Rythu Runa Mafi: రైతుల పంట రుణాలు మాఫీ చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. 2018 ఎన్నికల సమయంలో ఇచ్చిన రూ.లక్ష రుణమాఫీ హామీ నెరవేర్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. మరో నాలుగు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉండడం.. పంట రుణాలు మాఫీ చేయకపోవడంపై రైతుల్లో బీఆర్‌ఎస్‌పై తీవ్ర వ్యతిరేకత ఉంది. ఈ నేపథ్యంలో రుణాలు త్వరలోనే రద్ద చేయాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది. కరోనా సాకుతో ప్రభుత్వం నాలుగున్నరేండ్లుగా రైతుల లోన్లు మాఫీ చేయలేదు. దీంతో లక్షల మంది రైతులు ఎగవేతదారులు(డిఫాల్టర్లు)గా మారారు. బ్యాంకర్లు లోన్లు చెల్లించాలని వారిపై ఒత్తిడి పెంచుతున్నారు. దీంతో ప్రభుత్వంపై రైతుల్లో వ్యతిరేకత పెరుగుతోంది.
రుణ మాఫీ చేయకుంటే ముప్పే..
పంట రుణాలు మాఫీ చేయకుంటే రైతులంతా వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా పని చేయడం ఖాయమని ఆ పార్టీ అంతర్గత సర్వేలో తేలింది. ఇంటలిజెన్స్ కూడా ఈమేరకు నివేదిక ఇచ్చింది. దీంతో ప్రగతి భవన్ వర్గాలు అలర్ట్‌అయ్యాయి. సెప్టెంబర్ నెలాఖరు నాటికి పంట రుణాలన్నీ మాఫీ చేయాలని నిర్ణయించినట్టుగా సమాచారం. ఇందుకు అవసరమైన నిధులు సమీకరించాలని ఆర్థిక శాఖకు ఆదేశాలిచ్చినట్టుగా ప్రభుత్వవర్గాలు చెప్తున్నాయి.
ఇప్పటి వరకు 6 శాతం మందికే మాఫీ..
2018, డిసెంబర్11 నాటికి ఉన్న పంట రుణాలను వడ్డీతో కలిపి రూ.లక్ష వరకు మాఫీ చేస్తామని బీఆర్‌ఎస్ మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. అసెంబ్లీ వేదికగానూ సీఎం కేసీఆర్ ఇదే విషయం చెప్పారు. నాలుగేళ్లలో రైతులను రుణ విముక్తులను చేస్తామని ప్రకటించారు. ప్రభుత్వం ప్రకటించిన కటాప్ తేదీ నాటికి రాష్ట్రంలో 40.66 లక్షల మంది రైతులకు రూ.25,936 కోట్ల (రూ.లక్ష లోపు) రుణం ఉన్నట్టుగా నిర్దారించారు. ఒక కుటుంబంలో ఒక్కరికే ప్రయోజనం పేరుతో ఇందులో 3.98 లక్షల మందిని అనర్హులుగా ప్రకటించారు. 36.68 లక్షల మందికి చెందిన రూ.19,198.38 కోట్లు మాఫీ చేయాల్సి ఉందని లెక్కగట్టారు. కానీ, ఇప్పటి వరకు 5.66 లక్షల మందికి చెందిన రూ.1,207 కోట్లు మాత్రమే మాఫీ చేశారు. రూ.60 వేల వరకు రైతులు తీసుకున్న లోన్లు మాఫీ చేశామని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ.. రూ.37 వేల వరకు ఉన్న రుణాలు మాత్రమే మాఫీ అయ్యాయి. రుణమాఫీ చేయాల్సిన వారిలో వీరి సంఖ్య 6 శాతం మాత్రమే. మిగతా లోన్లు మాఫీ చేయాల్సి ఉంది. ఈ రైతుల సంఖ్య భారీగా ఉండటంతో మాఫీ చేయకుంటే వారంతా రివర్స్‌అయ్యే ప్రమాదముందని ప్రభుత్వానికి సంకేతాలు అందాయి. రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో గత ఎన్నికల హామీని నెరవేర్చకుండా మళ్లీ గెలవడం కష్టమని నిర్దారణకు వచ్చారు. ఈనేపథ్యంలో రుణమాఫీ చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు.
రైతులకు భారంగా రుణాలు
రైతుబంధు, బీమా, ఉచిత కరెంట్‌ఇస్తున్నా రుణమాఫీ చేయకపోవడంతో రైతులు సర్కారుపై అసంతృప్తితో ఉన్నారు. దీంతో రైతు కుటుంబాల ఓట్లు దూరమయ్యే ప్రమాదముందని హెచ్చరికలు అందాయి. ఆయా కుటుంబాలకు ఇతర పథకాలు అందుతున్నా పంట రుణాలు వారికి గుదిబండగా మారాయి. కొన్ని చోట్ల రైతుబంధు మొత్తాన్ని బ్యాంకర్లు పాత లోన్ల రీపేమెంట్ కింద కట్ చేశారు. ఇది కొంప ముంచుతుందనే భయంతో అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఆయా బ్యాంక్‌అధికారులతో మాట్లాడి రైతుబంధు మొత్తాన్ని రైతులకు చెల్లించేలా ఒప్పించారు. సర్వేలు, ఇంటెలిజెన్స్ రిపోర్టులు, ప్రజాప్రతినిధుల విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని, ఆర్థికంగా ప్రతిబంధకాలున్నా రుణమాఫీ చేయడం వైపే ప్రభుత్వ మొగ్గు చూపుతుందని సమాచారం.