Kavitha BJP KCR : నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను లాగేందుకు బీజేపీ ఏజెంట్లు చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. వాళ్లను పట్టుకొని దేశవ్యాప్తంగా కేసీఆర్ గగ్గోలు పెట్టారు. ఇక ఈ నలుగురినే కాదు.. తన కూతురు, ఎమ్మెల్సీ కవితను బీజేపీలో చేర్చుకునేందుకు ప్రయత్నించారని నిన్న తెలంగాణ భవన్ లో కేసీఆర్ బాంబు పేల్చారు. తెలంగాణ భవన్‌లో జరిగిన టీఆర్‌ఎస్ శాసనసభా పక్షం, పార్లమెంటరీ పార్టీ, రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశంలో కేసీఆర్ ప్రసంగిస్తూ, బీజేపీ తన పునాదులను విస్తరించుకునేందుకు టీఆర్‌ఎస్ శాసనసభ్యులను వేటాడిందని ఆరోపించారు.

“పాపం ఏంటంటే.. నా సొంత కూతురు కల్వకుంట్ల కవితను కూడా బీజేపీ నేతలు చేర్చుకునేందుకు ప్రయత్నించారు. ఆమెను బీజేపీలోకి ఫిరాయించాలని కోరుతూ ఫీలర్లు పంపారు. రాష్ట్రంలోని టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని బీజేపీ, కేంద్ర ప్రభుత్వం ఏ మేరకు అస్థిరపరచబోతున్నాయో ఇది స్పష్టంగా తెలియజేస్తోందని’ కేసీఆర్ సంచలన కామెంట్స్ చేశారు.
పార్టీ శాసనసభ్యులను తమ పార్టీలోకి లాక్కోవడానికి బిజెపి చేస్తున్న ప్రయత్నాల పట్ల జాగ్రత్తగా ఉండాలని పిలుపునిచ్చిన టిఆర్ఎస్ చీఫ్, సిబిఐ లేదా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ద్వారా కేసులు పెడతామని బెదిరించినా, కాషాయ పార్టీకి లొంగిపోవద్దని కోరారు.
‘‘ఇక నుంచి బీజేపీ తన కార్యాచరణను ముమ్మరం చేసి టీఆర్‌ఎస్‌పై, రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతుంది. బీజేపీపై యుద్ధం ప్రకటించాం కాబట్టి టీఆర్‌ఎస్ నేతలు చాలా జాగ్రత్తగా ఉండాలి. వివాదాస్పద అంశాల జోలికి వెళ్లి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేందుకు బీజేపీకి స్కోప్ ఇవ్వకండి’ అని ఆయన అన్నారు.
ఈడీ, సీబీఐ దాడులకు భయపడవద్దని కూడా ముఖ్యమంత్రి వారికి సూచించారు. “మేము వారిని విడిచిపెట్టాల్సిన అవసరం లేదు. ఎక్కడ సీబీఐ, ఈడీ దాడులు జరిగినా తిరుగుబాటు చేసి తరిమి కొట్టాలి. ఎక్కడ దాడులు చేసినా ధర్నాలు, ఆందోళనలు చేపట్టండి’’ అని వారికి సూచించారు.
చివరగా బీజేపీలో చేరకుండా కేసీఆర్ గట్టి పాచికనే వేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ పార్టీ టికెట్లు ఇస్తానని ప్రకటించారు. ఈ ప్రకటన చేయకుంటే వీళ్లంతా ఇప్పుడే బీజేపీలోకి వెళ్లిపోతారని కేసీఆర్ భయపడిపోతున్నారు. అందుకే వ్యూహాత్మకంగా సిట్టింగ్ లందరికీ సీట్లు అని సంచలన ప్రకటన చేశారు. ప్రజల్లోకి వెళ్లి వారి విశ్వాసాన్ని సంపాదించాలని.. ఇక ఏడాది ప్రజల్లోనే ఉండాలని సూచించారు.
కేసీఆర్ కూతురు కవిత ప్రస్తుతం పార్టీలో ప్రాధాన్యత లేకుండా ఉంది. నిజామాబాద్ ఎంపీగా ఓడాక కేసీఆర్ పక్కనపెట్టారు. ఢిల్లీ లిక్కర్ స్కాం ఆరోపణలతో ఆమెకు ప్రాధాన్యత తగ్గింది. టీఆర్ఎస్ లో దూరం పెడుతున్నారు. ఇక ఎమ్మెల్సీ పదవిని మొక్కుబడిగానే ఇచ్చారు. అందుకే అసంతృప్తితో ఉన్న కవితను బీజేపీ గాలం వేసింది. కానీ తండ్రి చాటు బిడ్డ అయిన కవిత మాత్రం బీజేపీకి లొంగకుండా కేసీఆర్ పరువు కాపాడిందనే చెప్పాలి. నిజంగా కవిత బీజేపీలో చేరితే మాత్రం కేసీఆర్ తల కొట్టేసినంత పని అయ్యిండేది. బీజేపీ దాడులను కేసీఆర్ ఎలా కాచుకుంటాడన్న దానిపైనే ఆయన పార్టీ గెలుపోటములు ఆధారపడి ఉన్నాయి.