https://oktelugu.com/

Kashmir: నిండు చలికాలంలో ఎండలు.. కాశ్మీర్ కు ఏమైంది?

కాశ్మీర్ ప్రాంతం సంవత్సరం మొత్తంలో ఒకటి లేదా రెండు నెలలు మాత్రమే పొడి వాతావరణాన్ని కలిగి ఉంటుంది. కానీ ఈ ఎడాది అందుకు భిన్నంగా పరిస్థితి ఉంది. కాశ్మీర్లో అత్యంత చల్లటి ప్రాంతమైన గుల్మార్గ్ లో ప్రస్తుతం పోటీ వాతావరణం నెలకొంది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : January 21, 2024 6:46 pm
    Kashmir

    Kashmir

    Follow us on

    Kashmir: రక్తం గడ్డకట్టే చలి. ఎముకలు కొరికే శీతల గాలులు..దట్టంగా కురిసే మంచు.. అడుగు తీసి ఆడికి వేద్దామంటే ఎక్కడ వణికిపోతామనే భయం.. ఎటు చూస్తే అటు శ్వేత వర్ణంలో మెరిసిపోయే పరిసరాలు.. కాశ్మీర్ గురించి ప్రస్తావనకు వస్తే మన మదిలో పై అంశాలే మెదులుతాయి. పైగా శీతాకాలంలో అయితే చలి తీవ్రత మరింత అధికంగా ఉంటుంది. మంచు కూడా విపరీతంగా కురుస్తుంది. ఇలాంటి వాతావరణాన్ని ఆస్వాదించడానికి ఎక్కడెక్కడ నుంచో పర్యాటకులు వస్తుంటారు. ఇక్కడి శీతల వాతావరణంలో సందడి చేస్తుంటారు. అయితే సుందరకాశ్మీరంలో ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదు. దట్టంగా కురిసే మంచు స్థానంలో ఎండలు దంచి కొడుతున్నాయి. చలిగాలుల స్థానంలో పొడి వాతావరణం నెలకొంది. మంచులో సయాటలాడే పర్యాటకులు కాస్త తమ ప్రయాణాన్ని రద్దు చేసుకుంటున్నారు. దేశం మొత్తం చలి వాతావరణం ఉంటే.. కాశ్మీర్లో ఇలా ఎందుకు అయింది పరిస్థితి.. అసలు హిమగిరులకు దగ్గరగా ఉండే కాశ్మీర్లో ఎందుకు ఇంతటి విభిన్న వాతావరణం ఏర్పడింది. ఈ కథనంలో తెలుసుకుందాం.

    కాశ్మీర్ ప్రాంతం సంవత్సరం మొత్తంలో ఒకటి లేదా రెండు నెలలు మాత్రమే పొడి వాతావరణాన్ని కలిగి ఉంటుంది. కానీ ఈ ఎడాది అందుకు భిన్నంగా పరిస్థితి ఉంది. కాశ్మీర్లో అత్యంత చల్లటి ప్రాంతమైన గుల్మార్గ్ లో ప్రస్తుతం పోటీ వాతావరణం నెలకొంది. మంచుతో నిండి ఉండాల్సిన పర్వతాలు గోధుమ వర్ణంలో కనిపిస్తున్నాయి. పర్వతాలపై మంచు లేకపోవడంతో స్కీయింగ్ చేసే అవకాశం లేకుండా పోయింది. దీంతో పర్యాటకులు కాశ్మీర్ సుదర్శనలను రద్దు చేసుకుంటున్నారు. గత ఏడాది ఇదే నెలలో సుమారు లక్ష మంది పర్యాటకులు కాశ్మీర్ ప్రాంతాన్ని సందర్శించారు.. అయితే ఈ ఏడాది మంచు కురవకపోవడంతో గత ఏడాదిలో సగం కంటే తక్కువ మంది పర్యాటకులు కాశ్మీర్ ప్రాంతాన్ని సందర్శించారు. చాలామంది తమ హోటల్ గదులను క్యాన్సల్ చేసుకోవడంతో వ్యాపారాలు దెబ్బతిన్నాయి. కాశ్మీర్ జిడిపిలో పర్యాటక రంగం బాట ఏడు శాతం వరకు ఉంటుంది.. మంచులేని చలికాలం వల్ల పర్యాటకులు తగ్గిపోవడంతో ఆ ప్రభావం ప్రభుత్వ ఆదాయం మీద పడే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

    మంచు కురవకపోవడం కేవలం పర్యాటకం మీదనే కాకుండా అక్కడి భూగర్భ జలాల మీద కూడా ప్రభావం చూపిస్తుందని స్థానికులు అంటున్నారు. అక్కడి వాతావరణ శాఖ చెప్పిన ప్రకారం డిసెంబర్లో 79%, జనవరిలో 100% లోటు వర్షపాతం నమోదయింది. అంతేకాదు అనేక ప్రాంతాల్లో ఆరు నుంచి 8° వరకు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పర్యాటకులు రాకపోవడంతో… వచ్చే అరకొర మంది కూడా గుర్రపు బగ్గీ ప్రయాణం చేసే పరిస్థితి లేకపోవడంతో నిరుత్సాహంతో వెను తిరుగుతున్నారు. ఇక్కడ చాలామంది వ్యాపారులకు శీతాకాలంలో జరిగే వ్యాపారమే ప్రధానమైనది. ఈ సంవత్సరం ఆ పరిస్థితి లేకపోవడంతో చాలామంది వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారు. ఇక మంచు కుర్వకపోవడం వల్ల అది పర్యాటక రంగం పైనే కాకుండా జల విద్యుత్ ఉత్పత్తికి, చెరువుల్లో చేపలకు, వ్యవసాయానికి కూడా నష్టం కలిగిస్తుంది. జమ్మూ కాశ్మీర్లో వ్యవసాయం మొత్తం హిమాని నదాలపైనే ఆధారపడి ఉంటుంది. కాకపోతే ఇవి పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల వేగంగా కరిగిపోతున్నాయి. శీతాకాలంలో హిమపాతం లేకపోవడంతో నీటి బుగ్గలు అతిపెద్ద సమస్యను ఎదుర్కొంటున్నాయి.

    సాధారణంగా అయితే డిసెంబర్ 21 నుంచి జనవరి 19 వరకు అంటే దాదాపు 40 రోజులపాటు విపరీతంగా మంచి కురుస్తుంది. ఈ సమయంలో పర్వతాలు, హిమానినదాలు మంచుతో నిండిపోతాయి. ఇది ఏడాది మొత్తం జమ్మూ కాశ్మీర్ నీటి అవసరాలు, జల విద్యుత్, వ్యవసాయానికి సాగునీరు, భూగర్భ జలాల పెంపు, పర్యాటక రంగం వంటి అంశాలకు చోదక శక్తిలా ఉంటుంది. గత కొన్ని సంవత్సరాలుగా హిమపాతం తగ్గుతూనే ఉంది. 1990 కి ముందు హిమపాతం ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉండేది. దాదాపు మూడు అడుగుల మందంలో మంచు కురిసేది. కానీ రాను రాను ఆ పరిస్థితి మారుతుంది. కాలుష్యం పెరిగిపోవడం, వాతావరణంలో మార్పులు, పెరిగిపోయిన ప్లాస్టిక్ వినియోగం, సమీప ప్రాంతాల్లో కర్బన ఉద్గారాలు పెరిగిపోవడం వల్ల ఆ ప్రభావం హిమపాతంపై కనిపిస్తోంది. మంచు కురువకపోవడం ఆన్ని రంగాలలో మార్పునకు కారణమవుతోంది. చివరికి కాశ్మీర్ ప్రాంతంలో మాత్రమే పండే కుంకుమపువ్వు దిగుబడిపై కూడా హిమపాత లోటు కనిపిస్తోందని అక్కడి స్థానికులు అంటున్నారు.