టిన్ అక్రమంగా సంపాదించాడనే ఆరోపణలు ఉన్నాయి. 2019 ఆరంభంలో ఫ్యూచర్ సంస్థపై ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు దృష్టి సారించారు. అది సాగిస్తున్న అక్రమ కార్యకలాపాలపై నిఘా పెట్టారు. క్షేత్రస్థాయిలో పరిశీలన అనంతరం ఆ ఏడాది జూలైలో 250 కోట్ల ఆస్తులను ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు అటాచ్ చేశారు. 2022 ఏప్రిల్ 2న ఇదే కేసులో 409 కోట్ల చరాస్తులనూ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు ఫ్రీజ్ చేయడం విశేషం. ఇది జరిగిన ఐదు రోజులకే మార్టిన్ ఏకంగా 100 కోట్ల ఎన్నికల బాండ్లు కొనుగోలు చేశాడు. అయితే ఇతడు ఏ పార్టీ కోసం ఎక్కువ డబ్బులు ఖర్చు చేశాడనేది ఇప్పటివరకు తెలియ రాలేదు.