KCR vs Journlists : తెలంగాణకు కేసీఆర్ చక్రవర్తిలా మారిపోయారా? రెండు సార్లు గెలిచిన కేసీఆర్ మూడోసారి సమరోత్సాహంతో ఊగిపోతున్నారా? అంతేకాదు.. తాను గీసిందే గీత.. రాసిందే రాత అంటున్నాడా? ప్రజాస్వామిక దేశంలో అప్రజస్వామికంగా వ్యవహరిస్తున్నారా? అంటే ఔననే నినదిస్తున్నారు జర్నలిస్టులు. ‘తనకు భజన చేసే వారికే ఇళ్లు ఇస్తాను.. వ్యతిరేకంగా వార్తలు రాసే జర్నలిస్టులకు ఇళ్లు ఇవ్వనంటూ’ తాజాగా సీఎం కేసీఆర్ తెగేసి చెప్పేశాడు. తనకు వ్యతిరేకంగా రాసే మీడియాకు హెచ్చరికలు పంపారు.
తెలంగాణలో కేసీఆర్ కు వ్యతిరేకంగా వార్తలు రాసే పత్రికలు, మీడియా చానళ్ల జర్నలిస్టులకు ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఇవ్వనంటూ కేసీఆర్ తేల్చిచెప్పారు. బీఆర్ఎస్ అభ్యర్థుల లిస్ట్ ప్రకటన సందర్భంగా తమ గురించి వ్యతిరేక వార్తలు రాస్తున్న వాటిని ఊరికే వదిలిపెట్టమంటూ కేసీఆర్ హెచ్చరికలు జారీ చేశారు. అంతేకాదు.. తమకు వ్యతిరేకంగా రాసే పేపర్లకు అసలే ఇళ్ల స్థలాలు ఇవ్వమని ప్రకటించారు. మిగతా అందరికీ ఇస్తామని తెలిపారు. ఇది ప్రభుత్వ నిర్ణయమని.. పొద్దున లేస్తే తమకు వ్యతిరేకంగా రాస్తే ఎందుకు ఇస్తామండి అంటూ కేసీఆర్ ఫైర్ అయ్యారు.
ఆ జర్నలిస్టులకు ఇళ్లు ఇవ్వం: KCR -TV9#BRS #KCR #TV9Telugu pic.twitter.com/pCsuBEZdep
— TV9 Telugu (@TV9Telugu) August 21, 2023
‘ఆ పత్రికల జర్నలిస్టులకు ఎందుకియ్యాలి? పాలు పోసి పామును పెంచలేం కదా? న్యూట్రల్ గా ఉన్న వాళ్లకు ఇస్తామని.. ఎవరైతే ప్రభుత్వం మీద, రాష్ట్ర ప్రగతి మీద విమర్శలు చేసే వారు ఉన్నారో ఆ విలేకరులకు ఇళ్లు ఇవ్వం’ అని కేసీఆర్ అన్నారు. రాష్ట్ర ప్రగతికి విఘాతం కలిగించే అలాంటి జర్నలిస్టులకు ఎందుకు ఇవ్వాలంటూ కేసీఆర్ ఎదురు ప్రశ్నించారు.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాసేముందు జర్నలిస్టులకు ఐడియా ఉండాలని.. కీలుబొమ్మలా ఉన్నోడు జర్నలిస్టు అంటారా? అండీ అంటూ కేసీఆర్ ప్రశ్నించారు. రాసే ముందు జ్ఞానం, సోయి ఉండాలన్నారు. ఇండియాలో తమతో పోల్చుకోవడానికి కూడా భయపడుతున్న రాష్ట్రంలో ‘ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తేదీన జీతాలు పడుతలేవు’ అని రాస్తున్నారని.. ఒకే సారి 20వేల కోట్లు మాఫీ చేసిన మా కెపాసిటీనే శంకించారని.. ఆ పత్రిక తలకాయ ఎక్కడ పెట్టుకోవాలని కేసీఆర్ ప్రశ్నించారు. అదొక పేపరా? దానికి విలువ ఉందా? అని కేసీఆర్ తూర్పారపట్టారు. ద బెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా అని ఆర్బీఐ, నీతి అయోగ్ రిపోర్ట్ ఇస్తే.. కేంద్రమంత్రులు పార్లమెంట్ లో లిఖిత పూర్వక సమాధానం ఇచ్చినా ఆ పత్రిక తప్పుడు రాతలు రాస్తుందని.. పొద్దున్న లేస్తే ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాయడం జర్నలిజమా? అంటూ కేసీఆర్ నిలదీశారు. కుల పత్రికలు కావు అవి గుల పత్రికలంటూ ఫైర్ అయ్యారు.
కేసీఆర్ మాటలపై ఆయా పత్రికలు, మీడియా జర్నలిస్టులు ఫైర్ అవుతున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు అందరినీ సమానంగా చూడాలని.. ప్రతిపక్షాలు, మీడియా నాలుగో స్తంభం అని.. విమర్శలను తీసుకొని ప్రభుత్వాలు మంచి చేయాలని.. కానీ వ్యతిరేకంగా రాసే వారి గొంతు నొక్కేస్తారా? అని నిలదీస్తున్నారు.
పత్రికలు అంటే నీ ఫార్మ్ హౌస్ లో పనిచేసే పాలేర్లు అనుకుంటున్నావా కేసీఆర్? మీడియా అంటే నీ గడీల ముందు పడిగాపులుగాసే బానిసలు అనుకుంటున్నావా? నీ నియంత సామ్రాజ్యాన్ని నిజాలతో కూల్చే ధిక్కార స్వరాలు వారు.. మాటలు జాగ్రత్త కేసీఆర్.. అధికారం శాశ్వతం కాదు. pic.twitter.com/zd34mv5obg
— Rajkiran (RK) (@Rajkiran071989) August 21, 2023
‘పత్రికలు అంటే నీ ఫార్మ్ హౌస్ లో పనిచేసే పాలేర్లు అనుకుంటున్నావా కేసీఆర్? మీడియా అంటే నీ గడీల ముందు పడిగాపులుగాసే బానిసలు అనుకుంటున్నావా? నీ నియంత సామ్రాజ్యాన్ని నిజాలతో కూల్చే ధిక్కార స్వరాలు వారు.. మాటలు జాగ్రత్త కేసీఆర్.. అధికారం శాశ్వతం కాదు.’ అంటూ సోషల్ మీడియాలో పలువురు జర్నలిస్టులు పోస్టులు పెడుతున్నారు.