Tollywood Theater mafia: టాలీవుడ్ ఎటు వెళుతోంది? ఏమై పోతోంది. చెత్త సినిమాలు తీస్తున్న అగ్ర నిర్మాతలు వాటిని ఎలా ఆడించాలో తెలియక సతమతమవుతున్నారు. ఇదే సమయంలో మంచి సినిమాలతో వస్తున్న వారిని చూసి ఓర్వలేక ఇదే అగ్రనిర్మాతలు వారికి థియేటర్లు దక్కకుండా.. ఆసినిమాలకు కలెక్షన్లు రాకుండా తొక్కేస్తున్నారు. అందుకే ఇప్పుడు టాలీవుడ్ లో మంచి సినిమాలు ఎలా బతికేది అని ‘నిఖిల్’ లాంటి హీరోలు వాపోతున్న పరిస్థితి నెలకొంది.

టాలీవుడ్ లో నలుగురైదుగురు అగ్ర నిర్మాతల చేతుల్లోనే థియేటర్లు మొత్తం ఉన్నాయి. వీరిందరూ ఒక మాఫియాలా మారి తమకే సినిమాకు తాము చెప్పిన ధరకే అమ్మాలని లేదంటే మీ సినిమాను ఆడనివ్వమని దోచుకుంటున్న పరిస్థితులు ఉన్నాయని చిన్న సినిమాలు తీసిన హీరోలు, దర్శకులు వాపోతున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఏపీ, తెలంగాణలోని థియేటర్లలో మెజార్టీ లీజుల పేరుతో ఇద్దరు ముగ్గురు మాఫియా నిర్మాతల చేతుల్లోనే ఉంటాయి.వారు అడిగిన రేటుకు సినిమాను అమ్మితే ఆ సినిమాల రిలీజ్ కు ఎటువంటి ఇబ్బందులు ఉండవు. థియేటర్లు కూడా పుష్కలంగా దొరుకుతాయి.
వీరికి కాకుండా సొంతంగా డిస్ట్రిబ్యూషన్ చేసినా.. వేరే వాళ్లకు సినిమా అమ్మినా ఇక పగబట్టి మరీ ఆ సినిమాను ఆడనీయకుండా ఈ థియేటర్ మాఫియా డాన్లు కుట్రలు చేస్తారని ఇండస్ట్రీలో కథలు కథలుగా చెబుతుంటారు. ఇటీవల ‘కార్తికేయ2’ సినిమాకు అవే ఇబ్బందులు ఎదురయ్యాయి.
ఆ అగ్ర నిర్మాత తన మూడు సినిమాలతో థియేటర్లన్నీ నింపేశాడు. దీంతో కార్తికేయ 2కు ఇప్పుడు థియేటర్లు లేవు. పాజిటివ్ హిట్ టాక్ వచ్చినా దాన్ని క్యాష్ చేసుకుందామంటే ఆ సినిమాను ఆడనివ్వని దుస్థితి టాలీవుడ్ లో నెలకొంది. ఇంతలా మంచి సినిమాలను ఈ థియేటర్ మాఫియా తొక్కేస్తుంటే ఇక సినిమాలు ఎలా తీయాలని సృజనాత్మక దర్శకులు వాపోతున్నారు. చేతులారా ఒక మంచి సినిమాను తొక్కేస్తుంటే ఎవ్వరూ గొంతెత్తని పరిస్థితి టాలీవుడ్ లో నెలకొంది.
ఈ సినిమాకు ఓ టాలీవుడ్ అగ్ర నిర్మాత కల్పించిన అడ్డంకులు అన్నీ ఇన్నీ కావు.. మొదట కార్తికేయ 2ను దేశవ్యాప్తంగా ప్యాన్ ఇండియా సినిమాగా జులై22న రిలీజ్ కు ప్లాన్ చేశారు. డేట్ కూడా ఫిక్స్ చేశారు. అయితే అదే సమయంలో ఆ అగ్ర నిర్మాత తన సొంత సినిమా రిలీజ్ డేట్ ను అదే రోజు ప్రకటించారు. దీంతో థియేటర్లు దొరకవని ఒత్తిడి తెచ్చి ‘కార్తికేయ2’ను వాయిదా వేయించాడు. అలా చేయకపోతే ‘కార్తికేయ2’కు నైజాంలో థియేటర్లు దొరకవని బెదిరించినట్టు సమాచారం. ఇక రిలీజ్ అయిన ఆ నిర్మాత సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యి ఒక్కరోజు కూడా ఆడలేదు. రెండోరోజుకే చాపచుట్టేసింది. ఈ సినిమా కోసం ‘కార్తికేయ2’ లాంటి మంచి కంటెంట్ ఉన్న సినిమాను అడ్డుకున్నాడు సదురు నిర్మాత. ఆ వారం మొత్తం ఖాళీగా తన ఆడని సినిమాకు ఇచ్చాడు తప్ప కార్తికేయను రిలీజ్ చేసుకోమని చెప్పిన పాపాన పోలేదు.
ఇక ఆ తర్వాత బింబిసార, సీతారామం సినిమాల విడుదలకు ఇదే నిర్మాత డిస్ట్రిబ్యూషన్ తీసుకొని ముందుకు రావడంతో మరోసారి నిఖిల్ ‘కార్తికేయ2’ను వాయిదా వేసుకోవాల్సి వచ్చింది.
ఇక లాంగ్ వీకెండ్ వచ్చిన ఆగస్టు 12కు తన సినిమా రిలీజ్ డేట్ ను ‘నిఖిల్’ ప్రకటించారు. కార్తికేయ 2 రిలీజ్ కు ఇదే సరైన సమయం అనుకున్నాడు. కానీ సదురు నిర్మాత ‘మాచర్ల నియోజకవర్గం’ రైట్స్ కొని అదే తేదీన రిలీజ్ డేట్ ప్రకటించారు. నైజాంలో థియేటర్లు దక్కకుండా కుట్ర చేశాడు. ఎంతలా అంటే హీరో నిఖిల్ తన సినిమాకు థియేటర్లు పెంచాలని సోషల్ మీడియాలో వేడుకునే దాకా పరిస్థితి వెళ్లింది. హీరో నిఖిల్ అభ్యర్థన చూసి చాలా మంది జాలిపడుతున్న పరిస్థితి నెలకొంది.
కానీ కట్ చేస్తే నిఖిల్ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చి మౌత్ పబ్లిసిటీతో హిట్ అవ్వగా.. సదురు నిర్మాత చిత్రం ఫ్లాప్ అయ్యింది. ఒకరిని తొక్కాలని చూసి కుట్రలు చేసి టాలెంట్ ను ఎంతగా అదిమి పట్టాలని చూస్తే అది అంతగా పైకి లేస్తుంది. ఇలాంటి నిర్మాతల వల్ల టాలీవుడ్ లో మంచి సినిమాలు బతకలేకపోతున్నాయి. ప్రేక్షకుల దగ్గరకు చేరలేకపోతున్నాయి. అందుకే కంటెంట్ ఉన్న వాళ్లు ఓటీటీ బాటపడుతున్నారు. ఇది అంతిమంగా సినిమా ఇండస్ట్రీ మనుగడకే దెబ్బపడి ప్రేక్షకుడు థియేటర్ కు రావడం మానేస్తున్నాడు.
ప్రేక్షకులు రెబల్ గా మారితే ఎలా ఉంటుందో బాలీవుడ్ దర్శక నిర్మాతలకు అర్థమైంది. ఇక్కడ టాలీవుడ్ లో కూడా అలాంటి పరిస్థితియే ఎదురు కావడానికి ఎన్నో రోజులు పట్టదు. కంటెంట్ ఉన్న సినిమాలను ఆదరిస్తేనే ఇండస్ట్రీకి భవిష్యత్ ఉంటుంది. ఇండస్ట్రీ బతకాలంటే మంచి సినిమాలకు అందరూ సహకరించాల్సిన అవసరం ఉంది. ఈ థియేటర్ మాఫియాకు అడ్డుకట్ట పడాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.