KCR Centiment Politics: తెలంగాణ సీఎం కేసీఆర్ బయటకు వస్తున్నాడంటే దానివెనుక రాజకీయం ఖచ్చితంగా ఉంటుంది. ఈ మధ్యకాలంలో కలెక్టరేట్ల ప్రారంభం పేరిట రాష్ట్రమంతా కేసీఆర్ టూర్లు వేస్తున్నారు. ఇదివరకూ మంత్రులతో ప్రారంభించే ఇలాంటివన్నీ కేసీఆర్ స్వయంగా వచ్చి మరీ ప్రారంభిస్తుండడం వెనుక తరుముకొస్తున్న బీజేపీ ఉందని అంటున్నారు.

బీజేపీ ఓవైపు ప్రజల్లోకి బలంగా వెళుతోంది. ఆదమరిస్తే కమ్మేసేలా ఉన్నారు. అందుకే చేసిన కాస్తంత అభివృద్ధిని అయినా బయటకు చెప్పుకోవాలంటే ప్రగతి భవన్ కోట వదిలి ప్రజల్లోకి వెళ్లాలి. కేసీఆర్ ఇప్పుడు అదే చేస్తున్నాడని అంటున్నారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ వస్తున్నాడంటే ఆ మాత్రం మందీ మార్బలం లేకుంటే ఎట్లా.. అందుకే పెద్ద పల్లి జిల్లా కలెక్టరేట్, టీఆర్ఎస్ భవన్ ల ప్రారంభోత్సవానికి జనసమీకరణ బాధ్యతలు, ఏర్పాట్లను ముగ్గురు మంత్రులకు అప్పగించారట.. హరీష్ రావు హైదరాబాద్ శామీర్ పేట నుంచి పెద్దపల్లి వరకూ 5వేల కార్లతో కేసీఆర్ వెంట భారీర్యాలీ నిర్వహించారు. ఇందుకు ఖర్చు తడిసి మోపేడైందట.. ఇక ఫ్లెక్సీలు, బ్యానర్ల బాధ్యతలు మరో మంత్రి గుంగల కమలాకర్ కు అప్పగించారు. ఇక పెద్దపల్లి జిల్లా మంత్రి కొప్పుల ఈశ్వర్ కు జనసమీకరణ బాధ్యతలు ఇలా కేసీఆర్ కోసం ముగ్గురు మంత్రులు చచ్చీ చెడీ ఇవంతా చేశారు.
జనాలను ఎలాగోలా డబ్బులిచ్చో బతిమిలాడో తీసుకొచ్చారు. సభకు వచ్చిన జనాల ముందు కేసీఆర్ అదే అస్త్రం ప్రయోగించారు. మోడీని విలన్ చేసేలా.. తెలంగాణ బీజేపీ నేతల ఆత్మగౌరవం లేనివాళ్లు అంటూ ప్రొజెక్ట్ చేసేలా మాట్లాడారు. కార్పొరేట్లకు దోచిపెడుతున్న గుజరాతీ దొంగల బూట్లు మోసే సన్నాసులు అంటూ అటు మోడీని, ఇటు బండి సంజయ్ పై పరోక్షంగా కేసీఆర్ చేసిన విమర్శలు హాట్ టాపిక్ గా మారాయి. శ్రీలంకలో మోడీ తన ఫ్రెండ్ అదానీకి ప్రాజెక్టులు కట్టబెట్టేందుకు అవినీతికి పాల్పడ్డారని కేసీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. ఇక బండి సంజయ్ బూట్లూ మోశాడని.. ఇలాంటి తెలంగాణ ఆత్మగౌరవం గుజరాతీ, ఢిల్లీ నేతల వద్ద తాకట్టు పెట్టే నేతలు అవసరమా? అని సెంటిమెంట్ రాజకీయం షురూ చేశారు.
ఇదివరకూ కూడా 2018 అసెంబ్లీ ఎన్నికల వేళ టీడీపీతో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ ను ఓడించేందుకు ఇదే తెలంగాణ ఆత్మగౌరవ నినాదాన్ని కేసీఆర్ చేపట్టారు. అప్పుడు సక్సెస్ అయ్యింది. ఇప్పుడు బండి సంజయ్ చెప్పులు మోసిన వైనాన్ని కేసీఆర్ ఫోకస్ చేస్తున్నారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీ పెద్దల వద్ద తాకట్టు పెడుతున్నాడని ప్రచారం ప్రారంభిస్తున్నారు.. మోడీ, షాలను కార్పొరేట్లకు దోచిపెట్టే.. రైతుల ఉసురు తీసుకునే వాళ్లుగా ప్రొజెక్ట్ చేస్తున్నట్టు అర్థమవుతోంది. మరి కేసీఆర్ ఈ కొత్త ‘ఆత్మగౌరవ సెంటిమెంట్ ’ ఫలిస్తుందా? వచ్చే ఎన్నికల వరకూ దీన్నే కొనసాగిస్తాడా? బీజేపీని ఓడిస్తాడా? అన్నది చూడాలి. ఇక దీనికి బీజేపీ ఎలాంటి కౌంటర్ ప్లాన్ రెడీ చేస్తుందన్నది వేచిచూడాలి.